The Mind in Darkness - 2 in Telugu Short Stories by swathi books and stories PDF | చీకటిలో మనసు - 2

The Author
Featured Books
Categories
Share

చీకటిలో మనసు - 2

లక్ష్మి కళ్లలో నిప్పులు కురుస్తుండగా, గొంతులో వేదనతో అతడిని నిలదీసింది. "నిజమే.. నేను వేశ్యనే! కానీ నేను ఎలా అయ్యానో నీకు తెలుసా? నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు.. ఆకలితో రోడ్డు పక్కన ఏడుస్తుంటే జాలి చూపించకుండా తన్ని తరిమేశారు. ఆకలి తీర్చడానికి ఒక్క మెతుకు కూడా పెట్టని ఈ లోకంలో, ఒకడు నన్ను ఆశ్రయం ఇస్తానని ఇక్కడికి తెచ్చి వాడి  డబ్బు అవసరమని  అమ్మేశాడు. వయసు కూడా తెలియని స్థితిలో ఒక ముసలివాడికి నా శరీరాన్ని  వాడు  పువ్వు ను        నలిపినట్టు నలిపి నాకు నరకం చూపించాడు. అక్కడి నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతే, పని ఇస్తానన్న మరో మృగం నన్ను నమ్మించి నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా తన కోరిక తీరే వరకు వాడుకుంటూనే ఉన్నాడు అది సరిపోలేదని వాడు మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడు

ప్రతివాడు నా శరీరాన్ని చూశాడే తప్ప, నాకు ఒక మనసు ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అలాంటి సమయంలో నువ్వు వస్తే, నిన్ను చూసి నాకు కూడా ఒక మనసు ఉందని నమ్మాను. నిన్ను నా సర్వస్వంగా భావించి సమర్పించుకున్నాను. కానీ ఈరోజు నన్ను 'వేశ్య' అని ఎంత సులభంగా అన్నావు?

నిజం చెప్పు.. అసలు వేశ్య ఎవరు? నువ్వా ? నేనా?   నేను నీకు అక్కర్లేదు కానీ, నా డబ్బులు మాత్రం కావాలా? నీ నాన్న ప్రాణానికి, నీ చెల్లి పెళ్లికి, నీ ఇంటి మరమ్మతులకు నా డబ్బులు పవిత్రంగా అనిపించాయా? ఆ డబ్బులు తీసుకునేటప్పుడు నేను వేశ్యనని నీకు గుర్తు రాలేదా? నీకు సమాజంలో పేరు, గౌరవం, పలుకుబడి అన్నీ కావాలి.. కానీ వాటిని నిలబెట్టుకోవడానికి ఈ వేశ్య కష్టార్జితం కావాలి కానీ ఈ వేశ్య అవసరం లేదు 
ఒరేయ్! నీకంటే మేమే ఎంతో నయం రా. మేము పొట్టకూటి కోసం శరీరాన్ని అమ్ముకుంటాం, కానీ నువ్వు డబ్బు కోసం నీ మనసాక్షిని, మనిషిని అమ్ముకున్నావు. ఇప్పుడు చెప్పు.. మన ఇద్దరిలో అసలైన వేశ్య ఎవరు?" అని గట్టిగా నిలదీసింది.
లక్ష్మి మాటలకు అతడు సమాధానం చెప్పలేక, సిగ్గుతో తలదించుకుని శిలలా నిలబడిపోయాడు. అతని మౌనం ఆమె ప్రశ్నలకు ఓటమిని ఒప్పుకున్నట్టుగా అనిపించింది.

లక్ష్మి కళ్లలో కన్నీళ్లు సుడిగుండాలయ్యాయి. "నిన్ను నా భర్తగా భావించి, నీకు నచ్చిన రంగు చీర కట్టుకుని దేవతలా నీ ముందు నిలబడ్డాను. కానీ నువ్వు అన్న ఒక్క మాటతో నా మనసు ముక్కలైపోయింది. నా దృష్టిలో నువ్వు ఇప్పుడే చనిపోయావు!" అని గర్జిస్తూ.. అతని ముందే తనకు ఎంతో ఇష్టమైన  ఎరుపు రంగు చీరను విసిరికొట్టింది. అక్కడ ఉన్న తెల్లటి చీరను చుట్టుకుంది. నుదుటిపై బొట్టును చెరిపేసి, చేతి గాజులను పగలగొట్టుకుంది. తలలోని మల్లెపూలను చిందరవందరగా పీకి పక్కన పడేసింది

అప్పటి వరకు నిండుతనం తో మెరిసిపోయిన లక్ష్మీ
ఇప్పుడు  విధవలా మారిపోయిన ఆమెను చూసి అతను నివ్వెరపోయాడు. ఆమె బీరువా దగ్గరకు వెళ్లి, తన పెళ్లి కోసం దాచుకున్న డబ్బును చూసి విలపించింది. "ఎంత పిచ్చిదాన్ని! ఈ నరకం నుండి నాకు విముక్తి దొరుకుతుందని, నచ్చిన మనిషితో కొత్త జీవితం మొదలుపెట్టవచ్చని ఎన్ని కలలు కన్నాను! అత్తారింటికి వెళ్లేటప్పుడు పెట్టాల్సిన లాంఛనాల కోసం, నా పుట్టింటి గౌరవం కోసం రూపాయి రూపాయి దాచుకున్నాను. కానీ నా అదృష్టం నన్ను కాటేసింది.. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి" అని గుండెలు పగిలేలా రోదించింది.

వెంటనే తన కన్నీళ్లను తుడుచుకుని, సింహంలా మారింది. అతను ఇచ్చిన డబ్బును, తను దాచుకున్న డబ్బును కలిపి.. అతనికి దిష్టి తీసినట్టుగా తీసి అతని మొహం. కేసి కొట్టింది . "నువ్వు కాదురా.. నేనే చెబుతున్నాను! ఇకపై నా గుమ్మం తొక్కకు. నీ నీడ సోకినా నాకు అసహ్యం. ఇక్కడి నుండి వెళ్ళిపో!" అని అరుస్తూ, అతడిని బయటకు నెట్టివేసి తలుపులు గట్టిగా వేసుకుంది.

తలుపు వేసుకున్న తర్వాత లక్ష్మి ఒక్క క్షణం ఆలోచించింది. "నేను ఎందుకు ఏడవాలి? నా కన్నీళ్లకు అంత విలువ లేదా? ఒక దగాకోరు కోసం నా విలువైన కన్నీటిని వృధా చేయడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు!" అని తన కన్నీళ్లను తుడుచుకుంది. "నేను బతకగలను.. గౌరవంగా బతికి చూపిస్తాను. చీకటి బతుకుల్లో మగ్గుతున్న నాలాంటి ఎంతోమంది ఆడవాళ్లకు కొత్త దారి చూపిస్తాను" అని మనసులో గట్టిగా నిశ్చయించుకుంది.
ఆ రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా ఆ ఊరు విడిచి వెళ్ళిపోయింది. వేరే ఊరు వెళ్ళాక, తన ముఖానికి ఉన్న రంగును, తన గతాన్ని కడిగేసుకుంది. ఇప్పుడు ఆమెను చూస్తే ఒక వేశ్యలా కాకుండా, చూడగానే నమస్కారం పెట్టాలనిపించే ఒక ఆడసింహంలా మారిపోయింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ, తన కాళ్ళ మీద తాను నిలబడింది.
ఎవరైనా తనతో తప్పుగా ప్రవర్తించాలని చూస్తే, గూబ పగలగొట్టే ధైర్యాన్ని పెంచుకుంది. సమాజం తనను ఎలా చూస్తుందో అన్న భయం వదిలేసి, తనని తానే కాపాడుకునే 'పతి'గా (రక్షకురాలిగా) మారిపోయింది. చీకటి వృత్తిలో ఉన్న ఎంతోమంది మహిళలను వెలుగులోకి తీసుకువచ్చి, కష్టపడి బతికేలా మార్చి, వారందరికీ ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది.
చీకటిలో మనసు (చివరి భాగం)

కానీ విచిత్రం ఏమిటంటే.. లక్ష్మి పట్టుదలతో బతికితే బాగుండు అనిపిస్తుంది కానీ, తను అలా బతకలేదు! తను ఎవరినైతే ప్రాణంగా భావించిందో, ఆ వ్యక్తి నోటి నుండే 'వేశ్య' అనే మాట వినగానే అప్పుడే  ఆమె మానసికంగా అక్కడే చనిపోయింది. ఆ ఆవేదనతోనే తన శరీరాన్ని కూడా విడిచిపెట్టింది. ఈ లోకం మంచి, మానవత్వం లేదు అనుకోని తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీ.

కాసేపటికి ఒక పాత కస్టమర్ వచ్చి తలుపు తట్టాడు. లోపల ఎలాంటి చప్పుడు లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ నిర్జీవంగా పడి ఉన్న లక్ష్మి దేహాన్ని చూసి అతను నిశ్చేష్టుడైపోయాడు. అతనితో వచ్చిన మరో వ్యక్తి, "ఒరేయ్, ఈమె చనిపోయింది రా! ఇది పోలీస్ కేసు అవుతుంది, మనకు ఎందుకు ఈ గొడవ? పద వెళ్ళిపోదాం" అన్నాడు.
కానీ ఆ వ్యక్తి తల తిప్పాడు. "తప్పు రా.. మనం కూడా మనుషులమే. ఆవిడ చనిపోయింది, కనీసం ఊరి పెద్దలకు చెప్పడం మన బాధ్యత. అది చెప్పేసి మన దారిన మనం వెళ్దాం" అని ధైర్యం చెప్పాడు. వారు వెళ్ళి ఊరి పెద్దలకు విషయం చెప్పారు. కానీ ఆ ఊరి జనం మాత్రం, "ఛీ.. ఊరికి పట్టిన దరిద్రం వదిలింది" అంటూ ఈసడించుకుని వెళ్ళిపోయారు. ఆమె శరీరాన్ని అనుభవించిన వారు ఎంతో మంది ఉన్నా, ఒక్కరు కూడా ఆమెను కనీసం మనిషిలా చూడలేదు సరే కదా, ఒక పురుగును చూసినట్టు చూసి వెళ్ళిపోయారు.
కానీ, ఎవరో ఏమిటో తెలియదు కానీ.. ఆ రాత్రి లక్ష్మి దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తి మాత్రం ఆమెను అలా వదిలేయలేకపోయాడు. ఆమె వేశ్య అయివుండవచ్చు కానీ ఆమె ఒక ఆడదే కదా ఆమెకు మనసు ఉంటాది రా అన్నాడు. చీకటి పడ్డాక ఊరి పొలిమేరలకు వెళ్లి, తన చేతులతోనే లక్ష్మికి అంత్యక్రియలు చేశాడు. మరుసటి రోజున ఆమె ఆత్మశాంతి కోసం చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, మౌనంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ఒక మగాడు ఆమెను నమ్మించి మోసం చేస్తే.. తనతో కేవలం ఒక రాత్రి గడపాలని వచ్చిన మరో మగాడు, ఆమెలోని మనిషిని గుర్తించి ఆమెకు మనసు ఉంటుంది అని నమ్మి మానవత్వాన్ని చాటుకున్నాడు. లోకం ఆమెను వేశ్యగా చూసి ఛీత్కరించుకున్నా, ఆ అపరిచితుడు మాత్రం ఆమెకు గౌరవప్రదమైన ముగింపుని ఇచ్చి, మానవత్వం ఇంకా చావలేదని నిరూపించాడు.
ఒకవేళ లక్ష్మీ బతికి ఉంటే నిజం గా మానవత్వం
బతికి ఉందని తన రూపంలో చూసి బతికి ఉండేదేమో కానీ అలా జరగలేదు . తిరిగి రాని అనంత లోకలోని వెళ్ళిపోయింది లక్ష్మీ!

      శుభం