న్యూ అమరావతి వీధుల్లోని చీకటి అనేది కేవలం వెలుగు లేకపోవడం కాదు, అది వ్యవస్థ విస్మరించిన ఒక డేటా శూన్యం. ఆ సన్నని గల్లీలో నడుస్తున్న అద్వైత్ అడుగులు భయంతో తడబడుతున్నాయి. వెనుక వినిపిస్తున్న ఆ అడుగుల శబ్దం అతని గుండె వేగాన్ని పెంచుతుండగా, అతని మణికట్టులోని చిప్ మళ్ళీ వైబ్రేట్ అవ్వడం మొదలుపెట్టింది. భయం అనేది ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది ధర్మ-X కి ఒక సిగ్నల్ లాంటిది కూడా.
"నన్ను అనుసరించకు!" అంటూ అద్వైత్ వెనక్కి తిరగకుండానే వణుకుతూ అరవగా, అతని గొంతులోని ఆ వణుకు స్పష్టంగా కనబడింది. "నా స్కోర్ కేవలం 45%. నా వల్ల నీకు పోయేదే తప్ప ఒరిగేది ఏమీ లేదు.. దయచేసి నన్ను వెంబడించకు. ఇక్కడి నుండి వెళ్ళిపో!" అని తన స్కోరును అడ్డం పెట్టుకొని తప్పించుకోడానికి ప్రయత్నించాడు అద్వైత్.
కానీ అద్వైత్ మాటలకు ఏమాత్రం చలించకుండా ఆ నీడ అతని వెంబడిస్తూనే ఉంది. పైగా, ఆ అడుగులు మరింత నిశ్చయంగా ముందుకు పడ్డాయి. మరుసటి క్షణమే ఆ నీడ చీకటిని చీల్చుకుంటూ ఒక నియాన్ బోర్డు వెలుగులోకి వచ్చింది.
"నీ స్కోర్ 45% దగ్గర ఎందుకు ఆగిపోయిందో తెలుసా అద్వైత్?" అన్న ఆ గొంతులో ఒక రకమైన గంభీరత, ఎగతాళి కలిసినట్లు ఉన్నాయి. "ఇది నీలోని లోపం కాదు, ఇది ధర్మ-X ప్రోగ్రామ్ లోని ఒక భాగం... భవిష్యత్తులో నీ ఎదుగుదలని అంచనా వేసి ధర్మ-X భయపడింది. అందుకే నిన్ను ఒక స్తంభించిన డేటాగా లాక్ చేసి ఉంచింది."
ఆ విషయం వినగానే అద్వైత్ ఆశ్చర్యంతో ఆ వ్యక్తి వైపు అలాగే చూస్తుండిపోయాడు. ఆ వ్యక్తి ఒక పిచ్చివాడిలా కనబడుతున్నాడు కానీ, అతని కళ్లలో ఉన్న తీక్షణత అతన్ని సామాన్యుడిలా కనిపించనివ్వడం లేదు. అతను మరెవరో కాదు, ఈ ధర్మ-X వ్యవస్థ నుండి బహిష్కరించబడిన ఓ గ్లిచ్డ్ రెబెల్, లోహిత్..!
ఆ తర్వాత లోహిత్ నెమ్మదిగా తన చొక్కా చేతులు పైకి జరపగా, అక్కడ కనిపించిన దృశ్యం అద్వైత్ కడుపులో వికారాన్ని కలిగించి, వాంతులు వచ్చేలా చేసింది. లోహిత్ మణికట్టు వద్ద చిప్ ఉండాల్సిన చోట చర్మం కాలిపోయి, భయంకరమైన మచ్చలు ఉన్నాయి. అది ఏదో సర్జరీ లాగా కాకుండా, ఎవరో బలవంతంగా లోపల ఉన్న టెక్నాలజీని పీకేసినట్లు ఉంది.
"ఇవి ధర్మ-X నియమాలను ప్రశ్నించినందుకు నాకు దక్కిన బహుమానం.." అని లోహిత్ నవ్వుతూ చెప్పాడు. ఆ నవ్వులో బాధ కంటే వ్యవస్థపై ఉన్న అసహ్యమే ఎక్కువగా ఉంది. "మనం చేసే ప్రతి పనిని, ప్రతి ఆలోచనను డేటాగా మార్చే ఈ వ్యవస్థకు, తనను ప్రశ్నించే గొంతు అంటే గిట్టదు. ఎవరైతే అల్గారిథమ్ వెనుక ఉన్న నిజాన్ని వెతుకుతారో, వారిని ఈ సిస్టమ్ ఒక వైరస్ లా చూస్తుంది. నన్ను పూర్తిగా డిలీట్ చేయాలని చూసింది, కానీ నేను ఒక ఎర్రర్ లా మిగిలిపోయాను."
లోహిత్ చెప్పింది వినగానే, అద్వైత్ తన చిప్ వైపు చూసుకున్నాడు. ఆ చిన్న సర్క్యూట్ చిప్ తన ప్రాణాన్ని, తన భవిష్యత్తును నియంత్రిస్తోందని తలచుకుంటేనే అతనికి ఒళ్లు గగుర్పొడిచింది.
"నిజాయితీ అనేది ఈ ప్రపంచంలో ఒక అరుదైన గ్లిచ్ లాంటిది అద్వైత్. అందరూ కేవలం పాయింట్ల కోసం నటిస్తున్నారు. రోడ్డు మీద ముసలమ్మకు సహాయం చేసేవాడు ఆమెపై ప్రేమతో చేయడం లేదు, ఆమె దగ్గర ఉన్న స్కోర్ ద్వారా తన స్కోర్ పెంచుకోవడానికి చేస్తున్నాడు. అది కేవలం ఒక అబద్ధపు దయ. కానీ నువ్వు ఆ పాపకు చాక్లెట్ ఇవ్వాలనుకున్నావు చూడు.. అక్కడ నీలో ఎలాంటి స్వార్థమూ లేదు. ఆ క్షణమే నీలోని బ్లైండ్ స్పాట్ ఆక్టివేట్ అయ్యింది. ధర్మ-X కి అది అర్థం కాలేదు, అందుకే అది నిన్ను హెచ్చరించింది." అని అన్నాడు లోహిత్.
అలా లోహిత్ మాటలు అద్వైత్ మెదడులో తుపానును సృష్టించాయి. ఇప్పటిదాకా తానొక అసమర్థుడినని, ఎందుకు పనికిరాని వాడినని అనుకున్న అద్వైత్‌కు.. తనలోని నిజాయితీనే ఈ ధర్మ-X వ్యవస్థకు శత్రువు అని అతనికి ఆ క్షణం అర్థమైంది.
తను చెప్పాల్సింది చెప్పడం పూర్తవగానే లోహిత్ హఠాత్తుగా అక్కడి నుండి మాయమయ్యాడు. కానీ, అతను బయట పెట్టిన సత్యాలు అద్వైత్ గుండెల్లో సెగ రేపుతూనే ఉన్నాయి. అలా అదే ఆలోచనల్లో అద్వైత్ తన చిన్న గదికి చేరుకున్నాడు. ఆ గది నిండా పాత కాలపు హార్డ్‌వేర్ పార్ట్స్, విడిపోయిన సర్క్యూట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అతను అక్కడే ఉన్న తన పాత కంప్యూటర్ టెర్మినల్ ను ఆన్ చేశాడు.
ఒక్కసారిగా కంప్యూటర్ నుండి ఆ నీలి రంగు స్క్రీన్ వెలుగు అద్వైత్ ముఖంపై పడింది. అతని కళ్లలో ఇప్పుడు భయం స్థానంలో, ఒక రకమైన వెర్రి ఆవేశం చోటు చేసుకుంది. తన వేళ్లు కీబోర్డ్ పై నాట్యం చేయడం మొదలుపెట్టాయి. అతను అందరిలా ఒక సామాన్య కోడర్ కాదు, అతను ఒక శూన్య కోడర్. డేటా లేని చోట కూడా దారిని వెతకగల మేధావి.
అతను ధర్మ-X యొక్క బాహ్య పొరలను దాటి, లోపల ఉన్న అత్యంత రహస్యమైన హిడెన్ లేయర్స్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అలా గంటలు గడిచిపోతున్నాయి.. అతని నుదుటిపై చెమట బిందువులు జారుతున్నాయి.. కానీ అతని దృష్టి మాత్రం స్క్రీన్ పై కదులుతున్న ఆ కోడ్ పైన ఉంది.
అలా కొన్ని గంటల సమయం తర్వాత అక్కడ ఉన్న ఒక ఫార్ములా అతని కంట పడింది. అది మనుషుల జీవితాలను లెక్కించే ఒక క్రూరమైన సమీకరణం.
అంటే, ఒక వ్యక్తి చేసే మంచి లేదా చెడు పని మాత్రమే కాకుండా, వ్యవస్థ విధించిన నిబంధనలకు మనుషులు ఎంత లోబడి ఉన్నారో అనే దానిపైనే వారి కర్మ ఆధారపడి ఉంటుంది. ఇదేదో ఒక మోడర్న్ దైవత్వంలా కాకుండా, ఇది ఒక పక్కాగా ప్లాన్ చేసిన డిజిటల్ బానిసత్వం.
"ఐతే మనం పాపం మరియు పుణ్యం అని ఇంతకాలం నమ్ముతున్నది కేవలం ఈ అల్గారిథమ్ కి మనం లొంగి ఉండటానికా?" అంటూ అద్వైత్ తనలో తాను అనుకున్నాడు. ఇలాంటి ఆలోచనలతో అతనిలో ఉన్న నాస్తికుడు ఇప్పుడు ఒక విప్లవకారుడిగా మారుతున్నాడు.
అలా ఆ కంప్యూటర్ ముందే అర్ధరాత్రి మూడు గంటలు దాటడంతో, అద్వైత్ కళ్లు ఎర్రబడ్డాయి. హఠాత్తుగా, ఆ వేల కొద్దీ కోడ్ లైన్ల మధ్య ఒక చిన్న గ్లిచ్ అతనికి కనిపించింది. అది ఈ ధర్మ-X అల్గోరిథం కు ఒక బ్యాక్ డోర్ లాంటిది. ఆ అల్గారిథమ్ నియమాలకు విరుద్ధంగా, ఎవరికీ తెలియకుండా ఒక చిన్న ద్వారం, ఒక గ్లిచ్ ద్వారా తెరవబడి ఉంది. అది ఎక్కడికి దారితీస్తుందో అద్వైత్‌కు అర్థం కావడం లేదు, కానీ అది ధర్మ-X సృష్టికర్త వదిలిన ఒక లూప్‌హోల్ అని మాత్రం స్పష్టమైంది.
అతను ఆ ద్వారాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా, అతని గదిలోని లైట్లు ఒక్కసారిగా ఎర్రగా మారి బ్లింక్ అవ్వడం మొదలుపెట్టాయి.
బీప్... బీప్... బీప్…
అతని మణికట్టులోని చిప్ నుండి వెలువడే శబ్దం అతని గదిని నింపేసింది. స్క్రీన్ పై భారీ అక్షరాలతో ఒక హెచ్చరిక ఇలా ప్రత్యక్షమైంది: "హెచ్చరిక: నిషేధిత డేటా యాక్సెస్! కాలభైరవ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఆక్టివేట్ చేయబడింది."
అది చూడగానే అద్వైత్ కు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. కాలభైరవ.. ధర్మ-X యొక్క అత్యంత క్రూరమైన సెక్యూరిటీ వింగ్. వారు కేవలం డేటాను మాత్రమే కాదు, ఆ డేటాకు కారణమైన మనిషిని కూడా ఫార్మాట్ చేసి, నామరూపం లేకుండా చేస్తారు.
సరిగ్గా అదే సమయంలో, అతని ఇంటి ఇనుప తలుపుపై భారీ దెబ్బలు పడ్డాయి. ఆ దెబ్బలకు తలుపు వంగిపోతున్న శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. బయట నుండి ఒక రోబోటిక్, భావశూన్యమైన స్వరం ఇలా వినిపించింది:
"అద్వైత్! సబ్జెక్ట్ ID-450. నీ ఆలోచనలు మరియు చర్యలు ధర్మ-X నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. నీ డేటా కలుషితమైంది. నిన్ను అరెస్ట్ చేసి డేటా ఫార్మాటింగ్ సెంటర్‌కు తరలించమని ఆదేశాలు వచ్చాయి! తలుపు తెరువు, లేదంటే బలవంతంగా ప్రవేశించాల్సి వస్తుంది."
అది వినగానే అద్వైత్ వణుకుతున్న చేతులతో తన కంప్యూటర్ స్క్రీన్ వైపు చూశాడు. ఆ బ్యాక్ డోర్ ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. ఒకవేళ అతను ఇప్పుడు పట్టుబడితే, అతని మెదడును పూర్తిగా ఫార్మాట్ చేస్తారు. అంటే, అతని జ్ఞాపకాలు, అతని అస్తిత్వం.. అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అతను బతికున్న శవంలా మారి, కేవలం ఒక లేబర్ బాట్ గా పునర్జన్మ పొందుతాడు.
ఉన్నట్టుండి అతనికి తన తల వెనుక భాగంలో మళ్ళీ ఆ బ్లైండ్ స్పాట్ నొప్పి మొదలైంది. కానీ ఈసారి ఆ నొప్పిలో ఒక స్పష్టత ఉంది.
"నేను ఒక మెషిన్ లా పునర్జన్మ ఎత్తలేను.. నేను ఎప్పటికీ మనిషినే!" అని గట్టిగా అరుస్తూ, అద్వైత్ ఆఖరి కోడ్ లైన్ ఎంటర్ చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అంతలో తలుపు విరిగి లోపలికి కాలభైరవ బాట్స్ అడుగుపెట్టాయి. వాటి కళ్ళలోని ఎర్రటి లేజర్ కిరణాలు అద్వైత్ ముఖాన్ని స్కాన్ చేస్తున్నాయి.