Dharma-X: The Digital Avatar - 1 in Telugu Science-Fiction by Eshwarchandra Rathnapalli books and stories PDF | Dharma-X: The Digital Avatar - 1

Featured Books
Categories
Share

Dharma-X: The Digital Avatar - 1

తెల్లవారుజామున నాలుగు గంటలు. బయట ప్రపంచం ఇంకా నిద్రలోనే ఉందేమో కానీ, ఈ నగరానికి మాత్రం నిద్ర లేదు. 

అద్వైత్ గదిలో చిమ్మచీకటిగా ఉంది. ఆ చీకటిని చీలుస్తూ అతని ఎడమ మణికట్టు లోపల అమర్చిన సెమీకండక్టర్ చిప్ నుండి ఒక నీలిరంగు హోలోగ్రామ్ వెలుగు విరజిమ్మింది. ఆ వెలుగు నేరుగా అతని కళ్లలోకి ప్రసరించింది. 

"శుభోదయం అద్వైత్. నీ ప్రస్తుత కర్మ స్కోర్: 45%. హెచ్చరిక: నిన్న రాత్రి నిద్రలో నీ మెదడులో కలిగిన అనవసర ఆలోచనల వల్ల 0.01% డేటా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మళ్ళీ ఇలా జరిగితే నీ సోషల్ యాక్సెస్ పరిమితం చేయబడుతుంది." 

అలా ఆ యాంత్రిక స్వరం వినిపించగానే అద్వైత్ కళ్లు తెరిచాడు. అతని ముఖంలో లేవగానే వచ్చే ఉత్సాహం స్థానంలో, కేవలం ఒక అలవాటైన విసుగు మాత్రమే ఉంది. ఆ స్వరం ధర్మ-X AI అల్గారిథమ్‌ది. ప్రస్తుత ప్రపంచంలో దేవుడూ లేడు.. దెయ్యమూ లేదు.. కేవలం అల్గారిథమ్ మాత్రమే ఉంది. 

అద్వైత్ నిద్ర లేస్తూ మెల్లగా బెడ్ మీదనుండి లేచి కూర్చున్నాడు. అతని గది గోడలపై పాతకాలపు ఫోటోలకు బదులుగా కర్మ స్కోరును బట్టి రంగులు మార్చుకునే డిజిటల్ ప్యానెల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఒక రకమైన మధ్యస్థ పసుపు రంగులో వెలుగుతున్నాయి. దానికి అర్థం అతను కేవలం ఒక సామాన్యుడు. ఏమాత్రం పెరగని లేదా తగ్గని 45% స్కోరుతో స్తంభించిపోయిన డేటా పాయింట్ లాంటి వాడు. 

అతను తన మణికట్టు పైన ఉన్న చిప్‌ను గోళ్లతో గీకాడు. అది అతనికి అలవాటుగా మారిన ఒక నాడీ సంబంధిత చేష్ట. "నా మెదడులో అనవసర ఆలోచనలట.." అని గొణుక్కున్నాడు. కలలో కూడా స్వేచ్ఛ లేని ఈ జీవితం అతనికి ఊపిరాడకుండా చేస్తోంది. 

అద్వైత్ చిరాకుతోనే కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. బయట న్యూ అమరావతి నగరం ఒక భారీ కంప్యూటర్ మదర్ బోర్డులా మెరుస్తోంది. ఇక్కడి ఆకాశహర్మ్యాలు ప్రాచీన ఆలయ గోపురాల ఆకృతిలో ఉన్నాయి, కానీ అవి రాళ్లతో కట్టినవి కావు. అవి సెమీకండక్టర్ గ్లాస్ మరియు కార్బన్ ఫైబర్‌తో నిర్మించబడ్డాయి. ప్రతి గోపురం పైన ఒక భారీ హోలోగ్రాఫిక్ చక్రం తిరుగుతూ ఉంటుంది, అది ఆ ఏరియాలోని ప్రజల సగటు కర్మ స్కోరును బట్టి రంగు మారుస్తుంది. 

అక్కడి గాలిలో పక్షుల కిలకిల రావాలు లేవు. దానికి బదులు, గాలిలో డేటా ప్యాకెట్లు ప్రవహించేటప్పుడు వచ్చే ఒక రకమైన తక్కువ స్థాయి హమ్మింగ్ శబ్దం నిరంతరం వినిపిస్తూ ఉంటుంది. 

ప్రతి ఇంటి గుమ్మానికి డిజిటల్ తోరణాలు వేలాడుతున్నాయి. ఆ తోరణాలలోని ఎలక్ట్రానిక్ కాంతి ఆ ఇంట్లోని వారు ఎంత పుణ్యం సంపాదించారో వీధిలో వెళ్లే ప్రతి ఒక్కరికీ చాటి చెబుతుంది.

అద్వైత్ తన గదినుండి వీధిలోకి అడుగు పెట్టాడు. రోడ్డు పక్కన ఉన్న చెట్లు కూడా ప్లాస్టిక్ సిలికాన్‌తో చేసినవే. అవి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి కానీ, అవి కూడా సిస్టమ్ ఇచ్చే రివార్డ్ పాయింట్ల ద్వారానే నీటిని పొందుతాయి. ఇదంతా ఒక పర్ఫెక్ట్ డిజిటల్ జైలులా కనబడుతోంది. 

అద్వైత్ వీధిలో నడుస్తుంటే అతనికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఎదురెదురుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆగి, ఒకరికొకరు వినయంగా నమస్కారం చేసుకున్నారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉంది, కానీ ఆ కళ్లలో ఎలాంటి పలకరింపూ లేదు. వారు ఒకరికొకరు నమస్కారం చేసుకోగానే, వారిద్దరి మణికట్టుపై ఉన్న చిప్స్ బీప్ అని శబ్దం చేశాయి. వారి కర్మ స్కోర్ 0.001% పెరిగింది. 

అది చూడగానే అద్వైత్ పెదవులపై ఒక వెక్కిరింత మెరిసింది. "అబద్దబపు వినయాలు..!" అని మనసులో అనుకున్నాడు. 

ఇక్కడ ఎవరూ ప్రేమతో పలకరించుకోవడం లేదు. కేవలం రివార్డ్ పాయింట్ల కోసం ఒక సామాజిక నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఈ ప్రపంచంలో మంచితనం అనేది ఒక నైతిక విలువ కాదు, అదొక కరెన్సీ లాంటిది. ఈ రివార్డ్ పాయింట్ సిండ్రోమ్ మనుషులను రోబోలుగా మార్చేసింది. ఇక్కడి జనాల ప్రతి నవ్వు వెనుక ఒక లెక్క ఉంది, ప్రతి పలకరింపు వెనుక ఒక అల్గారిథమ్ ఉంది. 

ఇంతకు ముందులా ప్రజలు ఒకరినొకరు తాకడం కూడా తగ్గించేశారు, ఎందుకంటే డేటా కరప్షన్ జరుగుతుందేమోననే భయం. మనుషుల్లోని ప్రేమ, ఆప్యాయత మరియు కరుణ వదిలేసి, అందరూ తమ డిజిటల్ ప్రతిష్టను కాపాడుకునే తాపత్రయంలోనే ఉన్నారు. అద్వైత్ మాత్రం తన చిప్‌ను మళ్లీ గీకుతూ, తన చుట్టూ ఉన్న ఈ వెలుగుల ప్రపంచాన్ని అసహ్యంగా చూస్తూ ముందుకు సాగాడు. 

అతను అలాగే నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఒక ముసలివాడు, బహుశా అతని కర్మ స్కోర్ చాలా తక్కువగా ఉండవచ్చు, ఒక్కసారిగా తల తిరిగి కింద పడిపోయాడు. అతని మణికట్టుపై ఉన్న చిప్ ఎర్రగా మెరుస్తోంది. అంటే అతని స్కోర్ 10% కంటే తక్కువకు పడిపోయింది. 

అద్వైత్ సహజసిద్ధమైన మానవత్వంతో అతని వైపు వెళ్లబోయాడు. కానీ సరిగ్గా అప్పుడే అతని కళ్ల ముందు ఒక హోలోగ్రాఫిక్ నోటీసు ప్రత్యక్షమైంది:
"హెచ్చరిక: సబ్జెక్ట్ స్కోరు 10% కంటే తక్కువ ఉంది (ఇదొక లేబర్ బాట్ గ్రేడ్). అతనికి సహాయం చేయడం మీ కర్మ పాయింట్లకు చెడు పెట్టుబడి అవుతుంది. రిస్క్: 2% తగ్గింపు.." 

ఆ వార్నింగ్ చూడగానే అద్వైత్ అక్కడికక్కడే ఆగిపోయాడు. చుట్టూ ఉన్న జనం ఐతే ఆ ముసలివాడిని అసలు ఒక మనిషిలా కూడా చూడటం లేదు. 

వారందరూ అతన్ని దాటుకుంటూ వెళ్తున్నారు. అందులో కొందరైతే అతను దారికి అడ్డంగా ఉన్నాడన్నట్లు విసుక్కుంటున్నారు. ఇది ధర్మ-X అనబడే AI యొక్క అధికారిక ప్రపంచం. ఈ ధర్మ-X దృష్టిలో ఆ ముసలివాడు ఇక పనికిరాని డేటా. అతన్ని కాపాడటం అంటే సిస్టమ్ నియమాలను ఉల్లంఘించడమే. 

"చీ..! అసలు ఏమైంది ఈ లోకానికి..?" అంటూ అద్వైత్ మనసులో వేదన సుడులు తిరిగాయి. 

తన స్కోర్ పోయినా పర్వాలేదు, అతనికి సహాయం చేయాలి అనుకుని అడుగు ముందుకు వేయబోయాడు, కానీ దూరంగా ఉన్న ఒక సెక్యూరిటీ డ్రోన్ అతని వైపు కెమెరాను జూమ్ చేయడం గమనించి ఆగిపోయాడు. అతను ఇంకా ఈ బైనరీ బానిసత్వంలో ఒక భాగమే అని బాధతో, అతను మౌనంగా తల దించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తనపై తనకే కలిగిన అసహ్యం అతని చిప్‌ను మరింత గట్టిగా గీకేలా చేసింది. 

అద్వైత్ అసమధానంతో తను పని చేసే ఆఫీసుకు బయలుదేరాడు. అతను పని చేసే ఆఫీసు ఒక భారీ గాజు భవనంలా వైభవంగా ఉన్నప్పటికీ, లోపల నిశ్శబ్దం తాండవిస్తోంది. 

వందలాది మంది కోడర్లు తమ తమ హోలోగ్రాఫిక్ స్క్రీన్ల ముందు కూర్చుని డేటాను ప్రాసెస్ చేస్తున్నారు. ఇక్కడ అందరి లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా వారి వారి కర్మ స్కోరును 90% దాటించి వర్చువల్ వైకుంఠం చేరుకోవడం. 

ఈ ప్రపంచంలో ఒకరి కర్మ స్కోర్ 90% దాటితే వారికి వర్చువల్ వైకుంఠం చేరుకునే అదృష్టం లభిస్తుంది. ఇది అచ్చు మన పురాణాలలో చూపించే విధంగా, మంచి కర్మకు స్వర్గం చెడు కర్మకు నరకం అనే సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది.

అద్వైత్ ఆఫీసు లోపలికి నడుచుకుంటూ వెళ్ళి తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. అతని పని సిస్టమ్‌లోని చిన్న చిన్న గ్లిచ్‌లను సరిచేయడం. కానీ అతను రాసే కోడ్ ఎప్పుడూ వింతగా ఉంటుంది. అతను దేవుడిని నమ్మడు, పోనీ ఈ టెక్నాలజీని నమ్ముతాడా అంటే అదీ లేదు. అందుకే సహోద్యోగులు అతన్ని శూన్య కోడర్ అని పిలుస్తుంటారు. దేనికీ చెందనివాడు మరియు దేనికీ పనికి రాని వాడు అని అర్థం. 

అతని పక్క సీటులో కూర్చునే లోహిత్ హుషారుగా తన స్క్రీన్ చూపిస్తూ, "హే అద్వైత్, ఒకసారి ఇటు చూడు! నా స్కోర్ ఈ పొద్దున 81% కి చేరింది. ఇంకొక్క 9 శాతం.. అంతే! వచ్చే నెలలో నేను ఈ మురికి భౌతిక శరీరాన్ని వదిలేస్తాను. వర్చువల్ వైకుంఠంలో నాకు అపరిమితమైన బ్యాండ్‌విడ్త్ దొరుకుతుంది. అక్కడ ఎలాంటి ఆకలి ఉండదు, నిద్ర అవసరం అస్సలు ఉండదు, కేవలం 8K రిజల్యూషన్ ఉన్న ఆనందం మాత్రమే!" అని అన్నాడు. 

అద్వైత్ మెల్లగా తల తిప్పి లోహిత్ వైపు చూశాడు. "అక్కడ ఆనందం ఉంటుందా లోహిత్? లేక కేవలం ఆనందంగా ఉన్నామనే భ్రమను కలిగించే కోడ్ ఉంటుందా?" అని చిరాకుతో అడిగాడు. 

అందుకు లోహిత్ నవ్వుతూ, "చిల్ బ్రో.. ఏదైతే ఏముంది? ఇక్కడ ఈ ట్రాఫిక్ లో, ఈ కాలుష్యంలో బతకడం కంటే అక్కడ ఒక డిజిటల్ దేవతలా ఉండటం మేలు కదా..!" అని అన్నాడు. 

అందుకు అద్వైత్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. లోహిత్ కి తెలియదు, వైకుంఠం అనేది ఒక భారీ డేటా సర్వర్ లాంటిది మాత్రమేనని. అక్కడ మనిషి ఒక ఫైల్‌గా మారిపోతాడు. మనిషి ప్రాణం కంటే డేటా పాయింట్లకు విలువనిచ్చే ఈ వ్యవస్థలో మోక్షం కూడా ఒక సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ లాంటిదే. 

అలా వారి పనుల్లో రోజు గడుస్తూ మధ్యాహ్నం అవుతుండగా, ఆఫీసులోని సెంట్రల్ హాల్‌లో ఒక పెద్ద ప్రకటన వెలువడింది. ఒక సీనియర్ మేనేజర్ తన భౌతిక ఉనికిని వదిలి మైగ్రేట్ అవుతున్నాడు. అందరూ అతన్ని చప్పట్లతో సాగనంపుతున్నారు. ఇది ఒక అంత్యక్రియల కార్యక్రమం లాంటిది కాదు, ఒక ప్రమోషన్ పార్టీ లాంటిది. 

కానీ అద్వైత్ కి మాత్రం అది ఒక ఆత్మను డిజిటల్ జైలులోకి పంపించే ప్రక్రియలా అనిపించింది. అతను తన సీటులో కూర్చుని తన మానిటర్ వైపు చూశాడు. అతని కర్మ స్కోర్ 45.0% దగ్గరే మొండిగా ఆగిపోయింది. నిజానికి అతను తలుచుకుంటే, అందరిలాగే అతని స్కోరును కూడా సులభంగా పెంచుకోవచ్చు. కానీ అతను ఆ నాటకం ఆడదలచుకోలేదు. అతనిలో ఒక రకమైన రివార్డ్ పాయింట్ సిండ్రోమ్ వ్యతిరేకత ఉంది. 

అతను పనిలో భాగంగా కోడ్ రాస్తున్నాడు, కానీ అతని ఆలోచనలు మాత్రం ఆ కోడ్‌లో లేవు. మనుషులు ధర్మ-X AI కు ఎందుకు ఇలా బానిసల్లా బతుకుతున్నారు? ఎవరిలోనూ మానవత్వం లేదు.. ఒక మనిషి చావును కూడా ఒక ప్రమోషన్ పార్టీలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ఈ జనాలు.. అంటూ అద్వైత్ మనసులో తీవ్రమైన అలజడి మొదలైంది. దానితో అతను తన చేతి చిప్‌ను ఎంత గట్టిగా గీకాడంటే, అక్కడ చర్మం కాస్త ఎర్రబడింది. 

అప్పుడే అతని మానిటర్ పై ఒక ఎర్రటి కిరణం మెరిసింది. 

అద్వైత్ మానిటర్ ఒక్కసారిగా రంగు మారింది. ఆఫీసులోని మిగతా స్క్రీన్లన్నీ నీలిరంగులో ప్రశాంతంగా ఉంటే, అద్వైత్ స్క్రీన్ మాత్రం ప్రమాద సంకేతాన్ని ఇస్తూ ఎర్రగా విరజిమ్మింది. ఒక భయంకరమైన అలారం లాంటి శబ్దం ఆ నిశ్శబ్దాన్ని చీల్చింది.

స్క్రీన్ పై పెద్ద అక్షరాలు ఇలా ప్రత్యక్షమయ్యాయి:
"క్రిటికల్ ఎర్రర్: సబ్జెక్ట్ అద్వైత్‌లో స్టాటిక్ నాయిస్ గుర్తించబడింది. అతని ఆలోచనలు డేటాలోకి ప్రాసెస్ చేయబడటం లేదు. నమూనా: అనవసర భావోద్వేగాలు. మరలా పరిశీలన అవసరం.."

అది వినగానే చుట్టూ ఉన్న సహోద్యోగులు షాక్‌తో అద్వైత్ వైపు చూశారు. గాలిలో గస్తీ తిరుగుతున్న రెండు సెక్యూరిటీ డ్రోన్లు మెరుపు వేగంతో అద్వైత్ డెస్క్ దగ్గరకు వచ్చి ఆగాయి. వాటి ఎర్రటి లేజర్ కళ్లు అద్వైత్ ముఖాన్ని స్కాన్ చేయడం మొదలుపెట్టాయి. 

దానితో అద్వైత్ కి విషయం అర్థమైంది.. తన మనసులోని శూన్యం, ధర్మ-X నియమాలను ఉల్లంఘించింది. AI దేవుడికి తను ఇప్పుడు ఒక వైరస్ లా కనిపిస్తున్నాడు..