,"ఏమండీ? పండగ వస్తుంది. గుర్తు ఉందా?" అని టీ అందిస్తూ అంది శ్యామల.
"మరిచిపోవడానికి అది ఏమైనా చిన్న పండగా. పెద్ద పండుగ. ఖర్చుతో కూడిన పండగ కదా! అందుకే పెద్ద పండగ అన్నారు అనుకుంటా!" అని పెదవిపై రాని నవ్వు నవ్వుతూ టీ అందుకున్నాడు శంకర్.
"ఏమిటా మాటలు. పిల్లలు అందరూ ఇంటికి వచ్చి సరదాగా గడిపి వెళ్ళతారు. దానికే ఖర్చు అనుకుంటే ఏలా?" అని కొంచెం కోపంగా అంది కానీ తనకి తెలుసు ఇంటిలో పరిస్థితి బాలేదు అని. అలా అని పండగకి పిల్లలను రావద్దు అని అనలేము కదా!
"నిజమే సరదాగా గడిపి వెళ్ళతారు. కానీ వాళ్ళ అచ్చట ముచ్చట తీర్చాలి కదా!
ఎంత లేదు అన్న ఇద్దరి అల్లుళ్లకి ఏదో కొంత ఇవ్వాలి, పిల్లలకి, వాళ్ళ పిల్లలకి బట్టలకి ఇవ్వాలి. చేతిలో పైసా లేదు ఏమి చేయాలి అని ఉదయం నుండి ఆలోచిస్తున్న" అని విచారంగా అన్నాడు.
"నిజమేనండి, ముందే చెప్పారు పిల్లలు. మా అత్తగారి దగ్గర చిన్నగా ఉండకూడదు అని, తిరుగు ప్రయాణంలో ఏ పిండి వంటలు కావాలో కూడా పెద్ద లిస్ట్ నే ఇచ్చారు. కాకపోతే మన అల్లుళ్లు ఇద్దరూ మంచివాళ్ళే ఏది కావాలి అని పట్టు పట్టరు. అత్తమామల దగ్గర ఉందా లేదా అని చూడకుండా పిప్పి పిప్పి చేసే అల్లుళ్లు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. మన పిల్లలు మన పరిస్థితి అర్థం చేసుకుంటారు" అని పిల్లలని వెనుకేసుకుని వచ్చింది శ్యామల.
"అది నిజమేలే, అయినా మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి పండగ వచ్చిన కూడా భయమే. సరేలే నా స్నేహితుడు డబ్బు అప్పుగా ఇస్తాను అన్నాడు, అడిగి వస్తాను" అన్నాడు పైకి లేస్తూ.
"సరే, అడిగింది ఏదో పిల్లలు ఉన్నని రోజులు ఇబ్బంది లేకుండా అడగండి అన్ని అవసరాలు తీరేలా. ఏ అచ్చటముచ్చట జరగకపోయినా చిన్నబుచ్చుకుంటారు.
తరువాత ఏదో తంటాలు పడి తీర్చేదాం"
"సరే సరే నేను చూసుకుంటా" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు శంకర్.
భర్తకి చెప్పింది కానీ మరల ఆ అప్పు తీర్చడానికి ఎన్ని రోజులు పడుతుందో కదా అనే బెంగ మనసులో ఉండిపోయింది శ్యామలకి.
*************
"ఏమిటి సుభద్ర ఏదో ఆలోచిస్తున్నావు?" అంటూ వచ్చాడు సుభద్ర భర్త మోహన్.
"ఏమి లేదు అండి, మనకి ఒక అమ్మాయి ఉంటే బాగున్ను అని ఆలోచిస్తున్న"
"ఏమిటి ఇప్పుడా! ఇద్దరి కొడుకులకి పెళ్లిళ్లు చేశాం. ఇప్పుడు కూతురు ఏమిటే, ఎప్పుడు నాకు ఇద్దరూ కొడుకులు అని మురిసిపోయే దానివి కదా!" అని అనుమానంగా అడిగాడు.
"అవునండీ. అప్పుడు అలాగే అనుకున్న. పిల్లలకి పెళ్లి అయిన తరువాత, వాళ్ళు పండక్కి అత్తగారి ఇంటికి వెళ్లిపోతుంటే, చూడండి ఇల్లు ఎలా ఉందో.
అందరి ఇల్లు కూతురు అల్లుడు పిల్లల్తో సందడిగా ఉంది. మన ఇల్లు మాత్రమే
నీ ఎదుట నేను...నా ఎదుట మీరు అని ఒకరి ముందు ఒకరు ఉన్నాం.
రేపు అనే రోజు నేను లేకపోయన మీరు ఒంటరిగా ఉండాలి కదా! అదే ఆలోచన ఉదయం నుండి తొలిచేస్తుంది అండి" అంది బాధగా.
భార్య మాటలకి ఆలోచన లో పడ్డాడు మోహన్ కూడా. నిజమే కదా పండగ అంటే
పిల్లలతో ఆనందంగా గడపడమే కదా, పిల్లలు దగ్గర లేకపోతే ఎంత ఉన్న ఏ అనందం ఉంటుంది. పండగ సరదా ఏమి ఉంటుంది. నేను నా భార్య వెనుక పండగకి వెళ్లిపోయే వాడిని పాపం అమ్మ ని ఒకదాన్ని వదిలి. ఆ రోజు అమ్మ బాధ తెలియలేదు. అని మనసులో అనుకున్నాడు మోహన్ బాధ గా తల్లి గుర్తుకు వచ్చి.
************
"ఏమిటి రాజీ అంత తీరుబడి గా కూర్చున్నావు పనులు అన్నీ అయిపోయాయా?" అంటూ వచ్చింది రాజీ ఫ్రెండ్ కల్యాణి
"అయిపోయాయి అంటే అయిపోయాయి" అని నిట్టూర్చింది రాజీ.
"ఏమైంది" అని లాలన గా అడిగింది కల్యాణి
"అసలు పండగ అంటే ఏమిటే , నాకు పెళ్లి అయిన దగ్గర నుండి అర్థం కాలేదు. మగ వాళ్ళకే నా పండగ సరదా! ఇంటిలో అడ వాళ్ళకి ఉండదా? అని
కస్సుమని అంతలోనే శాంతించి
"నా పెళ్లి అయిన దగ్గర నుండి చూస్తున్న కల్యాణి, పండగ అంటే చాలు ఫ్రెండ్స్ తో షికార్లు, పేకాట, తాగుడు ఇదేనా? ఏమైనా అంటే నాకు మాత్రం ఒక సరదా, సంబరం ఉండదా అని అరుస్తారు. మరి ఇంట్లో ఉన్న భార్యకి సరదా ఉండదా? కనీసం పండగ పూట అయిన భర్త తో ఉండాలి అని.
పండగ వస్తుంది అంటే భయం వేస్తుంది కల్యాణి, ఆ పండగ లో నేను ఒకరిదాన్నే ఉంటాను. అందరిలా మనం అని కలిసి ఉండేది లేదు. కనీసం పిల్లలు ఉన్న లోటు లేకపోను ఏమో. దేవుడు అది కూడా ఇవ్వలేదు" అని కంట నీరు పట్టుకుంది రాజీ.
"రాజీ అన్నది నిజమే కానీ చెప్పిన అర్థం చేసుకోలేని వాళ్ళకి ఏమి చెప్తాం,
మనసులో లేని అనందం మన పెదవి పై చిరునవ్వు లా చూపించడమే కాదు కాదు నటించడమే పండగ అంటే" అని అనుకుంది కల్యాణి.
************
శంకర్ కి పండగ అంటే అప్పు తో కూడిన భయం
మోహన్ కి పండగ అంటే తన దాకా వస్తే కానీ తెలియ లేదు తల్లి బాధ.
రాజీ కి పండగ అంటే ఒంటరి తనం. ఇలాంటి వాళ్ళు చాలా మంది నే ఉన్నారు
మన చుట్టూ.
అందుకేనేమో పూర్వ కాలం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కష్టం వస్తే అదుకోవడానికి మేము ఉన్నాం ఆని భరోసా ఉండేది. ఇప్పుడు మనసు కి మనసు కే కాదు మనిషి మనిషి కి కూడా దూరం పెరిగింది.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అని, వచ్చే తరం వాళ్ళు చెప్పుకుంటారు ఏమో ఒకప్పుడు పండగలు ఉండేవట అని. లేని పండగలు చేసుకుంటున్నాం మన ఎంజాయ్ మెంట్ కోసం. ఉన్న సాంప్రదాయాలు వదిలేస్తున్నాం.
చివర గా ఒక మాట
జేబు నిండా డబ్బులు, మనసులో ప్రశాంతత, చుట్టూ మనకి కావలసిన వాళ్ళు ఉంటే ప్రతి రోజూ పండగే కదా! అలాంటి పండగలు ఈ రోజుల్లో రావడం కష్టమే. అది మధ్య తరగతి వాళ్ళకి అంటే ఇల లోనే కాదు కదా కల లో కూడా సాధ్యం కాదు ఏమో!
Sita ❤️