కాలుష్యం
కార్తీక పౌర్ణమి శుభవేళ లోకాలన్నీ వెన్నెల వెలుగులో మెరిసిపోతుంటే కైలాస పర్వతం తెల్లని వెన్నెల పరచినట్లు గా ఉంది . ఆ సమయంలో నదుల శబ్దాలు సంగీతంలా వినిపిస్తున్నాయి. వృక్షాలు సువాసన పంచుతున్నాయి. దిక్కులన్నీ మంచుతోటి మెరిసిపోతూ ఉన్నాయి. పక్కన పార్వతీదేవి , తలపైన గంగ, ఆకాశం మీద కార్తీక పున్నమి చంద్రుడు ఇంతటి అద్భుత వాతావరణంలో శివుడు పరవశుడై నాట్యం చేస్తున్నాడు.
ఇంతలో ఏదో ఆర్తనాదం వినబడింది. నాట్యం ఆపేసి అటువైపు చూసిన శివుడుకి దూరం నుంచి వస్తున్న తన బిడ్డలు పంచభూతాలు, కొన్ని మూగజీవాలు కనబడ్డాయి. ఇదేమిటి ఆనందం అనుభవించవలసిన సమయంలో ఆర్తనాదం చేస్తూ పరిగెత్తుకొస్తున్నాయి అనుకుని పక్కనున్న పార్వతీ దేవితో ఇలా అన్నాడు .
శివుడు: చూడు పార్వతి నా బిడ్డ లేదో ఆపదలో ఉన్నట్టున్నారు
ఎప్పుడూ లేనిది ఇలా నా దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నారు. పాపం ఏ ఆపద వచ్చిందో ఏమో! నేను పలకరించి వస్తాను
అంటూ ముందుకు కదిలాడు.
పార్వతి: నాకు వాళ్ళు బిడ్డలే కదా అండి నేను కూడా వస్తాను మీ తోటి అoటు శివుడు తోటి బయలుదేరి ఆ పంచభూతాలు ఎదురు వెళ్లారు.
శివపార్వతులను చూసి ఆ పంచభూతాలు ఒక్కసారిగా నమస్కారం చేసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. బిడ్డల కళ్ళల్లోంచి వచ్చిన కన్నీరు చూసి పార్వతి దేవి చలించిపోయింది. అమ్మా భూమాత ఎందుకు ఆ కన్నీరు! విషయం చెప్పండి అని అడిగింది.
భూమాత: తల్లి ఏం చెప్పమంటావు మా కష్టాలు. మీరు ఈ లోకాలన్నిటికీ తల్లిదండ్రులు. నేను నా మీద బ్రతికే ప్రాణులన్నిటికీ తల్లి వంటి దాని. అట్లాంటి తల్లికి చాలా అన్యాయం చేస్తున్నారు ఈ మానవులు. అందమైన ప్రకృతితో చూపరులకి ఆనందం కలిగించే దానిని. మానవుల్లో స్వార్ధం పెరిగిపోయి పచ్చటి పంట పొలాలు నాశనం చేసి ఆకాశాన్ని తాకే భవనాలు నిర్మించి ఆనంద పడుతున్నారు. ఎక్కడ పచ్చటి చెట్టు కనబడటం లేదు.
అడవులోని చెట్లతో దొంగ వ్యాపారం చేస్తున్నారు. పంట పొలాల్లో సాంప్రదాయ ఎరువులు మానేసి రసాయనిక ఎరువులు పురుగుల మందులు వాడుతుంటే నేను సహజత్వం కోల్పోయాను. నా బిడ్డలకి స్వచ్ఛమైన ఆహార పంటలను అందించలేకపోతున్నాను. అన్నీ కల్తీ అయిపోయాయి.
నా గర్భం విషపూరితమైపోయింది. మానవుడు వ్యాపారి అయిపోయాడు. పర్వతాలను తవ్వేస్తున్నారు. భూమిని రక్తహీనంగా మార్చేస్తున్నారు. పల్లెటూర్లన్నీ అందవిహీనంగా తయారయ్యేయి అని చెప్పి బాధపడింది భూమాత . నాతో పాటు మానవుల జీవితాలు కూడా పాడైపోతున్నాయి.
పార్వతి : సహనానికి మారుపేరు భూమాత అని చెప్తారు. అలాంటి భూమాతకే కన్నీరు తెప్పించే పరిస్థితులు ఉన్నాయంటే ఇది ఏదో ఆలోచించవలసిన విషయం అండి అంది శివుడుతో.
శివుడు: అవును కన్న తల్లి లాంటి భూమాతని ఇలా బాధ పెడితే మానవులకి క్షేమం కాదు అని అంటూ నదులకేసి చూశాడు. లోకంలోని నదులన్నీ అక్కడే ఉన్నాయి.
జలదేవత: (నదులు) ఈశ్వర మీ ఆజ్ఞ ప్రకారం సహజసిద్ధమైన జలాలతో, మరియు వరుణ దేవుడి అనురాగపూరితమైన జల్లులతో ఎప్పుడు పరవళ్ళు తొక్కుతూ ఆనందంగా ఉండేవాళ్ళం. ఈ మధ్య మా భూలోకం యమలోకంలా తయారయింది . ఫ్యాక్టరీలలో కర్మాగారాల్లో ఉండే వ్యర్ధపదార్థాలు ఇంటిలోని చెత్తాచెదారం పశువుల మృత కళేబరాలు అన్ని జలపరం చేస్తున్నారు మానవులు. నగరాలలో ఉండే మురుగునీరు మా పవిత్ర జలాల్ని అపవిత్రం చేస్తున్నాయి. ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండే మా మనసులు మురికి అయిపోయాయి. దానివల్ల నా బిడ్డలు జలచరాలు ఎన్నో చనిపోతున్నాయి.
మరొక ముఖ్యమైన సమస్య మా భూలోకంలో గణపతి నవరాత్రి పూజలు విశేషంగా జరుగుతాయి. దానికి మేం కూడా ఆనందించాం. కానీ మా తల్లి పార్వతి చేసినట్లుగా నలుగు పిండితో కాకపోయినా కనీసం మట్టితో బొమ్మను చేయకుండా సిమెంట్ పోత పోసి ఇనప ముక్కలు పెట్టి భారీ ఎత్తు గణపతి విగ్రహాలు తయారుచేసి జలపరం చేస్తున్నారు. లోహపు ముక్కలు కరగకుండా మాకు కళ్ళ నీళ్లు తెప్పిస్తున్నాయి.
గంగా నది: అవును ప్రభు ఇది నూటికి నూరుపాళ్ల నిజం. ఆ మధ్య ఒక పాలకుడు నాలో ఉన్న కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ పుణ్యం మూట కట్టుకున్నాడు. అది ఇప్పటికే అలాగే జరుగుతోంది కాశీ పుణ్యక్షేత్రంలో. మిగతా ప్రాంతాలలో నదుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
శివుడు: శివ శివ ఎంత మూర్ఖులయ్యారు ఈ మానవులు . అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైన మానవ జన్మ ఇలాంటి పాపాలు చేస్తుంటే ఎలా సహిస్తారు నా బిడ్డలు. అప్పటికే అక్కడికి చేరి దీనంగా మొహం పెట్టి ఉన్న వాయుదేవుడిని " ఎలా ఉన్నావు వాయుదేవా అని పలకరించాడు శివుడు.
వాయుదేవుడు : ఎలా ఉంటాను తండ్రి. నేను ఊపిరాడకుండా ఉన్నాను. సకల జీవులకు ప్రాణవాయువును ఇచ్చే గాలిని.
ఒకప్పుడు మా వల్ల ప్రజలు ఆరోగ్యంగా జీవించేవారు. కానీ ఇప్పుడు గ్రీష్మ కాలంలో నూనె, ఉక్కు వాసనలు, శ్వాసకోశ వ్యాధులు విస్తరిస్తున్నాయి. కార్ల నుండి, ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యంతో నా గాలి విషమవుతోంది. దానికి తోడు వృక్షాలన్నీ నరికేశారు. అడవులను పాడు చేశారు. కృత్రిమంగా ఉండే గాలి మీద ఆధారపడ్డారు ప్రజలు. రోజు ఎక్కడ గాలి లేదని నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ వాళ్ళు చేసుకున్న తప్పిదాలు వాళ్ళకి తెలియటం లేదు. గాలి చొరబడని బహుళ అంతస్తుల భవనాలలో కాపురాలు. ఎక్కడి నుంచి వస్తుంది గాలి.
అగ్నిదేవుడు:
శంభో! మేము తపస్సుకు, యజ్ఞానికి, పరిశుభ్రతకు చిహ్నం. కానీ ఈ రోజుల్లో నా రూపాన్ని మానవులు వినాశనానికి ఉపయోగిస్తున్నారు. అడవుల్ని తగలబెడుతున్నారు. ప్లాస్టిక్ వస్తువులతో మంటలు పెడుతున్నారు. అందులో నుంచి వచ్చే విపరీతమైన వాసన అందరిని కలవరపెడుతోంది. ఇదెక్కడి విచిత్రము ఒకప్పుడు చలి కోసం గడ్డి మంటలు వేసుకునేవారు. ఇప్పుడు వాహనాలకు ఉపయోగించే పాడైపోయిన టైర్లు మంట పెడుతున్నారు.
ఆకాశం:
ప్రభో… నేను మీ తల పైకెత్తి చూస్తే కనపడే ఆకాశాన్ని. నా బాహుబలాన్ని రెక్కలు చాచి అన్నిటినీ ఆవరిస్తూ ఉండే ఆకాశాన్ని మానవుడు రసాయనాలతో, రేడియేషన్‌తో నెమ్మదిగా నాశనం చేస్తున్నాడు. పక్షులు చెట్లు లేక ఎగిరే స్థలం లేక బిక్కుబిక్కుమంటున్నాయి.
శివుడు:
ఇది ఎంత భయంకరమైన వాస్తవం! నాకు పంచాక్షరీ జపం కన్నా ఈ ప్రపంచ రక్షణ ముఖ్యం అయింది. ఈ భూతాలూ, మూగ జీవాలూ కన్నీళ్లు పెట్టేలా చేసారంటే మానవులు మారక తప్పదు. కాలభైరవుడి రూపంలో వారికి గుణపాఠం చెప్తే తప్పదు. ఇప్పటికే ప్రకృతి అంతా చేయవలసింది అంతా చేస్తూనే ఉంది. అకాల వర్షాలు భూకంపాలు సునామీలు వరదలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ వచ్చి జనం నష్టపోతున్నారు. అయినా తెలుసుకోలేకపోతున్నారు. నేను ఆ దిశగా వెళ్ళను. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తాను. దేవతలను పూజించడం కంటే ముందు ప్రకృతి దేవతను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే మానవ మనుగడకే ప్రమాదం. ఏమిటో ఏదో చెడు వాసన వస్తోంది. ఎప్పుడు సువాసనలు వెదజల్లే మా కైలాస పర్వతం దుర్గంధ భరితం అయింది . ఏమిటి అబ్బా అని పంచభూతాల కేసి చూశాడు పరమేశ్వరుడు.
మానవులు ఎంతో మాకు అపకారం చేశారు. మీకు కలిగిన ఈ సౌకర్యానికి మేము చాలా సిగ్గుపడుతున్నాము అంటూ పంచభూతాలన్నీ సిగ్గుతో తలవంచుకున్నాయి.
శివుడు వెంటనే బ్రహ్మ, విష్ణువుని, దేవతలందరినీ అష్టదిక్పాలకులని పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి యమధర్మరాజుకి మరీ మరీ చెప్పాడు . పర్యావరణాన్ని కలుషితం చేసే వాళ్లు పుణ్యం చేసుకున్నప్పటికీ నరక లోకంలోనే శిక్షలు విధించు అని.
అలాగే భూలోకంలోని స్వచ్ఛంద సంస్థలకి, ప్రభుత్వానికి, పాఠశాలలో ఉపాధ్యాయులకి , ప్రజలతో నిత్యం అనుసంధానమయ్యే ప్రభుత్వ అధికారులకు ప్రజలకి కలలో కనబడి రాబోయే తరాలలో ప్రకృతి ఎలా ఉంటుందో మానవ మనుగుడ ఎలా ఉంటుందో చాట్ జిపిటి ద్వారా చిత్రాలు చూపించాడు పరమాత్ముడు. ఇది ఆఖరి ప్రయత్నం. లేదంటే నా దగ్గర ఆయుధం ఉండనే ఉంది అని అన్నాడు.
చేరవలసిన చోటికి సమాచారం చేరవేశాము. మన కర్తవ్యం మనం చేసాం. మిగిలినది అంతా శివుడు దయ అని పంచభూతాలు ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
సమావేశానికి వచ్చిన దేవతలు విష్ణువు ,బ్రహ్మగారు, అష్టదిక్పాలకులు తమకు తోచిన రీతిలో మార్గాలు అన్వేషిస్తూ శివుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకి నాడ
9491792279