గురుదక్షిణ
సాయంకాలం నాలుగు గంటలు అయింది. వీధి అరుగు మీద కూర్చుని విద్యార్థులకి వేదం బోధిస్తున్న రామకృష్ణ శాస్త్రి గారికి ఒక వయసు మళ్ళిన వ్యక్తి ఒక చేత్తో సంచి ,మరొక చేత్తో పది సంవత్సరములు ఉన్న కుర్రాడు చెయ్యి పట్టుకుని తన ఇంటి ముందు ఆగడం గమనించాడు.
" నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం అమలాపురం దగ్గర ఉన్న రంగాపురం. వీడు మా అబ్బాయి నారాయణ శాస్త్రి. వీడు ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఇకముందు స్మార్త విద్య నేర్పిద్దామని మా సంకల్పం.. మీ గురించి మా గ్రామంలో ఎవరో చెబితే విని ఎంతో ఆశతో వచ్చాను అంటూ చెప్పు కుంటూ వచ్చాడా పెద్దమనిషి.
మీరు నిలబడే ఉన్నారు! . ముందు మీరు ఇలా కూర్చోండి అంటూ శాస్త్రి గారు ఆ వచ్చిన ఆయనకి అరుగు మీదనున్న చాప చూపించి ఆ తర్వాత అతిధి మర్యాదలు చేసి నాకు విద్య నేర్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పటికే నా దగ్గర ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్లంతా రాత్రి అరుగుల మీద పడుకుని మా ఊర్లోను ,పక్క ఊర్లోనే ఉండే బ్రాహ్మణ కుటుంబాల ఇళ్లల్లో వారం చేసుకుని విద్య నేర్చుకుంటున్నారు. మీకు అందుకు సమ్మతమైతే మీ అబ్బాయికి కూడా అలాగే ఏర్పాటు చేస్తాను.
రేపు మంచి రోజు రేపటి నుంచి విద్య ప్రారంభిద్దాం అని చెప్పిన రామకృష్ణ శాస్త్రి గారి మాటలకి ఉప్పొంగిపోయాడు సుబ్రహ్మణ్యం.
ఎప్పుడూ ఇల్లు విడిచి ఉండని నారాయణ శాస్త్రి ఒక్కసారి ఏడుపొచ్చింది. కొత్త ఊరు, కొత్త ప్రదేశం అంతా అయోమయంగా ఉంది.
పాపం నారాయణ శాస్త్రికి మతిమరుపు ఎక్కువ. పదాలు పలకడం కూడా కష్టంగా ఉండేది. మొదటిరోజు చెప్పిన మాట మరునాటికి మర్చిపోయే వాడు. అయితే గురువుగారు నారాయణ శాస్త్రి లోని బలహీనత గమనించి పాఠం నిదానంగా చెప్పడం ప్రారంభించాడు. చెప్పిన పాఠం ప్రతిరోజు చదివించి వినేవారు. గురువుగారు ఎంతో శ్రద్ధతో ,ఎంతో ఓపికతో ,తిట్టకుండా ,కొట్టకుండా ప్రతిరోజు పాఠాల్ని జాగ్రత్తగా చెబుతూ ఉండేవారు. చెప్పిన పాఠం విడమర్చి చెప్పడం ,పాఠానికి అర్థం చెప్పడం, పాఠాల్ని పదేపదే చదివించడం చూస్తుంటే నారాయణ శాస్త్రికి గురువు క్రమేపి అభిమానం పెరిగింది. శిష్యుడు అభివృద్ధి కోరే గురువుగారు అంటే ఇలాగే ఉంటారేమో అని అనుకున్నాడు నారాయణ శాస్త్రి.
ప్రతిరోజు ఉదయం లేచి నిత్య విధులన్నీ పూర్తి చేసుకుని గురువుగారి పూజకు కావలసినవన్నీ సమకూర్చడమే కాకుండా, గురువుగారి దిన చర్యలో ఏ వేళకి ఏం కావాలో సమకూర్చడమే కాకుండా, గురువుగారి భార్య చెప్పే పనులన్నీ చక్కగా చేస్తూ పాఠాలు శ్రద్ధగా చదువుకుంటూ ఆ దంపతుల అభిమానం సంపాదించాడు నారాయణ శాస్త్రి.
రామకృష్ణ శాస్త్రి చతుర్వేదాలు నేర్చుకుని ఆ మండలంలోని గ్రామాల్లో పౌరోహిత్యం చేస్తూ, ఉన్న కొద్దిపాటి వ్యవసాయాన్ని సొంతంగానే చేస్తూ, ఆ గ్రామంలో కాలక్షేపం చేస్తూ ఉంటాడు.తనని నమ్ముకుని వచ్చిన వేద విద్యార్థులకు వేద విద్య ఉచితంగా బోధించడమే కాకుండా తెలుసున్న వారి సహాయంతో ఏదో ఒక గ్రామo లో కొన్ని పౌరోహిత్యాలు అప్పజెప్పి విద్యార్థి సుఖంగా బ్రతికేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంటాడు.
అలాంటి గురువుగారు అంటే ఎవరికి అభిమానం ఉండదు. ఏ వైదిక కార్యక్రమానికి వెళ్లిన శిష్యులందరినీ వెంటబెట్టుకుని వెళ్లి శిష్యులందరికీ పదో పరకో సంపాదించుకునే ఏర్పాటు చేస్తూ చదువుతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా నేర్పిస్తాడు రామశాస్త్రి. ఎందుకంటే జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. చిన్నతనంలోనే తండ్రి పోతే తల్లి అతి కష్టం మీద పెంచి పెద్ద చేసి వేద పండితుడిగా తీర్చిదిద్దింది. విద్యార్థి దశలో ఉండే కష్టాలు ఆయనకు తెలుసు.
రామకృష్ణ శాస్త్రి భార్య రాజమ్మ కూడా శిష్యులందరినీ తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటుంది. పొలంలో పండిన మామిడిపళ్ళు, అరటి పళ్ళు ,ఇంట్లో చేసిన తినుబండారాలు శిష్యులకి పెడుతూ ఒక కన్నతల్లిలా ఆదరించేది. దానికి ఒక కారణం కూడా ఉంది. ఆ పుణ్య దంపతులకి సంతానం లేకపోవడం ఒకే ఒక్క లోటు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు అనుగ్రహించలేదు.
అలా రెండు మూడు సంవత్సరాలు గడిచేయి. నారాయణ శాస్త్రి కి శ్రద్ధగా విద్య నేర్చుకుంటూ గురువుగారికి తలలో నాలుకలో అయిపోయాడు. నారాయణ శాస్త్రి చదువులో చూపిస్తున్న శ్రద్ధ, గురువుగారు పట్ల చూస్తున్న అభిమానం వలన గురువుగారికి అభిమాని శిష్యుడుగా మారిపోయాడు నారాయణ శాస్త్రి.
ఒకరోజు నారాయణ శాస్త్రి ని పిలిచి" ఒరేయ్ నారాయణ నాకు పిల్లలు ఎలాగ లేరు! కానీ నా ఇల్లు ఎప్పుడు వేదం చదువుకునే విద్యార్థులతో సందడిగా ఉండాలి రా !అని చెబుతుండేవాడు. నా తర్వాత కూడా ఈ అరుగుల మీద వేదం వినబడుతూనే ఉండాలి. ఈ విద్య అందరికీ ఊరికనే రాదు. ఏదో పూర్వజన్మ సుకృతం ఉండాలి. పిల్లలకి వేదం నేర్పించే తల్లితండ్రులు కూడా చాలా అదృష్టవంతులై ఉండాలి. ఒక గురువుతోటి ఈ విద్య అంతరించిపోకూడదు. తరతరాలుగా అలా కొనసాగుతూనే ఉండాలి. ఈ విద్యకి ఎక్కడ పాఠశాలలు లేవు.
దానికి తోడు విద్యను అభ్యసించే వారికి ప్రోత్సాహం చాలా అవసరం. నేను ఈ గ్రామంలో వారాలు చేసుకుని పక్క ఊర్లో పాఠాలు నేర్చుకుని విద్య నేర్చుకున్నాను. నాకు అప్పటికి పది ఏళ్లు. తెలిసి తెలియని వయసు. ప్రతి వారం ఆ గ్రామస్తుల ఇంటికి తొలి రోజు వెళ్లి" రేపు మీ ఇంట్లో నా వారం అండి అని ఆ ఇంటి యజమానురాలికి చెప్పవలసి వచ్చేది. వారింట్లో ఏదైనా అడ్డు ఉంటే ముందుగానే చెప్పేవారు. ఆ మాట మా గురువుగారికి చెప్తే దానికి తగిన ఏర్పాటు చేసేవారు మా గురువుగారు. దానికి తోడు నా వేషం నెత్తి మీద పిలక, పంచ కట్టు ,భుజం మీద కండువా చూసి నా తోటి పిల్లలు పాపం తెలియక నవ్వేవారు. నాకు ఏడుపొచ్చేది. నాకు తండ్రి లేడు. మా తల్లి గారితో చెప్తే ఏదో చెప్పి ఊరుకోబెట్టేది. అందుకే ఈ వేదం చదువుకునే విద్యార్థులకి గురువు అన్ని రకాలుగాను అండగా నిలబడాలి. అది నా కోరిక అంటూ చెప్పుకుంటూ వచ్చాడు రామకృష్ణ శాస్త్రి.
అలా పది సంవత్సరాలు గడిచేయి. ఇంతలో నారాయణ శాస్త్రి తల్లి, తండ్రి కూడా ఒక సంవత్సరం తేడాతో చనిపోవడం ఆ ఊర్లో ఇంకెవరు నారాయణశాస్త్రికి లేకపోవడంతో గురువుగారికి నారాయణ శాస్త్రి మీద ఇంకా శ్రద్ధ ఎక్కువ పెరిగింది. గురువు గారికి ఒక కోరిక ఉండేది . ఎలాగైనా నారాయణ శాస్త్రి చతుర్వేద పండితుడిని చేయాలని. కానీ అప్పటికే నారాయణ శాస్త్రి కి వయసు ఇరవై ఏళ్లు దాటింది.
అనుకోకుండా పక్క గ్రామంలో పౌరోహిత్యం చేయించే ఒక వేద పండితుడి వయస్సు మీరి పోయి వైదిక కార్యక్రమాలు చేయించలేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు రామకృష్ణ శాస్త్రి సలహా మేరకు నారాయణ శాస్త్రి ఆ గ్రామ పురోహితులుగా అంగీకరించారు ఆ ఊరివారు. రామకృష్ణ శాస్త్రికి ఈ సంఘటన చాలా ఆనందం కలిగించింది. ఒకటి తన అభిమాన శిష్యుడికి బ్రతుకేందుకు ఆధారం దొరకడం, వయసు మీరిపోతున్న తనకి ఆ శిష్యుడు తన అందుబాటులో ఉండడం అదృష్టంగా భావించాడు. రాను రాను గురువుగారు వయసు మీద పడడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడం తగ్గించేశారు. ఆరోగ్యం క్షీణించడంతో పౌరోహిత్యం కూడా క్రమేపీ తగ్గిస్తూ వచ్చారు .
రామకృష్ణ శాస్త్రి దంపతులకు వయసు పెరిగే కొద్దీ పిల్లలు లేరనే బెంగ మరి ఎక్కువైంది . చివరి రోజులు ఎలా గడిస్తాయో! అని ఇద్దరు అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు రామకృష్ణ శాస్త్రి భార్యని నారాయణ శాస్త్రి మీద నీ అభిప్రాయం ఏమిటి ? నారాయణ శాస్త్రి చాలా మంచి వాడండి అంది ఆనందంగా. భర్త ఏ ఉద్దేశంతో అడిగాడు ఆవిడకు తెలియదు. ఆ తర్వాత తన మనసులో ఉన్న మాట భార్యకి చెప్పాడు. అలా కొద్ది రోజుల తర్వాత శిష్యుడుగా వచ్చిన నారాయణ శాస్త్రి రామకృష్ణ శాస్త్రికి దత్తపుత్రుడు అయిపోయాడు.
అసలే గురువుగారు అంటే విపరీతమైన అభిమానం దానికి తోడు దత్తత పుత్రుడు అయ్యాడు. ఇంకేముంది సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకోవడం మొదలుపెట్టాడా దంపతుల్ని నారాయణ శాస్త్రి.
అలా కొద్ది రోజులకి తమ దూరపు బంధువుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నారాయణ శాస్త్రి పౌరోహిత్యం చేసే ఊరివారి సహాయంతో ఒక ఇల్లు కూడా నిర్మించారు రామకృష్ణ శాస్త్రి. ఆ గురువుగారి ఆశీర్వాదం వలన ఐదుగురు పిల్లలతో పుట్టడంతో ఆనందంగా కాపురం చేస్తూ ఉండేవాడు నారాయణ శాస్త్రి.
అలా నారాయణ శాస్త్రి పిల్లల్ని తన సొంత మనవలగా ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ కొద్ది కాలానికి రామకృష్ణ శాస్త్రి , అతను భార్య కూడా మరణిస్తారు. సొంత కొడుకు కంటే ఎక్కువగా బాధపడుతూ ఆ దంపతులకు కర్మకాండ శ్రద్ధగా చేసి తన బాధ్యత నెరవేర్చుకుంటాడు నారాయణ శాస్త్రి. అయితే నారాయణ శాస్త్రి కి ఒక కోరిక ఉండేది. ఎప్పటికైనా సరే గురువుగారి పేరు మీద వేద పాఠశాల నిర్మించి వేదం చదువుకునే విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి సమకూర్చాలని అనుకునేవాడు. కానీ నారాయణ శాస్త్రి ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించలేదు. గురువుగారు చనిపోయిన తర్వాత గురువుగారి బీరువా సర్దుతుంటే ఒక వీలునామా కనబడుతుంది.అది చదివిన నారాయణ శాస్త్రి విస్తుపోయాడు.
రామకృష్ణ శాస్త్రి గారు తన పేరుతో చేసిన వీలునామా ప్రకారం, తన వంశపారంపర్యంగా ఉన్న వ్యవసాయ భూమి, ఇల్లు, ఇంకా కొంత నగదు తనకు దత్తతగా తీసుకున్న నారాయణ శాస్త్రికి అప్పగించానని స్పష్టంగా రాశారు. అంతేకాదు, ఆ ఆస్తిని తగిన విధంగా ఉపయోగించి గ్రామంలో వేద విద్య కొనసాగించాలనే సంకల్పాన్ని కూడా పేర్కొన్నారు.
నారాయణ శాస్త్రికి కన్నీళ్లు ఆగలేదు. తన గురువు అంతలా తనను నమ్మి, ప్రేమించి, చివరి వరకు తనను తన కొడుకుగా భావించారనే అర్థం చేసుకున్నాడు. ఆ వెంటనే, అతను తన భార్యతో కలిసి ఊరి పెద్దలను సంప్రదించి, ఆస్తిని వేద పాఠశాల ఏర్పాటుకు వినియోగించేందుకు ఏర్పాట్లు ప్రారంభించాడు.
ఊర్లోని గొప్ప దాతలు, అతని గురువు శిష్యులుగా పరిగణించే పలువురు కూడా సహాయంగా ముందుకొచ్చారు. కొన్నేళ్లకు ఆ ఊర్లో “శ్రీ రామకృష్ణ వేదపాఠశాల” నిర్మించబడింది. ప్రతి ఏడాది గురుపౌర్ణమిని ఘనంగా జరుపుకుంటూ, రామకృష్ణ శాస్త్రి స్మృతిని సజీవంగా ఉంచేందుకు ప్రత్యేక పూజలు, అన్నదానాలు నిర్వహించే సంప్రదాయం ప్రారంభమైంది.
తన గురువు ఆశయాన్ని నిజం చేసినందుకు, నారాయణ శాస్త్రి ని అందరూ అభినందించారు. గురువు ఆశీస్సులతో తన సంతానం కూడా వేదాధ్యయనం చేస్తుండడంతో, జీవితంలో గురువు ఆశయం నెరవేర్చినందుకు చాలా ఆనందపడ్డాను నారాయణ శాస్త్రి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279