Nuli Vechani Vennela - 13 in Telugu Detective stories by sivaramakrishna kotra books and stories PDF | నులి వెచ్చని వెన్నెల - 13

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

నులి వెచ్చని వెన్నెల - 13

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"అయితే తను ప్రస్తుతం పేస్ చేస్తూన్న ఈ డిజార్డర్ వల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదంటావా?"

"అలాని చెప్పలేను. ఈ సైకలాజికల్ డిజార్డర్స్ డెవలప్ అయ్యి తమకి, ఎదుటవాళ్ళకి కూడా ప్రమాదం సృష్టించే అవకాశం కూడా వుంది. ఐ సజెస్ట్ స్ట్రాంగ్ ట్రీట్మెంట్ టు హర్. ఆవిడ ఒప్పుకుంటే, తనని ట్రీట్ చెయ్యడానికి నాకు అభ్యతంరం లేదు." మల్లిక అంది.

"అయితే నేను తనతో మాట్లాడి చూస్తాను. తను మంచిమనిషే. తానొక సైకలాజికల్ డిజార్డర్ తో బాధ పడుతోందని, తనకి ట్రీట్మెంట్ అవసరమని చెప్తే మరోలా అనుకోదు." సమీర మొహంలోకి చూస్తూ అన్నాడు అనురాగ్.

"అప్పుడే వద్దు అనురాగ్. ఆ విషయం ఆలోచించి చేద్దాం." తను నీరజ ని అడిగిన హెల్ప్ గురించి అనురాగ్ కి ఇంకా మల్లిక కి తెలిస్తే వాళ్లెలా రియాక్ట్ అవుతారా అన్న ఆలోచన వచ్చి అనీజీ గా అనిపించింది సమీరకి. "ప్రస్తుతానికి అయితే మనకేం ఇబ్బంది లేదు కదా."

ఆ తరవాత కూడా తాము ముగ్గురూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు.

&&&

"బేబీ, అది నీ ప్రాణాలు తీస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి."

తను ఎక్కడో మేఘాల్లో వున్నారు. తన గొంతు చాలా ఆందోళనతో వుంది. తను కిందన నిలబడి తను చెప్పేది వింటూంది.

"అది నా మీద పగబట్టింది. నన్ను చంపేసి కూడా సాధిస్తూంది, నిన్నూ చంపేసి సాధిస్తుంది. జాగ్రత్త." తన డాడ్ చెప్తూన్నారు.

"అదెవరు డాడ్? ఎందుకిలా చేస్తూంది?" తను ఆందోళనగా ఏడుస్తూ అడుగుతూంది.

"ఒసేయ్ రాక్షసీ, ఆగవే. నన్ను చంపేశావ్, చాలదా? ఇంకా నన్ను హింసిస్తావా?" సడన్గా తన డాడ్ ఏడవడం మొదలుపెట్టి ఎటువైపో చూస్తూ అడుగుతూ వున్నారు..

"డాడ్....డాడ్....ఎవరు.....ఎవరు?" తనూ ఏడుస్తూంది, పెద్దగా కేకలు పెడుతూంది.

"సమీ, గెట్ అప్ ఏమైంది, లే."

సమీరా లేచి చూస్తే, మల్లిక తన భుజాలు పట్టుకుని కుదుపుతూ వుంది.

"అది…………….అది……………....డాడ్ ని చిత్రహింసలు పెడుతూంది. డాడ్ ఏడుస్తున్నారు." లేచి కూచుని మల్లిక మొహంలోకి చూస్తూ అంది సమీర. తనూ కొంచెం గా ఏడుస్తూనే వుంది.

"వాట్ ది హెల్ యు అర్ టాకింగ్? మీ డాడ్ ని ఎవరో చిత్రహింసలు పెట్టడం ఏమిటి, తను ఏడవడం ఏమిటి? నువ్విప్పటివరకూ పడుకున్నావు, నీకు వచ్చింది జస్ట్ ఏ డ్రీం." కోపంగా అంది మల్లిక.

"ఏమో నాకలా అనిపించడం లేదు మల్లికా. ఆ డ్రీం చాలా రియల్ గా వుంది." అప్పటికి సద్దుకుని ఏడుపు ఆపింది సమీర.

"తెలివి వచ్చేవరకూ ప్రతి డ్రీమ్ రియల్ గానే ఉంటుంది." సమీర ని హత్తుకుని అంది మల్లిక "జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. నీకు వచ్చింది జస్ట్ ఏ డ్రీమ్. అంకుల్ ఏం కాలేదు, కావట్లేదు, ఆయన ఎక్కడవున్నా హాయిగానే వున్నారు. ప్రస్తుతానికి పడుకో."

"నాకొచ్చిన డ్రీమ్ ఏమిటో తెలుసుకోవాలని నీకు లేదా?" మల్లిక ని ఆపుతూ కోపంగా అడిగింది సమీర.

"డ్రీమ్ ఏదైనా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అది జస్ట్ ఒక డ్రీమ్ మాత్రమే కాబట్టి." మల్లిక అంది. "ఎనీహౌ నేను అది కూడా వింటాను. కానీ ఇప్పుడు కాదు. రేపు ఉదయం. అంతవరకూ మాత్రం ప్రశాంతం గా పడుకో."

ఆ తరవాత సమీర చెప్పేది వినకుండా బలవంతంగా పడుకోబెట్టి, తనని గట్టిగా పట్టుకుని తనూ పడుకుంది మల్లిక. తనని మల్లిక అలా పట్టుకుని పడుకోవడం వల్ల కాబోలు, ఆ తరవాత పెద్దగా ఏ ఆలోచనలు లేకుండా నిద్రపోగలిగింది సమీర.

&&&

"నేను నా హస్బెండ్ తో మాట్లాడాను మేడం. తనకి మీతో మాట్లాడడానికి అభ్యంతరం లేదు. కాకపోతే తను మీతో ఇక్కడ మాట్లాడలేరు. అలాగే నాతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడడానికి ఆయనకి అవ్వదు అని చెప్పారు. తను మీతో మాట్లాడాలి అంటే తనకొక మీడియం కావాలి."

తను అడుగుదామనుకుంటూన్న విషయం తను అడక్కుండానే నీరజ చెప్పడం సమీర కి ఆనందం కలిగించింది. 

"అయితే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి?" సమీర అడిగింది.

"మీరు సాయంత్రం నాతో పాటుగా నా ఇంటికి రండి. నేను మా అమ్మాయిని మా ఫ్రెండ్ ఇంటిదగ్గర ఉంచి, నా హస్బెండ్ కి మీడియం గా వర్క్ చేస్తాను. తను నా ద్వారా మీతో మాట్లాడడానికి అవుతుంది. అప్పుడు మీరు మీకు కావాల్సిన ప్రశ్నలన్నీ ఆయన్ని అడగొచ్చు."

"థాంక్ యు నీరజా." సమీర అంది కానీ అంతలోనే నీరజ అన్నది గుర్తుకు వచ్చి అంది. "ఓహ్, నీకు నేను థాంక్స్ చెప్పకూడదు కదా. సారీ." అంది.

"మీ దగ్గరనుండి సారీ వినడం కూడా నాకెప్పుడూ ఇష్టం ఉండదు మేడం." చిరునవ్వుతో అంది నీరజ.

తరువాత ఆ రోజు చేయవలసిన పనుల గురించి ఇద్దరూ చర్చించుకున్నాక, అక్కడనుండి వెళ్ళిపోయింది నీరజ. 

&&&

ఆ రోజు సాయంత్రం నీరజ తో కలిసి తన ఇంటికి వెళ్ళింది సమీర తన కారులో. అనురాగ్ కి ఇచ్చినట్టుగా ఫ్లాట్ ఇవ్వకపోయినా, తాము ఇచ్చే సాలరీ తో ఒక పోష్ ఏరియా లోనే, ఒక మంచి ఇంట్లోనే అద్దెకు వుంటోంది నీరజ. తామిద్దరూ వెళ్లే సమయానికి తన ఇంట్లో పనిమనిషి పాపతో ఎదురు చూస్తూ వుంది నీరజ కోసం.

"నేను ఇంటికి చేరుకునే సమయానికి మా అమ్మాయి సుస్మితని స్కూల్ నుండి పిక్ అప్ చేసుకుని, ఇంట్లో నాకోసం నా సర్వెంట్ మెయిడ్ ఎదురు చూస్తూ ఉంటుంది." పాపని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ అంది నీరజ.

సమీర పాపని పలకరించాక, పాప కూడా నవ్వుతూ పలకరించింది సమీరని.

"నువ్వు పాపని నా ఫ్రెండ్ మాలతి ఇంటికి తీసుకుని వెళ్లి, తనని నేను అక్కడ ఉంచమన్నానని చెప్పు. ఒక గంట పోయాక నేను వెళ్లి తీసుకుని వస్తాను. నేను ఆల్రెడీ మాలతి తో ఈ విషయం మాట్లాడాను." సర్వెంట్ మెయిడ్ తో నీరజ చెప్పింది.

ఆ సర్వెంట్ మెయిడ్ తలూపి, పాపని తీసుకుని అక్కడనుండి వెళ్ళిపోయింది.

"మాలతి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. తను హౌస్ వైఫ్. నాకు చాలా విషయాల్లో హెల్ప్ ఫుల్ గా ఉంటూ ఉంటుంది." సర్వెంట్ మెయిడ్ అక్కడనుండి వెళ్ళిపోయాక, సమీరని చూస్తూ అంది నీరజ.

"ఐ సీ" తలూపి అంది సమీర.

"నేను మీకు కొంచెం కాఫీ తీసుకుని వస్తాను." అక్కడనుండి వెళ్ళబోతూ అంది నీరజ.

"నీరజా, ప్లీజ్. ఎలాంటి ఫార్మాలిటీస్ వద్దు. నేనెందుకోసం వచ్చేనో నీకు తెలుసు. ఆలస్యం లేకుండా అందుకు ఏర్పాట్లు చెయ్యి." అనీజీ గా అంది సమీర.

తానొక పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. తమ కంపెనీలో ఒక చిన్నఎంప్లొయీ ఇంటికి ఇలా వచ్చిందంటే బాగుండదు. మొదటినుండి ఇలా రావడానికి తనకి అనీజీగానే వుంది. కానీ ఆ స్త్రీ గురించి తెలుసుకోవాలన్న ఆతృతతోనే వచ్చింది. 

"నేను ఇప్పుడే మీరు నా హస్బెండ్ తో మాట్లాడడానికి ఏర్పాట్లు చేస్తాను. మీరందాకా ఈ సోఫాలో వచ్చి కూచోండి."

సమీర, నీరజ చూపించిన సోఫాలో కూచున్నాక అక్కడే నేలమీద ఒక దుప్పటి పరచి దానిమీద పద్మాసనం వేసుకుని కూచుంది నీరజ.

"మేడం. ఇప్పుడు మీరు నా ఎదురుగుండా కూచోండి. నేను నా హస్బెండ్ ని నాలోకి ఆహ్వానిస్తాను. తను నాలోకి వచ్చిన తరువాత మీరు అడగదలుచుకున్నవి అన్నీ అడగండి." నీరజ అంది.

సమీర తలూపి నీరజ ముందుకి వచ్చి, నీరజ కి ఎదురుగుండా దుప్పటి మీద కూచుంది నీరజ వైపు ఆసక్తిగా చూస్తూ.

"సందీప్, మా మేడం నీరజ నీతో మాట్లాడాలనుకొంటున్నారు. నువ్వు తనతో నా ద్వారా మాట్లాడతానని మాట ఇచ్చావు. దయచేసి నాలోకి వచ్చి, తనడిగే ప్రశ్నలకి నీకు తెలిసిన సమాధానాలు చెప్పు."

కళ్ళు మూసుకుని చిన్న స్వరంతో అంది నీరజ. కానీ నీరజలో ఎటువంటి మార్పు రాలేదు. అదేవిధంగా మళ్ళీ, మళ్ళీ అంది. అయినా నీరజలో ఎటువంటి మార్పు లేదు. తనలోకి ఎవరూ రాలేదు. దగ్గర, దగ్గర ఐదునిమిషాలు సమయం అలా గడిచింది. 

"నీ హస్బెండ్ కి నాతొ మాట్లాడటం ఇష్టం లేదేమో. నేనిక వెళతాను." విసుగుపుట్టి లేచి నిలబడి, వెళ్ళబోతూ అంది సమీర.

"నేనిలా ఒక మీడియం లోకి రావడం ఇదే మొదటిసారి. అందుకనే ఆలస్యమైంది. క్షమించాలి." సడన్ గా నీరజ గొంతు వినిపించింది.

“నీరజా, నువ్వు………….” సమీర అయోమయంగా ఏదో అనబోయింది.

"నేను నీరజని కాదు. ఈపాటికి మీకు అర్ధం అయివుండాలి." నీరజ గొంతులో ఎలాంటి మార్పు లేదు.

"అంటే మీరు..................." సమీర గుండె వేగం పెరిగింది. ఎదో తెలియని భయం ఏర్పడింది. మొదటిసారిగా తను ఒక చనిపోయిన మనిషితో మాట్లాడుతూ వుంది.

"నీరజ లేట్ హస్బెండ్ సందీప్ ని. మీరు నాతొ మాట్లాడాలనుకొంటున్నారు కదా. అందుకనే ఇలా వచ్చాను."

సమీరకి ఏం చెయ్యాలో తోచలేదు. అప్పటివరకూ ఏం అనిపించలేదు కానీ, ఒక మీడియం ద్వారా అయినా సరే చనిపోయిన మనిషితో మాట్లాడాలి అంటే చాలా భయంగా వుంది.

"మీరు నాకు భయపడాల్సిన అవసరంలేదు. దయచేసి కూచుని మీరు అడగాలనుకున్నవి అడగండి. మా కుటుంబం మీకు చాలా రుణపడి వుంది. మీరు నీరజకి వుద్యోగం ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు."

"నీరజ చాలా చక్కగా పనిచేస్తూ వుంది. తను నాకూ చాలా ఉపయోగకరంగానే వుంది." మళ్ళీ నీరజకి ఎదురుగుండా కూచుని, సర్దుకుంటూ అంది సమీర.

"మీరేం అడగదలుచుకున్నారో అడగండి. నేనెక్కువసేపు ఈ మీడియం లో ఉండలేను." నీరజ అంది.

"నాకెవరో ఆడమనిషి అపకారం చెయ్యబోతూందని మీకెలా తెలుసు?" సమీర అడిగింది.

"తను మీ చుట్టూతానే వుంది నేనెప్పుడూ నీరజ దగ్గరే వుంటున్నట్టుగా. నీరజ మీదగ్గర వున్నప్పుడు, నేను నీరజతోటె ఉండడం వల్ల తనని చూడగలుగుతున్నాను. అప్పుడు తను నాతొ చెప్పింది."

"తనెందుకు నాకు అపకారం చెయ్యాలనుకుంటూంది? నేను తనకేం అపకారం చేసాను?" అది విన్నాక సమీర మనసు ఇంకా భయంతో నిండిపోయింది. తనెలా మాట్లాడుతూందో తనకే తెలియడం లేదు.

"మీ వల్ల తనకేం అపకారం జరగలేదు. కాకపోతే మీ తండ్రిగారి మీద తను చాలా కోపంగా వుంది. ఆ కోపంతోటె తను మిమ్మల్ని బాధపెట్టాలని చూస్తూంది."

"అయితే మా డాడ్ తనకి అపకారం చేశారా?" ఆందోళనగా అడిగింది సమీర.

"కాదు. నిజానికి మీ తండ్రిగారు తనకేం అపకారం చెయ్యలేదు." నీరజ కాస్త ఆగింది. "కాకపోతే తను తనని ఎంత ప్రేమించినా పట్టించుకోలేదు. చనిపోతానని బెదిరించినా కూడా కరగలేదు. నిజానికి అందుకనే తను సూసైడ్ చేసుకుని చనిపోయింది."

"అందులో నా డాడ్ తప్పేం వుంది? తన మనసునిండా నా మామ్ ఉండడం వల్ల తనని ప్రేమించలేకపోయారు. ఎవర్నైనా ప్రేమించమని, పెళ్లిచేసుకోమని బలవంతపెట్టడం సరికాదు కదా." కోపంగా అడిగింది సమీర.

"తను అలా ఆలోచించడం లేదు. మీ డాడ్ వల్లే తను చనిపోయానని మీ డాడ్ మీద చాలా కోపంగా వుంది. అందుకనే మీ డాడ్ కి హార్ట్ ఎటాక్ తెప్పించి చంపేశానని చెప్పింది. అలాగే మిమ్మల్ని చంపేస్తానని, బాధిస్తానని చెపుతూంది."

"మై గాడ్! నా డాడ్ ని తను చంపేసిందా?" అరిచినట్టుగా అంది సమీర.

"అలాగని తను నాతొ అంది. అందులో ఎంత నిజంవుందో నాకు తెలియదు."

కాస్త నిమ్మళించుకున్నాక అడిగింది సమీర, ఎంత తనకి తానెవరో తెలుసనిపించినా. "ఇంతకీ తానెవరో నీకేమన్నా చెప్పిందా?"

"ఒకప్పుడు మీ తండ్రిగారి దగ్గర తను సెక్రటరీ గా పనిచేశానని చెప్పింది. తనపేరు ప్రమీలట."

తన వూహ కరక్టే. "తను సూసైడ్ చేసుకుని ఇరవై సంవత్సరాలు పైనే అయిపొయింది. ఎందుకు సడన్గా మా డాడ్ మీద పగబట్టి తనని చంపేసింది? ఇన్ని సంవత్సరాల తరువాత నా మీద ఎందుకు పగ తీర్చుకోవాలని చూస్తూంది?"

"ఇన్నిరోజులూ మీ డాడ్ ని సాధిస్తూనే వుంది. ఆ విషయం అయన మీకు చెప్పలేదు. చనిపోయిన మనిషిని తను బతికివున్నప్పుడు బాధపెట్టినంతగా బాధపెట్టలేనని, అందుకనే ఆయనకి ఎంతో ఇష్టమైన మిమ్మల్ని బాధపెడతానని చెపుతూంది. మిమ్మల్ని ఎంతో బాధకి గురిచేసి, చంపి తన కక్ష తీర్చుకుంటానని చెపుతూంది."

"మై గాడ్! తనని నా డాడ్ ప్రేమించని కారణానికి తను మా మీద ఇంతగా కక్ష కట్టాలా?" ఆవేశంగా అడిగింది సమీర.

"ఆవిడ మీ తండ్రిగారిమీద ఎంతగానో పెంచుకున్న ప్రేమ పగగా మారిపోయింది. ఆ పగ తనని పిచ్చిదానిని చేసింది. తనేమి చేస్తూందో తనకి తెలియడం లేదు."

ఇంక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సమీర. నీరజ చెప్పినది వింటూ వుంటే మతిపోతూ వుంది. అంత ఆందోళనలోనూ ఆనందం కలిగిస్తూన్న విషయం ఒకటి వుంది. తన డాడ్ మనసులో తన మామ్ తప్ప ఎప్పుడూ ఎవరూ లేరు.

"మేడం, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా వుండాలి. తను మీమీద చాలా పగబట్టి వుంది. మిమ్మల్ని ఎలాగైనా చంపేయాలని చూస్తూంది."

సమీర మనసు ఇంక భయంతో నిండిపోయింది. అయినా ఇంక ఏం అడగాలని ఆలోచిస్తూండగా నీరజ అంది.

"నేనిక ఈ మీడియం లో ఉండలేను. వెళ్ళిపోతాను."

"జస్ట్ ఏ మినిట్" సడన్గా సమీరకి తోచింది ఏం అడగాలో. "చనిపోయేముందు మా డాడ్ నాతొ ఒక విషయం ఎంతగానో చెప్పాలనుకున్నారు. ఆఖరికి అది చెప్పకుండానే చనిపోయారు. నీకు అదేమిటో తెలుసా? తను నాతొ చెప్పాలనుకున్నది ఈ ప్రమీల గురించేనా?"

"నాకు ఆ విషయం తెలియదు. నేనెప్పుడూ మీ డాడ్ ని చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు. నేను ఈ ఆడమనిషి ద్వారా తెలుసుకున్నదంతా మీకు చెప్పాను." సడన్గా నీరజ మొహం పెయిన్ ఫుల్ ఎక్సప్రెషన్ తో నిండిపోయింది. "నేనింక ఈ శరీరంలో ఉండలేను. వస్తాను." అలా అన్నాక నీరజ ఎడమపక్కకి పడిపోయింది.

సమీర ఆందోళనగా నీరజ పక్కకి వెళ్లి "నీరజా, నీరజా" అంటూ భుజాలు పట్టుకుని కుదిపింది.

"మేడం నాకేమైంది? నేనెందుకిలా పడిపోయాను?" లేచికూచుని, అరచేతులతో మొహం రుద్దుకున్నాక, సమీర మొహంలోకి చూస్తూ అయోమయంగా అడిగింది నీరజ.

"అంటే ఇప్పటివరకూ జరిగినదేదీ నీకు తెలియలేదా?" నుదురు చిట్లించింది సమీర.

"లేదు మేడం. నాకు జస్ట్ నిద్రపోతున్నట్టుగా వుంది అంతే." అదే అయోమయం ఎక్సప్రెషన్ తో అంది నీరజ.

"మీ హస్బెండ్ వచ్చారు. నాతొ మాట్లాడారు." నిట్టూరుస్తూ అంది సమీర. "కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఇంకా సమాధానం లేకుండానే మిగిలిపోయింది."

"ఐ యాం సారీ మేడం." లేచి నిలబడుతూ అంది నీరజ. "మీకు తనదగ్గర మీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయనుకున్నాను."

"అది నీ హస్బెండ్ తప్పుకాదు. నీ తప్పూ కాదు. తనకి తెలియనివాటిగురించి తనెలా చెప్పగలరు? తను చెప్పలేని వాటికి నువ్వేం చేయగలవు?" నీరజతో పాటుగా తనూ లేచినిలబడి అంది సమీర. "ఎనీహౌ ఇంక వెళ్లివస్తాను." అనిచెప్పి అక్కడనుండి బయటపడింది సమీర. థాంక్స్ చెపుదామనుకున్నా, నీరజ చెప్పింది గుర్తుకువచ్చి చెప్పలేదు.       

&&&

"యు లాస్ట్ యువర్ మైండ్ సమీ. అందులో నాకేమీ సందేహం లేదు. నువ్వేం చేస్తున్నావో నీకసలు బోధపడడం లేదు."

ఎంతవద్దనుకున్నా జరిగినదంతా మల్లికకి చెప్పకుండా వుండలేకపోయింది సమీర. అంతా విన్నతరువాత మల్లిక రియాక్షన్ ఊహించినట్టుగానే వుంది.

"నువ్వు సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యావని నాకు తెలుసు. కానీ దయ్యాల్ని, భూతాల్ని నమ్మేటంత వీక్ అయిపోతావని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు." చాలా కోపంగా వుంది మల్లిక. 

"ఒక్క విషయం చెప్పు. అనురాగ్ కి కూడా ఆ ప్రమీల విషయం తెలియదు మనం చెప్పేవరకూ. మరి నిన్నగాక మొన్న నా ఆఫీస్ లో జాయిన్ అయిన నీరజకి తన గురించి ఎలా తెలుస్తుంది? తనగురించి ఎలా మాట్లాడగలుగుతుంది?"

"కమాన్ సమీ. తన గురించి తనకెవరో చెప్పివుంటారు. చూస్తూవుంటే ఇదంతా ఎవరో కావాలని చేయిస్తూన్నట్టుగా వుంది. రేపేవచ్చి తనతో మాట్లాడతాను." మల్లిక ఇంకా కోపంగానే వుంది.

"ప్లీజ్ మల్లికా, అంతపని మాత్రం చెయ్యకు." ఆందోళనగా మల్లిక రెండుచేతులు తన చేతుల్లోకి తీసుకుని ప్రాధేయపూర్వకంగా అంది సమీర. "నేను ఒప్పుకుంటా. తన మీదకి తన లేట్ హస్బెండ్ రాలేదు. అలా ఎందుకో తను ఇమాజిన్ చేసుకుంది. నేను మాట్లాడింది కేవలం తనతోటి మాత్రమే. తను చెప్పినవేమీ నేను నమ్మను." కాస్త ఆగి మళ్ళీ అంది "దయచేసి నువ్వు అన్నట్టుగా మాత్రం చెయ్యకు."

"ఆదిమాత్రం సరిపోదు. నువ్వు ఇలాంటి దయ్యాల్ని, భూతాల్ని నమ్మడం మానేస్తానని నాకు మాట ఇవ్వాలి. నీ మనసులో పారానార్మల్ కి ఎలాంటి చోటు వుండకూడదు." సమీర మొహంలోకి సూటిగా చూస్తూ అంది మల్లిక.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)