Mana Prema Amaram in Telugu Love Stories by Hemanth Karicharla books and stories PDF | మన ప్రేమ అమరం!

Featured Books
Categories
Share

మన ప్రేమ అమరం!

1. ఎడబాటు

పేరు మోసిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ;

అందులో పూర్తిగా అద్దాలతో నిర్మించిన ఓ గది. ఆ గదిలో ఒక టేబుల్ ఉంది. టేబుల్ కి అవతలి వైపు ఉన్న మూడు కుర్చీలలో ముగ్గురు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. ఇవతలి వైపు ఉన్న ఒక కూర్చీలో ఓ కుర్రాడు కూర్చొని ఉన్నాడు. అతను విశాలమైన నుదురుతో, ఆకర్షించే కళ్ళతో, ఆకట్టుకునే నవ్వుతో, చూడటానికి ఎంతో చక్కగా, హుందాగా ఉన్నాడు.

ఆ ముగ్గురు ఇతనిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇతను వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాడు. ఇంటర్వ్యూ పూర్తి అయ్యింది. అడిగిన ప్రతీ ప్రశ్నకు తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని తడబడకుండా సమాధానాలిచ్చిన అతనిలోని నిజాయితీ, ఆత్మవిశ్వాసం చూసి, వాళ్ళు అతనికి ఉద్యోగమిస్తారు. అందుకు అతను ఎంతో సంతోషంతో వారికీ థ్యాంక్స్ చెబుతాడు.

అప్పుడు, "రేపటి నుండి జాబ్ లో జాయిన్ అయిపోతారుగా?" అని ఆ ముగ్గురిలో ఒకరు అతన్ని అడుగుతారు.

అందుకు తను, "సర్, అది… ఒక ముఖ్యమైన పని ఉంది, అది చూసుకుని ఒక వారంలో జాయిన్ అవుతాను సర్! ఇఫ్ యూ ప్లీజ్ డోంట్ మైండ్!" అభ్యర్థనగా అడుగుతాడు.

అప్పుడు ఆయన, "సరే! కానీ మీరు చెప్పినట్టు కచ్చితంగా వారంలో రాకపోతే ఈ ఉద్యోగం మీ తరువాత మెరిట్ ఎవరున్నారో చూసి వాళ్లకి ఇచ్చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి!" అని సుస్పష్టంగా చెబుతారు.

అందుకు అతను “సరే సర్!” అంటూ ఆ గది నుండి రెట్టింపు ఉత్సాహంతో బయటకి వస్తాడు.

***

బయటకి రాగానే ఒక కార్నర్ లోకి వెళ్లి ఫోన్ తీసి ఇంటికి ఫోన్ చేస్తాడు...

కిచెన్ లో ఉన్న ఆక్వాగార్డ్ మీద మొబైల్ రింగవుతూ ఉంటుంది... ఒక 10 - 15 సెకన్లకు వాళ్ళమ్మ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.

"ఏరా నాన్న! ఇంటర్వ్యూ ఏమైంది?" ఎంతో కుతూహలంగా అడుగుతుంది ఆమె.

"సెలెక్ట్ అయ్యాను అమ్మ!" ఆనందంగా చెబుతాడు.

"చాలా సంతోషం రా...! మీ నాన్నకి చెప్పేవా?" అడుగుతుంది పట్టరాని సంతోషంతో.

"లేదమ్మా, ముందు నీకే చెబుతున్నాను!"

"సరే త్వరగా ముందు ఆయనకీ ఫోన్ చేసి చెప్పు మరి, ఆయన పైకి కనపడరు గాని నాకన్నా కంగారు ఎక్కువ!"

"సరే అమ్మ, ఇప్పుడే చేస్తాను!" అంటూ ఫోన్ కట్ చేసి, వెంటనే నాన్నకు కాల్ చేస్తాడు.

ఆయన తన ఆఫీసులో తన కేబిన్ లో కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తుండగా, మొబైల్ రింగ్ అవ్వటంతో, చేసింది తన కొడుకే అని గమనించి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి "ఏరా తేజ, ఇంటర్వ్యూ ఏమైంది?" అని అడుగుతారు.

"సెలెక్ట్ అయ్యాను నాన్న" ఎంతో హుషారుగా చెబుతాడు తేజ.

"ఓహ్! వెరీ గుడ్, కంగ్రాట్స్ మై సన్, ఐ అమ్ సో హ్యాపీ. వెంటనే ఈ విషయం మా కొలీగ్స్ అందరికీ చెప్పాలి. ఆ నాన్న, నువ్విప్పుడు ఎటెళ్లినా, సాయంత్రం మాత్రం త్వరగా ఇంటికి వచ్చేసేయ్. నువ్వు, మీ అమ్మ, నేను కలిసి ఈ అకేషన్ ని సెలెబ్రేట్ చేసుకుందాం, సరేనా!" పుత్రోత్సాహంతో వెలిగిపోతున్న ముఖంతో చెబుతారు.

"సరే నాన్న, సీ యూ..." అంటూ కాల్ కట్ చేసి లిఫ్ట్ వైపు వెళ్తాడు తేజ.

***

లిఫ్ట్ వస్తుంది, డోర్స్ తెరుచుకుంటాయి, లోపలకి వెళ్తాడు. తనతో పాటు ఓ అమ్మాయి కూడా లిఫ్ట్ ఎక్కుతుంది. వీరున్న ఐదవ ఫ్లోర్ నుండి లిఫ్ట్ కిందకి దిగుతుంటుంది. ఆ లిఫ్ట్ ని, తన పక్కన నించున్న ఆ అమ్మాయిని చూడగానే తేజకి ఒక సంఘటన గుర్తుకువస్తుంది...

***

ఆ సంఘటన: అది వేరే బిల్డింగ్, వేరే లిఫ్ట్, వేరే అమ్మాయి, తన పక్కన తేజ నుంచున్నాడు. ఆ అమ్మాయి కళ్ళు చాలు, ఎవరైనా రెప్ప ఆర్పకుండా తననే తన్మయత్వంతో చూస్తూ ఉండటానికి. పొడవాటి కురులతో, నక్షత్రాల్లాంటి కళ్ళతో, చంద్రబింబం లాంటి వదనంతో ఉన్న ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు తేజ.

అది గమనించిన ఆమె "ఏంటి నన్నే చూస్తున్నావు?" అని అడుగుతుంది పెదాలపై వచ్చే చిరునవ్వుని ఆపుకుంటూ, చిరుకోపాన్ని నటిస్తూ!

"ఇంకిక్కడ ఎవరూ లేరుగా..." అంటాడు తేజ నవ్వుతూ.

ఆ మాటకు ఇంక నవ్వు ఆపుకోలేక గల గలా నవ్వేస్తుంది తను.

"నీతో ఈ లిఫ్ట్ లో గడిపే ఈ 30 సెకన్ల సమయం కోసం నేను రోజూ ఎదురుచూస్తాను తెలుసా!" అంటాడు తేజ.

"నాకు తెలుసు!" అని అంటుంది బుగ్గలను దాటి వస్తున్నా సిగ్గుని కప్పిపుచ్చుకుంటూ.

"ఏం తెలుసు?!" అంటాడు ఆశగా.

ఇంతలో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి ఆగుతుంది. తను సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటుంది.

"ఓయ్ గీతిక! ఏం తెలుసో చెప్పి వెళ్ళు" అని అడుగుతాడు.

తేజ అన్న మాటకు తను ఆగి వెనక్కి తిరిగి, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని" అని వెంటనే మళ్ళీ వెళ్లిపోతుంటుంది నవ్వుకుంటూ.

"బానే తెలుసుకున్నావ్, మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో కూడా చెప్పేయచ్చుగా..." అని అరుస్తాడు గట్టిగా నిల్చున్న చోటు నుండే.

"అది నువ్వు తెలుసుకో" అని తను కూడా గట్టిగా అరుస్తూ సమాధానమిచ్చి దూరంగా వెళ్ళిపోతుంది.

***

ఈ సంఘటనను గుర్తుతెచ్చుకుని తనలో తాను నవ్వుకుంటూ తన జేబులో ఉన్న తన పర్సు తీస్తాడు. అందులో తన అమ్మ, నాన్న ఫొటోలతో పాటు గీతిక ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటోని చూస్తూ, "నిన్ను చూడక, నీతో మాట్లాడక సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సర కాలంలో కొన్ని లక్షల సార్లు గుర్తొచ్చావ్, ఏ అమ్మాయిని చూసినా నువ్వే గుర్తొస్తావ్. ఇక నా వాళ్ళ కాదు, నీకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉద్యోగం వచ్చిన మరుక్షణమే కలుసుకుందాం అనుకున్నాం కదా, వస్తున్నాను గీతిక, నేరుగా నీ దగ్గరకే..." అంటూ తనకి చెప్పాల్సిన మాటలన్నీ మనసులో అనుకుని అక్కడి నుండి బయలుదేరతాడు.

అప్పుడు ఓ పాట మొదలవుతుందిలా... (మీకిష్టమైన ట్యూన్ లో ఊహించుకోండి!)

m: "ఎడబాటే ఎదురైనా, జ్ఞాపకాలే ఊపిరిగా చేసుకుని,

ఆశయాలను సాధించుకుని, విరహపు చెరను తెంచుకుని,

నీతో ప్రేమను పంచుకునేందుకు వస్తున్నా నీ దరికి,

నా చెలీ సఖి... నిను కనులారా చూసేందుకు ముఖాముఖి!

“మన మధ్యనున్న దూరానికి, కాలం చెల్లెను ఈ రోజుకి…

ఇన్నాళ్లుగా కన్న కలలన్నింటిని నిజాలుగా మార్చుకునేందుకు,

పయనమౌదాం సరికొత్త లోకానికి, చేరుకుందాం ఆశల తీరానికి!

నిజం నీడలో ఒదిగే ప్రేమ తాకేను అంబరం,

నిజాయితీ వెలుగులో ఎదిగే ప్రేమ చేరేను తారా తీరం.

ఆ రెండూ ఉన్న మన ప్రేమ అమరం!

ఇక మనం జరుపుకోవాలి తలంబ్రాల సంబరం!"

(అంటూ అక్కడితో ఆగుతుంది!)

ఈ సాహిత్యం నేపథ్యంలో వస్తున్నప్పుడు తేజ గీతికను గుర్తు చేసుకుంటూ తనకోసం బయలుదేరి, తన ఇంటికి చేరుకుంటాడు. ఆ మధ్యలో ఓ చిన్ని ప్రయాణాన్ని ఊహించుకోండి!

***

తేజ గీతిక ఇంటికి చేరుకుంటాడు;

వేల ఆశలతో తనని చూడాలని, కలుసుకోవాలని వెళ్లిన తేజకి అక్కడ కనిపించిన ఒక దృశ్యం కంగుతినేలా చేస్తుంది. గీతిక ఇంటి ముందు ఆమె వివాహానికి సంబంధించిన వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డుపై "ఆనంద్ వెడ్స్ గీతిక" అని ఉంటుంది. అది చూసిన తేజ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక్కసారిగా తనకి ఏం చేయాలో అర్ధం కాదు!

"తాను ఏ పరిస్థితిలో ఈ పెళ్ళికి ఒప్పుకుని ఉంటుందో?" అని మనసులో అనుకుంటాడు. ఇప్పుడు లోపలకి వెళ్లాలా, లేదా అటు నుంచి అటే వెళ్లిపోవాలా...? తేల్చుకోలేని సందిగ్ద పరిస్థితిలో అక్కడే అలా నిలబడి చూస్తుంటాడు. ఇంతలో ఒకతను వచ్చి ఆ బోర్డుని పీకేస్తుంటాడు.

అది గమనించిన తేజ అతని దగ్గరకి వెళ్లి, "భయ్యా! పెళ్లి... అయిపోయిందా?" అని అడుగుతాడు.

"లేదు ఆగిపోయింది..." అని చెప్పి తన పని చేసుకుంటుంటాడు.

"అదేంటి, ఎందుకు ఆగిపోయింది?!" ఆశ్చర్యంగా, సందేహంగా అడుగుతాడు.

"ఆ... నిన్నటి నుండి పెళ్లికూతురు కనిపించట్లేదు. అంతా తనే ఎటో పారిపోయిందని అనుకుంటున్నారు. ఒక రోజు గడిచినా దొరకక పోయేసరికి ప్రస్తుతానికి పెళ్లి వాయిదా వేశారు!" అని చెప్పి ఆ బోర్డు పట్టుకుని అతను పెళ్లి సామానుతో కూడిన ఓ ట్రక్ ఎక్కి వెళ్ళిపోతాడు.

అది విన్న తేజకి మరో సంఘటన గుర్తొస్తుంది...

***

ఒక రాత్రి రోడ్ పై నడుస్తూ, ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు…

"గీతిక, ఒకవేళ నాకు ఉద్యోగం వచ్చే లోపు మీ నాన్న నిన్ను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే?" అని అడుగుతాడు తేజ.

"అలాంటి భయాలేమి పెట్టుకోకు, మా నాన్నని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు, నువ్వు ముందు ఇంటర్వ్యూస్ మీద ఫోకస్ పెట్టు. అంతగా మా నాన్న బలవంతంగా వేరే పెళ్లి చేయాలి అని చూస్తే, నేను రాత్రికి రాత్రి ఇల్లు వదిలి పారిపోయి నీ దగ్గరకి వచ్చేస్తాను సరేనా!" అని అంటుంది గీతిక నవ్వుతూ.

"ఓయ్! నువ్వు దయచేసి అలాంటి ఫీట్ లు చేయకు, ఒక ఫోన్ చెయ్యి, నేనే వచ్చి తీసుకెళ్తాను."

"సరే బాబు, అలాగే!" అని తన భుజాన్ని గట్టిగా పట్టుకుని ముద్దు పెడుతుంది భుజం మీద.

***

అది గుర్తొచ్చిన తేజ, "అంటే తాను అన్నట్టుగానే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదని ఇంట్లో నుండి పారిపోయిందా? అయినా నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా, ఎందుకిలా చేసింది? అసలు నా దగ్గరకి రాకుండా ఎక్కడికి వెళ్ళింది, ఇంటికి కూడా రాలేదు, ఇంకెక్కడికి వెళ్లినట్టు?" మనసులో అనుకుంటాడు.

వెంటనే జేబులో నుండి ఫోన్ తీసి గీతిక కి ఫోన్ చేస్తాడు. కానీ, అది ‘అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా’ అని వస్తుంది! దాంతో ఇప్పుడు తనని ఎక్కడని వెతకాలి? ఎవరని అడగాలో? ఏం చేయాలో? ఇలా తన చుట్టూ అన్నీ ప్రశ్నలే, ఒక్కదానికీ తన దగ్గర సమాధానం లేదు! దాంతో తక్షణ కర్తవ్యమ్ ప్రశ్నార్థకంగా మారుతుంది తేజకి.

అలా సందిగ్ధ పరిస్థితిలో ఉన్న తేజ కి ఇంటి నుండి ఫోన్ వస్తుంది.

"చెప్పమ్మా!

"అరే నాన్న, నువ్వు త్వరగా ఇంటికి రారా..." అంటుంది అమ్మ కంగారుగా.

"ఏమైందమ్మా... అంత కంగారుగా మాట్లాడుతున్నావ్? అంతే కంగారుగా ప్రశ్నిస్తాడు.

"నువ్వు ముందు రా చెబుతాను!"

"సరే వస్తున్నా!" అంటూ కాల్ కట్ చేసి వెంటనే ఇంటికి బయలుదేరతాడు.

***

తేజ ఇల్లు;

ఎంతో కంగారుగా తేజ తన ఇంటికి వెళ్తాడు. తాను వెళ్లేసరికి గుమ్మంలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఉండటం చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతాడు.

తేజ రావటం చూసి ఆ కానిస్టేబుల్తన దగ్గరకి వచ్చి "తేజ అంటే నువ్వేనా?" అని అడుగుతాడు.

అందుకు తేజ, "అవును, నేనే" అని అంటాడు అయోమయంగా.

"అయితే పద స్టేషన్ కి"

"దేనికి..?" సందేహంగా అడుగుతాడు తేజ.

"గీతిక అనే అమ్మాయిని లేవదీసుకుని పోయావని వాళ్ళ నాన్న నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. కేసులో భాగంగా మీ అమ్మ నాన్నని ఇన్వెస్టిగేట్ చేయడానికి మీ ఇంటికి వస్తే, ఏకంగా నువ్వే దొరికేవు!" అని బదులిస్తాడు కానిస్టేబుల్.

"సర్! సంవత్సరం అయ్యింది సర్ ఆమెను కలిసి. అయినా, లేపుకెళ్తే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను సర్?" అంటూ తన పరిస్థితి వివరిస్తాడు తేజ.

"తమ్ముడు... నేనేం చేయలేను నాకు చెబితే, ఇవ్వన్నీ స్టేషన్ లో సర్ కి చెప్పు, పద!"

అప్పుడు తేజ వాళ్ళమ్మ వైపు తిరిగి, "అమ్మ నువ్వేం కంగారుపడకు, తప్పు చేయలేదని తెలిస్తే వాళ్ళే పంపిస్తారు" అని ధైర్యం చెప్పి కానిస్టేబుల్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి బయలుదేరతాడు.

***

పోలీస్ స్టేషన్;

"సర్! ఇదిగోండి సర్... తేజ దొరికాడు." అంటూ తేజ ని లోపలకి తీసుకెళ్లి ఎస్.ఐ కి చూపిస్తాడు కానిస్టేబుల్.

"ఆ పక్కన కూర్చోబెట్టు, మనకి అంతకన్నా ఇంకో పెద్ద ఇంపార్టెంట్ కేసు తగిలింది." అంటాడు ఎస్.ఐ.

"ఏం కేస్ సర్?"

"ఎమ్మెల్యే నారాయణరావు గారి అమ్మాయి హర్షిత మిస్సింగ్ కేస్! ఆమె కూడా నిన్న రాత్రి నుండి కనిపించట్లేదు అంటా. ముందు ఆమెను వెతకాలి. గీతికా వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే, తేజ దొరికాడు, అమ్మాయి దొరకలేదు, వాడిని ఇంటర్రోగేట్ చేస్తున్నాం అని చెప్పు, మేము హర్షితని సెర్చ్ చేయడానికి వెళ్తున్నాం!" అని చెబుతాడు ఎస్.ఐ.

"సరే సర్!"

"సర్, నేను అర్జెంటుగా వెళ్ళాలి సర్, తాను ఎక్కడుందో తెలుసుకోవాలి, సంవత్సరం అయ్యింది సర్ తనని చూసి, కావాలంటే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సర్!" అంటాడు తేజ ఎస్.ఐ. తో.

"ఏరా నీ కంటికి వెధవల్లా కనిపిస్తున్నామా, ఆ అమ్మాయిని నువ్వే ఎక్కడో దాచేసి, నాటకాలా? తిరుపతి, వీడిని వచ్చే వరుకూ సెల్ లో వెయ్యి!" అంటాడు ఎస్.ఐ. కోపంగా పెద్ద స్వరంతో.

"సెల్ లోనా?! అలా ఎలా సెల్ లో పెడతారు సర్, సాక్ష్యాధారాలు లేకుండా?" అని అంటాడు తేజ అమాయకంగా.

"ఏంట్రా రూల్స్ మాట్లాడుతున్నావ్!" అంటూ మితిమీరిన కోపంతో ఎస్.ఐ. తేజ మెడను పట్టుకుని బలంగా సెల్ వైపుకి లాక్కెళ్తుంటాడు.

ఆ సమయంలో తేజ మొబైల్ మోగుతుంది. తాను లిఫ్ట్ చేద్దాం అనుకుంటే, ఈ లోపు ఎస్.ఐ. తేజ ఫోన్ ని లాక్కుంటాడు. ఫోన్ చేస్తుంది ఎవరో కాదు, గీతిక, వీడియో కాల్ చేస్తుంది. ఎస్.ఐ. కాల్ లిఫ్ట్ చేస్తాడు. గీతిక స్క్రీన్ మీద కనపడుతుంది. తాను చాలా కంగారుగా, దేనికో భయపడుతున్నట్టుగా ఉంటుంది ఆమె వాలకం. ఫోన్ తేజ లిఫ్ట్ చేస్తాడనుకుంటే ఎస్.ఐ. కనిపించేసరికి మరింత కంగారుపడుతుంది గీతిక.

"సర్, మీరు ఇన్స్పెక్టరా? అసలు తేజకి ఏమైంది?" అని అడుగుతుంది గీతిక కంగారుగా.

"తేజ మీద మీ నాన్న కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేసాం, ఇంతకీ నువ్వెక్కడ ఉన్నావ్?"

"అయ్యో సర్! తనని ఎందుకు అరెస్ట్ చేసారు? తనకీ, నేను కనిపించకపోవటానికి ఏ సంబంధం లేదు. ఎవరో కొంతమంది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కిడ్నప్ చేస్తుంటే, ఆమెను కాపాడే ప్రయత్నంలో నేను, తను ఇలా ఓ ప్లేస్ లో చిక్కుకుపోయాం. వాళ్ళు కూడా మమ్మల్ని వెతుకుతూ ఇక్కడే ఎక్కడో ఉన్నారని మా అనుమానం!" అని జరిగిందంతా వివరిస్తుంది.

ఆమె వీడియో లో చూపిస్తున్న ప్రదేశం చూడటానికి ఓ అడవిలా ఉంది.

"ఏంటి? ఎమ్మెల్యే గారి అమ్మాయా?! ఇప్పుడు నీతోనే ఉందా?" ఎస్.ఐ. ఆతురుతగా.

"హా! ఉంది సర్." అంటూ కెమెరాని అటు పక్కకి తిప్పగా ఎమ్మెల్యే కూతురు హర్షిత కనిపిస్తుంది.

హర్షితని చూసి అక్కడ వాళ్ళందరూ ముందుగా ఆశ్చర్యపోతారు. కానీ, అమ్మాయి జాడ తెలిసినందుకు కాస్త ఊపిరి పీల్చుకుంటారు.

"సర్, చూసారు కదా, దీనికి తేజకి అస్సలు సంబంధం లేదు, తేజని ఒకసారి చూపించండి సర్!"

అని గీతిక అనడంతో ఎస్.ఐ ఫోన్ తేజకి ఇస్తాడు. అలాగే అక్కడ ఉన్న ఒకతన్ని ఫోన్ సిగ్నల్స్ ని ట్రేస్ చేయమని చెబుతాడు. తేజ ఫోన్ తన చేతులోకి తీసుకుంటాడు. సంవత్సరం తరువాత ఒకరినొకరు చూసుకున్నందుకు ఆనందంతో ఒక పక్క సంతోషం, ఈ రకంగా కలవాల్సి వచ్చినందుకు మరోపక్క బాధతో ఇద్దరి కళ్ళ వెంట నీళ్లు కారతాయి.

"ఎలా ఉన్నారండి?" ప్రేమగా, వణుకుతున్న గొంతుతో అడుగుతుంది.

"నేను బానే ఉన్నాను, నీకేం కాలేదు కదా?" ఏడుస్తూ, అడుగుతాడు తేజ కంగారుగా.

"నాకేం కాలేదు, మీరు కంగారు పడకండి!"

"అయినా నువ్వెందుకు వెళ్ళేవు, పోనీ నాకైనా వెంటనే ఫోన్ చేయచ్చుగా?" అంటాడు.

"నాకు ఆ క్షణం, ఫోన్ చేయటం కుదర్లేదండి, అయినా మీరు లేకపోయినా, మీరిచ్చిన ధైర్యం నా తోడుంది, నాకేం కాదండి!" అంటుంది నమ్మకంగా.

"ఐ లవ్ యూ గీతిక!"

"ఐ లవ్ యూ అండి... హా...! అన్నట్టు ఫోన్ లో ఛార్జింగ్ తక్కువుగా ఉంది, మళ్ళీ మీతో మాట్లాడాలి అంటే ఉండాలి కదా, కాబట్టి ఉంటానండి, త్వరగా వచ్చేయండి, మిమ్మల్ని నేరుగా చూడాలని ఉంది!"

"సరే వెంటనే వస్తున్నాం!" అంటూ కాల్ కట్ చేస్తాడు.

అదంతా విన్న ఎస్.ఐ., "మీ ఇద్దరికీ పెళ్లయిందా?" అని అడుగుతాడు తేజని.

"కాలేదు సర్!"

"మరి, అండి అని పిలుస్తుంది?" అంటాడు అర్థం కానట్టు.

"చట్టపరంగా, సమాజం పరంగా, మా పెళ్లి అయుండకపోవచ్చు. కానీ, మా దృష్టిలో మా పెళ్లి ఎప్పుడో అయిపొయింది, తను నా భార్య, నేను తన భర్తను. నాకు సరైన ఉద్యోగం వచ్చే వరుకూ కొంతకాలం దూరంగా ఉందాం అనుకున్నాం, ఎందుకంటే నా ఎదుగుదలకి మా ప్రేమ అడ్డు అవుతుందనే భావన మాకు కలగకూడదని. ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లిచేసుకోవాలి అనుకున్నాం. అది వచ్చింది, కలుద్దాం అనేసరికి ఇలా జరిగింది!" అని వివరిస్తాడు బాధగా.

తేజ చెబుతున్నది వింటూ ఉంటాడు ఎస్.ఐ. ఇంతలో వాళ్ళల్లో ఒకరు "సర్, గీతికా ఇప్పుడు మస్త్యగిరి దగ్గర ఉన్న అడవుల్లో ఉన్నట్టు సిగ్నల్స్ చూపిస్తున్నాయి సర్!" అని గట్టిగా ఎస్.ఐ. తో చెబుతాడు.

అప్పుడు ఎస్.ఐ. "చూసావా, తను ఎక్కడుందో కూడా తెలిసిపోయింది, వెంటనే వెళ్లి ఎమ్మెల్యే కూతురిని, నీ భార్యని ఇద్దరినీ తీసుకొచ్చేద్దాం, అందరి ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది!" అంటాడు తేజ తో నవ్వుతూ.

ఆ మాట విన్న తేజకు కూడా మళ్ళీ ధైర్యం వస్తుంది. తను కూడా, "థ్యాంక్ యూ సర్, పదండి!" అంటాడు నవ్వుతూ.

తేజ, ఎస్.ఐ., మిగతా కానిస్టేబుల్స్ కలిసి వాళ్ళిద్దరినీ తీసుకురావడానికి మస్త్యగిరికి బయలుదేరతారు.

***

స్క్రబ్ ఫారెస్ట్స్, మస్త్యగిరి, తెలంగాణ;

హర్షిత, గీతిక ఓ చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఓ రెండు నిమిషాల నిశ్శబ్దం తరువాత…

"ఆయన మీ భర్తా?" అని అడుగుతుంది హర్షిత గీతికని.

"అవును!"

"మరీ... మీ మెడలో మంగళ సూత్రం లాంటిదేమీ లేదు?" అడుగుతుంది సందేహంగా.

"మనసులు ముడిపడ్డాయి, మెడలో ఆ మూడు ముడులు పడే సమయం కోసమే ఎదురుచూస్తున్నాను!" బదులిస్తుంది గీతిక గర్వంగా నవ్వుతూ.

"ఓ...కాబోయే భర్తా?"

"గుండెల మీద తాళి లేకపోయినా, గుండెల నిండా ప్రేమున్నప్పుడు, 'కాబోయే' అనే పదం ఉండదు!"

"ఓ... ప్రేమికులా....! దీనికి ఎందుకింత సోది!" అంటుంది హర్షిత వెటకారంగా.

అందుకు గీతిక చిన్నగా ఓ నవ్వు నవ్వి, "నువ్వు ఎవరినీ ప్రేమించలేదేమో, అందుకే అలా అనిపిస్తుంది." అని అంటుంది.

"ఎందుకు చేయలేదు, చేశాను. కాను వాడు నన్ను మోసం చేసాడు. అప్పటినుండి నాకు ప్రేమ మీద ఉన్న నమ్మకం, గౌరవం రెండూ పోయాయి!"

"తప్పు హర్షిత! ఒక్కటి గుర్తుపెట్టుకో, ప్రేమదెప్పుడూ ఏ తప్పు ఉండదు, ప్రేమించే మనుషుల్లోనే ఉంటుంది లోపం. నిజానికి, లోపం ఉన్న మనసుల గల మనుషులు చూపించేది ప్రేమ కాదు. నువ్వే చెప్పావు కదా, అతను నిన్ను మోసం చేసాడని. కరెక్టే అతను మోసమే చేసాడు, ప్రేమించలేదు. ఎందుకంటే నిజంగా ప్రేమించే వాడు మోసం చేయడు. కాబట్టి, నిన్ను మోసం చేసింది 'ప్రేమ' కాదు, 'మనిషి'!" అంటూ వివరిస్తుంది గీతిక.

"ప్రేమ గురించి ఇంత కచ్చితంగా, ఇంత నమ్మకంగా చెబుతున్నారు, నిజంగా మీది అంత స్వచ్ఛమైన ప్రేమా?"

"నాది ఔనో కాదో నాకు తెలీదు కానీ, ఆయనది మాత్రం స్వచ్ఛమైన ప్రేమే! ఈ నమ్మకం, ఆయన నా మీద చూపించే ప్రేమ నుండి వచ్చిందే!" అని చెబుతుంది గీతిక గర్వంగా.

"మీ మాటలు వింటుంటే, మీ ప్రేమకథ కూడా వినాలని ఉంది. మీకు... అభ్యంతరం లేకపోతే..." అని అడుగుతుంది హర్షిత మొహమాటంగా.

"మా కథ అక్కడక్కడా మాటలు వినిపించే మూకీ సినిమాలా ఉంటుంది, అర్ధం చేసుకోవటం కొంచెం కష్టమే..." అంటుంది గీతిక గల గల నవ్వుతూ.

"పర్లేదు, అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను, చెప్పండి", అంటుంది హర్షిత నవ్వుతూ.

హర్షిత తమ ప్రేమకథను చెప్పడం మొదలుపెడుతుంది.

అక్కడ ఇన్స్పెక్టర్ కూడా తన ప్రేమకథను చెప్పమని అడగటంతో, కదులుతున్న జీపులో, తన మనసులో మెదులుతున్న తమ ప్రేమకథను చెప్పడం మొదలుపెడతాడు తేజ.

***

2. ఆకర్షణ - ఆశ

అదొక స్టార్ట్ అప్ సాఫ్ట్వేర్ కంపెనీ; ఉదయం 10:30 గంటలు;

తేజ తన డెస్క్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఎంట్రన్స్ డోర్ నుండి ఒకమ్మాయి లోపలికి వస్తుంది. అందరిలానే తేజ కూడా డోర్ వైపు చూస్తాడు, ఆ అమ్మాయి గీతిక. గీతిక లోపలకి వచ్చి అలా నిలబడి చూస్తుంటుంది. ఇంతలో అనిత అనే ఒకమ్మాయి వెళ్లి ఆ అమ్మాయితో ఏదో మాట్లాడుతుంది. ఆ తరువాత తనని తీసుకెళ్లి ఒక ఖాళీ రూమ్ లో కూర్చోబెడుతుంది. కాసేపటికి, అనిత ఆఫీస్ రూమ్ నుండి ఏవో రెండు పేపర్లు తీసుకెళ్లి గీతికకు ఇస్తుంది. జరుగుతున్నదంతా వర్క్ చేసుకుంటూ గమనిస్తుంటాడు తేజ. కొంత సమయం గడిచేక, అనిత మళ్ళీ గీతిక ఉన్న రూంలోకి వెళ్లి, తానిచ్చిన పేపర్లను తిరిగి తీసుకుంటుంది, గీతిక బాస్ రూమ్ లోకి వెళ్తుంది. వెళ్లిన ఒక పావుగంట తరువాత బయటకి వచ్చి, అనితని కలిసి ఏదో మాట్లాడి, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనించిన తేజ తాను ఇంటర్వ్యూ కి వచ్చి ఉండచ్చు అని మనసులో అనుకుని, తన పని తాను చూసుకుంటాడు.

***

ఒక రెండు రోజులు గడిచిన తరువాత...

అదే ఆఫీస్; ఉదయం 9:30 గంటలు;

గీతిక మళ్ళీ ఆఫీస్ కి వస్తుంది. అనిత తనని చూడగానే తన దగ్గరకి వెళ్లి, తనకి తేజకి ఏమూలగా ఉన్న డెస్క్ ని చూపిస్తుంది. గీతిక అనిత చూపించిన డెస్క్ ముందున్న చైర్ లో కూర్చుంటుంది. ఆ తరువాత తన టీమ్ లీడ్ వచ్చి తాను చేయాల్సిన వర్క్ గురించి వివరిస్తారు. ఆ తరువాత ఒక్కక్కరుగా గీతికకు పరిచయం చేసుకుంటారు. తేజ వేరే టీమ్ అవడంతో అదంతా దూరం నుండి చూస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు.

ఎందుకో తెలీదు, తేజకి పదే పదే గీతికను చూడాలని అనిపిస్తుంటుంది. ఆలా అనిపించినప్పుడల్లా తన సిస్టం పైనుండి ఓ సారి తనని అలా చూసి మళ్ళీ వెంటనే తన పని చూసుకుంటూ ఉంటాడు. సరిగ్గా చెప్పాలంటే, తేజ గీతిక అంటే తనకే తెలియని ఓ ఆకర్షణ కు లోనయ్యాడు. తనకెందుకలా జరుగుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నా కూడా, ఈ అనుభూతి తనకు నచ్చింది.

***

అదే రోజు రాత్రి, తేజ ఇంట్లో; సమయం 9:45 గంటలు;

తన రూంలోని ఓ టేబుల్ ముందు కూర్చొని, డైరీ ముందు పెట్టుకుని, తేజ గీతిక గురించి ఆలోచిస్తూ తన మనసులో, "ఏదో ఉంది ఆ అమ్మాయిలో, ముఖ్యంగా తన కళ్ళు, చాలా అందంగా ఉన్నాయి, స్వచ్ఛమైన తన నవ్వునైతే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది!" అని అనుకుంటూ డైరీ తెరుస్తాడు.

"నాలో ఏదో అలజడి మొదలైంది కొత్తగా... ఆకర్షణ అనే ఈ గుమ్మం దాటి అడుగు ముందుకి పడుతుందో, లేదా ఈ ఒక్క అడుగుతోనే ప్రయాణం ఆగిపోతుందో చూడాలి!" అని రాసుకుని డైరీని మూసేస్తాడు.

***

ఆ తరువాతి రోజులు;

ఆలా తేజ రోజూ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ గీతికను చూస్తుంటాడు. అంతా బానే ఉంటుంది గాని, తాను నవ్వినప్పుడు మాత్రం తేజ గుండె వేగం పెరిగిపోతుంటుంది, ఆ నవ్వుని చూసినప్పుడల్లా ఏదో తెలియని స్వార్ధం తేజ మనసులోకి తొంగి చూస్తుంటుంది. ఆశ ఆశగా ఉన్నంతవరకూ ఏ నష్టమూ ఉండదు, కానీ అది బలపడి ఇష్టంగానో, ప్రేమలానో రూపాంతరం చెందితేనే సమస్య. ఎందుకంటే ఒక్కసారి ప్రేమ చిగురిస్తే దాన్ని నియత్రించగల శక్తి ఎవరికీ లేదు. మహాశివుని దగ్గర నుండి, మనుషుల్లో మహానుభావుల వరుకూ అందరూ ప్రేమకు బానిసలే.

ఒకరోజు గీతికా వైట్ కలర్ డ్రెస్ లో ఆఫీస్ కి వస్తుంది. సి పి యూ ఆన్ చేయటానికి తల వంచినప్పుడు అక్షింతలు కనపడ్డాయి, అంటే తాను గుడికి వెళ్లి వచ్చిందని అనుకుంటాడు ఆమెను చూసిన తేజ. తల ఎత్తగానే గీతిక నుదిటిన, రెండు కనుబొమ్మల మధ్యలో కుంకుమ ఉండటం గమనిస్తాడు. ఎర్రని కుంకుమ తన అందాన్ని ఇంకా రెట్టింపు చేసింది. సాధారణంగానే తనని రహస్యంగా చూడటానికి అవస్థలు పడే తేజ ఆ రోజు తన చూపుని ఆమె నుండి మరల్చుకోలేకపోతున్నాడు. దగ్గరకి వెళ్లి 'మీరు ఈ రోజు బావున్నారు!' అని చెప్పాలని ఉంది తేజకి. కానీ, ఇంతవరకూ ఒక్కసారి కూడా తనతో మాట్లాడింది లేదు, చెబితే ఏమనుకుంటుందా అని భయం.

ఆ ఆలోచనలతో తేజ పని మీద దృష్టి సారించలేకపోతున్నాడు. ఇక తన వాళ్ళ కాదని అలా బయటకి వెళ్లి వస్తే మనసు మళ్ళీ తన ఆధీనంలోకి వస్తుంది అని భావించి నిదానంగా మెయిన్ డోర్ నుండి బయట పడతాడు.

***

ఒక 'టీ' కొట్టు;

తేజ టీ తాగుతూ ఉంటాడు. ఎదురుగా ఓ చిన్న పిల్లాడు వాళ్ళమ్మని ఎత్తుకోమని మారం చేస్తూ ఉంటాడు. ఆమె అక్కడున్న ఓ పువ్వుల దుకాణం దగ్గర పూలు కొంటూ ఉంటుంది. పదే పదే ఆ పిల్లాడు అలా అడిగేసరికి "ఏం కొనేవారుకూ ఆగలేవా?" అంటూ పిల్లాడిని కసురుతుంది. దాంతో ఆ పిల్లాడు ఏడుపందుకుంటాడు. అప్పుడు ఆమె కొన్న పూలని సంచిలో పెట్టుకుని పిల్లాడిని ఎత్తుకుంటుంది, దాంతో ఆ పిల్లాడు వెంటనే ఏడుపు ఆపేస్తాడు. అది చూసిన తేజ తనలో తాను నవ్వుకుంటాడు. ఇందాక వరుకూ తన మనసు కూడా ఓ చంటి పిల్లాడిలా మారం చేసింది కదూ అని మనసులో అనుకుంటూ టీ గ్లాసుని అక్కడ పెట్టి వచ్చేస్తుంటాడు.

ఇంతలో ఆ టీ మాస్టర్ వెనక్కి పిలిచి డబ్బులు అడగటంతో, "అయ్యో, సారీ మర్చిపోయాను!" అని నవ్వుతూ తనకి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి బయలుదేరతాడు.

***

ఆఫీస్;

మొత్తానికి మళ్ళీ ఆఫీస్ కి చేరుకుంటాడు తేజ. తాను వెళ్లేసరికి గీతిక కారిడార్ లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. తనని చూడగానే మళ్ళీ తనతో మాట్లాడాలనే కోరిక తన మదిని తొలిచేస్తుంటుంది. గీతిక ఫోన్ మాట్లాడేసి వెనక్కి తిరిగి తేజని చూస్తుంది. అలా ఒక్కసారిగా చూసేసరికి తేజకి ఏం చేయాలో తెలీక చిన్నగా నవ్వుతాడు. దాంతో గీతిక కూడా నవ్వుతుంది.

తన నవ్వుని చూస్తూ కాస్త ధైర్యం తెచ్చుకుని "గీతిక గారు... మీరు... ఈ రోజు చాలా బావున్నారు!" అని అతికష్టం మీద మనసులో ఉన్న మాటకు సంకెళ్లు తెంచి విడుదల చేస్తాడు.

అది విన్న తాను "థ్యాంక్ యూ!" అని నవ్వుతూ లోపలకి వెళ్తుంది.

ఇన్ని రోజులు ఎవరి నవ్వు కోసం అయితే పడిచస్తున్నాడో, మురిపించే ఆ నవ్వుకి రెండంటే రెండు క్షణాలు తాను కారణం అయ్యేసరికి ఆనందంతో తబ్బుబ్బిపోయాడు తేజ. ఆ ఒక్క మాట చెప్పినందుకే ఏదో ప్రపంచాన్నే జయించిన రాజులా సంతోషంతో పొంగిపోయాడు.

***

ఆ రోజు రాత్రి, తేజ ఇల్లు;

ఏకాంతంగా ఉన్న రాజుకి ఐస్కాంతం లాంటి ఆ చెలి నవ్వే పదే పదే గుర్తొస్తుంటుంది. దాంతో వెంటనే ఎప్పటిలానే డైరీ తెరిచి తన మదిలో మెదిలే భావాలను అక్షర రూపంలో కాగితం మీద పెడతాడు...

"మందార పువ్వు సింధూరం ధరించినట్టు… అందలం నుండి దిగి వచ్చిన ఆ దేవత అందుకునేంత దగ్గరగానే ఉన్నా, అందుకోలేని ఈ దూరం తరిగి తనకి చేరువయ్యే అదృష్టం నాకు ఉందో లేదో, ఉంటే ఆ క్షణం ఇంకెంత దూరంలో ఉందో? ఆ క్షణం కోసం నిరీక్షిస్తూ ఉండాలా, లేదా జరిగే మాయను వీక్షిస్తూ ఉండాలా? ఏంటో చెదిరిన సంద్రంలోని అలల్లా ఎగసిపడే ఈ ఆలోచనలకు ఆనకట్ట వేయటం చాలా కష్టంగా ఉంది!" అని రాసి డైరీ మూసి నిద్రకు ఉపక్రమిస్తాడు.

***

3. స్వార్ధం

ఆ తరువాతి రోజు;

యధావిధిగా అందరూ వారి విధుల్లో నిమగ్నమై ఉంటారు ఆఫీసులో. తేజ కూడా యధావిధిగానే తన పని తాను చేసుకుంటూనే మధ్య మధ్యలో గీతికను చూసుకుంటూ ఉంటాడు.

అంతా సవ్యంగానే సాగుతుంది అనుకునే లోపు గీతికకు వెనుక సీట్ లో కూర్చున్న కళ్యాణ్ గీతికతో మాటలు కలుపుతాడు. సమయం చిక్కినప్పుడల్లా కళ్యాణ్ గీతికతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూస్తున్న తేజలో తనలో అప్పటి వరుకూ లేని అసూయ అనే భావం ప్రాణం పోసుకుంటుంది.

ఎందుకంటే కళ్యాణ్ అందగాడు, మాటకారి. తేజ ఏమో ఓ మాదిరిగా ఉంటాడు, మొహమాటస్తుడు. ఎక్కడ కళ్యాణ్ తనకన్నా ముందు గీతికను ప్రేమలో పడేస్తాడా, ఎక్కడ తాను తనకి కాకుండా పోతుందా అని భయం మొదలైపోయింది తేజకి. కానీ, అలా చూస్తూ ఉండటం తప్ప తాను ఏమీ చేయలేడు, ఏం చేయాలో తనకి తెలీదు. అప్పటి వరుకు తనని చూస్తే చాలు, తనతో మాట్లాడితే చాలు అనుకున్న మనసు ఒక్కసారిగా "తన నోటి మాటైనా, తన పెదవంచున పూసే చిరునవ్వైనా తనకే సొంతం కావాలి!" అని ఆలోచించటం మొదలుపెట్టింది.

అలా తనకి తెలీకుండానే తన మనసులో ఉన్న ‘ఆకర్షణ’ అనే భావం తన రూపం మార్చేసుకుని 'స్వార్ధంగా' మారిపోయింది. మరి ఇది ముందు ముందు ఇంకెలా రూపాంతరం చెందుతుందో, అసలు ఈ ఆలోచన సరైనదేనా కాదా? అనే సందేహం తన మనస్సుని తొలిచేస్తోంది. అలా సాయంత్రమవుతుంది.

ఈ ఆలోచనలు తేజని స్థిమితంగా ఉండనీయటం లేదు. ‘ఉష్ణం ఉష్ణం శీతలం’ అంటారు. వెళ్లి వేడిగా ఓ 'టీ' తాగితే గాని, వేడెక్కిన మెదడు చల్లారదు అని భావించి బయటకి వెళ్తాడు తేజ.

***

టీ కొట్టు;

బయటకొచ్చి చల్ల గాలి పీలుస్తూ, వేడి వేడి 'టీ' ని ఆస్వాదిస్తూ ఉంటాడు తేజ. ఇంతలో అదే టీ కొట్టుకి గీతిక, కళ్యాణ్ లు కూడా వస్తారు. తేజ ని చూసి కళ్యాణ్ "హాయ్" చెబుతాడు, గీతిక కూడా "హాయ్" చెబుతుంది. దాంతో తేజ కూడా అర నవ్వు నవ్వుతూ ఇద్దరికీ "హాయ్" చెబుతాడు. తన ముందే ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతుంటే తేజకి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా అక్కడ ఉండలేక సగం తాగిన టీ గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంటే, టీ మాస్టర్ పిలిచి డబ్బులు అడుగుతాడు.

అందుకు తేజ వెనక్కి వచ్చి "సారీ అన్న!" అని అంటూ డబ్బులిచ్చి అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ ఆఫీస్ కి చేరుకుంటాడు.

ఆ తరువాత కాసేపటికి ఇంటికి వెళ్లే సమయం కావటంతో దీనంగా ఇంటికి చేరుకుంటాడు.

***

అలా ఆ తరువాతి రోజు నుండి, కళ్యాణ్ వీలు దొరికినప్పుడల్లా గీతికతో మాట్లాడుతుంటాడు. గీతిక కూడా కళ్యాణ్ తో సన్నిహితంగా ఉంటుంది. కళ్యాణ్ విసిరే ఛలోక్తులకు గీతిక నవ్వుతుంటే, తనకి సొంతం కావాల్సిన ఆ నవ్వు మరెవ్వరికో సొంతం అవుతుందనే ఆ అసూయ అంతకంతకు పెరిగి తేజ మనసుని రగిలిస్తుంటుంది.

ఇంకా, సాయంత్రాలు కళ్యాణ్, గీతిక ఇద్దరూ కలిసి టీ తాగి రావటం, ఒకోసారి మధ్యాహ్నాలు కూడా ఇద్దరూ కలిసి భోజనం చేయటం, ఇవన్నీ చూస్తూ తేజ సహించలేకపోతున్నాడు. అలా రోజు రోజుకీ గీతిక కళ్యాణ్ కి దగ్గర అయిపోతుందేమో, తనకి దూరం అయిపోతుందేమో అనే భయం, బాధ రెండూ తేజ మనసుని వదలని పొగలా ఆవహించేస్తాయి.

ఒకోసారి సిస్టం ముందు కూర్చున్న తేజకి మానిటర్ మసకగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు తేజ చెమర్చిన తన కళ్ళని తుడుచుకుని మళ్ళీ తన పని చేసుకుంటూ ఉంటాడు. ఒక్కోసారి ఆ బాధ మరింత ఎక్కువై కన్ను దాటి వచ్చేలా ఉంటే, ఏదో ఫోన్ వచ్చినట్టు నటిస్తూ అక్కడి నుండి లేచి కారిడార్ లోకి వెళ్ళిపోతుంటాడు ఎవరికీ తెలియకూడదని. అలవాటైన పనిని సులువుగా చేసుకుంటూ పోతున్నాడు కానీ, అస్సలు అలవాటు లేని ఆ బాధను మోయలేకపోతున్నాడు.

వాస్తవానికి తేజ చాలా సరదా మనిషి. మనుషులు కాస్త అలవాటు కావాలే గాని, తనలా చిలిపి చేష్టలు చేసే కోతి మరొకడుండడు. కానీ ఎంత సరదా మనిషో, అంత సున్నిత మనస్కుడు. మనిషి వయసైతే పెరిగింది కానీ, కొన్ని విషయాల్లో ఇంకా తన మనసు చిన్నపిల్లాడిలానే మారం చేస్తుంటుంది, పేచీ పెడుతుంటుంది. కానీ ఆ పేచీ వెనుక నిష్కల్మషమైన ప్రేమ తప్ప మరేమీ ఉండదు!

రోజూలానే ఆ రోజు కూడా సాయంత్రం అయ్యే సరికి అంతర్మధనంతో, దీన వదనంతో ఇంటికి చేరుకుంటాడు తేజ.

***

ఆ రోజు రాత్రి;

ఎప్పటిలానే తన బాధను కాగితంతో పంచుకోవడానికి డైరీని తెరుస్తాడు తేజ.

"స్వార్ధమే ఇది, కానీ ఎవరి మీదా ద్వేషం కాదు! నిస్వార్థమైన ప్రేమ నాది కాకపోవచ్చు, కానీ నా ప్రేమే స్వార్ధం కాదు! ఒక్కసారి ఒక భావం మనసులో ప్రాణం పోసుకుంది అంటే... దానిని చంపడం చాలా కష్టం! నీ నవ్వన్నా, నవ్వే నువ్వన్నా నాకు చాలా ఇష్టం. శాశ్వతంగా నీ నవ్వులా మారిపోవాలని ఉంది, కానీ ఆ అదృష్టం నాకు ఉందో, లేదో నాకు తెలీదు. నీకు నేనొకడ్ని ఉన్నా సంగతి గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు, నేను మాత్రం నా గురించి ఆలోచించటం కూడా పూర్తిగా మర్చిపోయా! ఎందుకంటే నా ప్రతీ ఆలోచనలో నువ్వే ఉన్నావు... అంతలా నా ఆణువణువూ నిండిపోయావు నువ్వు! నాది కాదని తెలిసిన దాని మీద నా ఈ మనసుకి ఇంత మమకారం ఎందుకో? నువెవ్వరితోనో మాట్లాడితే ఇదెందుకు కలవర పడాలి, నువ్వు ఎవరితోనో సన్నిహితంగా ఉంటే నా కళ్లేందుకు తడవాలి? నువ్వెలా ఉన్నా సంతోషంగా ఉంటే చాలని ఊరుకోవచ్చుగా! ఎందుకంటే ఎంత కాదనుకున్నా బాధే కదా...!

“భావం ఉంది కానీ, చెప్పడానికి భాష సరిపోవటం లేదు…

ప్రేమ ఉంది కానీ, ప్రేమించబడే అదృష్టం లేదు…

అలాగే, బాధ కూడా ఉంది కానీ, పైకి తెలియటం లేదు!

ఏదో అందరి ముందు నవ్వుతున్నాను కానీ, ఆ నవ్వులో నిజం లేదు!

ఇంతిలా భయపడేవాడికి ప్రేమించే హక్కు లేదు!

అలల్ని, కాలాన్నే కాదు, కన్నీళ్ళని కూడా ఆపలేము!"

అంటూ రాయటం ముగించి, కళ్ళు తుడుచుకుంటాడు. ఎరుపెక్కిన కళ్ళతో మంచం ఎక్కుతాడు గాని, నిదుర కూడా జాలి చూపించదు.

***

4. బాధ్యత - నమ్మకం

ఆ మరుసటి రోజు;

ఎప్పటిలానే ఉదయం ఆఫీసు లిఫ్ట్ ఎక్కుతాడు తేజ. సరిగ్గా అదే సమయానికి "ఒక్క నిమిషం!" అంటూ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుండి లిఫ్ట్ లోపలకి వస్తుంది గీతిక. తేజకి నవ్వుతూ "థ్యాంక్ యూ!" చెబుతుంది. అందుకు తేజ చిన్నగా నవ్వుతాడు.

"మీరూ డెవలప్మెంట్ టీమా?" అని అడుగుతుంది తేజని.

"అబ్బే కాదండి, మార్కెటింగ్ టీమ్!" అని బదులిస్తాడు తేజ.

"ఓహ్ ఓకే! ఏంటో మీరూ ఉన్నట్టే తెలీదు ఆఫీసులో, వెరీ సైలెంట్ అనుకుంటా!" అంటుంది నవ్వుతూ.

"అంటే... నేను అందరితో పెద్దగా మాట్లాడను, అంతే!" అని అంటాడు మొహమాటంగా.

ఈ లోపు ఆఫీస్ ఫ్లోర్ రావటంతో ఇద్దరు ఎవరికీ వారు లోపలకి వెళ్లి వాళ్ళ డెస్క్ ల దగ్గర కూర్చుంటారు.

***

మధ్యాహ్నం;

కళ్యాణ్ తాను భోజనానికి డైనింగ్ రూమ్ కి వెళ్తూ గీతికను పిలుస్తాడు. అప్పుడు తాను కూడా తన లంచ్ బాక్స్ తీసుకుని కళ్యాణ్ తో పాటు డైనింగ్ రూమ్ కి వెళుతుంది. ఇదంతా తేజ గమనిస్తుంటాడు.

కొంచెం సమయం తరువాత తేజ 'వినయ్' అనే ఒకతనితో కలిసి లంచ్ చేస్తాడు. భోజనం అయిన తరువాత తేజ అలా కారిడార్ లోకి వస్తాడు. ఆ సమయానికి గీతిక మెట్ల మీద కూర్చుని ఏడుస్తూ కనిపిస్తుంది. తేజ రావటం చూసి వెంటనే కళ్ళు తుడుచుకుని తనని చూడనట్టు అలా కూర్చుంటుంది. ఉదయం చూసిన కలువ పూవు తాను కాదు. కలత చెందిన కలువ తన కళ్లెదుట కళ్లెర్రజేసుకుని కూర్చుంటే చూడలేకపోయాడు. అడుగుదాం అంటే అంతటి చనువు లేదాయే!

వెంటనే లోపలకి వెళ్లి అమ్మాయిలలో తనతో కొంచెం సన్నిహితంగా ఉండే 'నందన' దగ్గరకు వెళ్తాడు.

"తాను రోజూ కళ్యాణ్ తో కలిసి బయటకెళ్ళి టీ తాగటం, బోంచేయటం చేస్తుంది కదా... అది చూసి మన ఆఫీసులో 'లూస్ టంగ్ బ్యాచ్' తప్పుగా కామెంట్ చేస్తుంటే తాను వింది. అందుకే ఫీల్ అవుతుంది!" అని జరిగిందేంటో చెబుతుంది నందన.

నందన చెప్పిందంతా విన్నాక తేజ కోపంగా మళ్ళీ కారిడార్ లోకి వెళ్తాడు. అప్పటికీ తాను అలానే కూర్చొని ఉంటుంది.

నేరుగా తన దగ్గరకు వెళ్లి, "విలువలేని వాళ్ళ కోసం విలువైనవి వృధా చేయకూడదు! మన తప్పుంటే మౌనం వహించాలి గాని, మన గురించి ఒకరన్న మాటల్లో తప్పుంటే సహనం వహించకూడదు. ఒకో విషయంలో సహనంతో ఉండటం కన్నా, స్వాభిమానాన్ని కాపాడుకోవటం ముఖ్యం!" అని గంభీరంగా ఓ సలహాలా చెబుతాడు గీతిక కి.

తేజ అన్న మాటలు విన్న గీతిక కళ్ళు తుడుచుకుని వేగంగా లోపలకి వెళ్తుంది. తనని ఎవరు కామెంట్ చేస్తున్నప్పుడు విన్నదో వాళ్ళ దగ్గరకి వచ్చి నించుంటుంది గీతిక.

అందులో ఒకరివైపు చూస్తూ… "లాస్య గెటప్!" అని అంటుంది.

"వై, వాట్ హ్యాపెండ్?" అని అడుగుతుంది లాస్య ఏమీ అర్థం కానట్టు.

"ఫస్ట్ యూ గెటప్!" అంటూ గట్టిగా అరుస్తుంది గీతిక.

దాంతో లాస్య లేచి నుంచుంటుంది, మిగతా వాళ్ళందరూ తలలు తిప్పి వాళ్ళని చూస్తుంటారు. ఇంతలో పక్కన నుండి ఆఫీస్ బాయ్ పెరుగు కప్పు పట్టుకెళ్తుండటం చూస్తుంది గీతిక. అప్పుడు వెళ్లే అతన్ని ఆపి అతని చేతిలోని పెరుగు కప్పు తీసుకుంటుంది.

అది లాస్యకి చూపిస్తూ... "ఇది ఫ్రెష్షా కాదా?" అని అడుగుతుంది.

"ఫ్రెష్షే అనుకుంట...?" అని అంటుంది లాస్య అనుమానంగా, అయోమయంగా.

అప్పుడు గీతిక అదే పెరుగు కప్పు మూత తీసి, ఆ పక్కన ఉన్న ‘వినీత’ అనే మరో అమ్మాయికి ఇచ్చి "టేస్ట్ చెయ్యి" అంటుంది.

అందుకు వినీత "వాట్ డు యూ మీన్?" అంటుంది మొహం చిట్లిస్తూ.

"అరే! జస్ట్ టేస్ట్ ఇట్ యార్!" అంటూ మళ్ళీ గట్టిగా అరుస్తుంది గీతిక.

దాంతో ఆమె ఆ పెరుగుని కొంచెం వేలితో తీసి టేస్ట్ చేస్తుంది.

అప్పుడు గీతిక, "ఎలా ఉంది?" అని అడుగుతుంది.

"కొంచెం పుల్లగా ఉంది!" అని బదులిస్తుంది చిన్నగా.

అప్పుడు గీతిక లాస్య వైపు చూస్తూ... "ఫ్రెష్ అన్నావ్! అంటే... కళ్ళతో చూసి ఓ వస్తువునైనా, మనిషినైనా ఎలా ఉందో, ఎలా ఉన్నారో చెప్పచ్చు గాని, ఎలాంటి వాళ్ళో చెప్పలేము! నేను కరెక్ట్ అని నీతో వాదించడానికి ఇదంతా చెప్పట్లేదు, ఒకోసారి మనం అనే ఒక మాట మరొకరిని ఎంతలా బాధిస్తుందో నీకర్ధం కావాలని ఇలా చేసాను!" అని తన చేసిన పనికి గల కారణాన్ని వివరిస్తుంది.

"ఐ అమ్ సారీ!" అంటుంది లాస్య చిన్నస్వరంతో.

"సారీ అవసరం లేదు, ఇంకోసారి ఎవరి విషయంలోనూ ఇది రిపీట్ చేయకు చాలు!" అంటూ తన డెస్క్ ముందుకి వెళ్లి కూర్చొని మళ్ళీ తన పని తాను చేసుకుంటుంది.

అది చూసి, తాను అలా మాట్లాడినందుకు సంతోషించి, తనలో తాను నవ్వుకుంటూ వచ్చి తన డెస్క్ ముందు కూర్చుంటాడు తేజ.

అదే సమయానికి "థ్యాంక్ యూ!" అంటూ పెదాలు కదిలిస్తుంది గీతిక తేజ ని చూస్తూ. అందుకు తేజ బదులుగా చిన్నగా నవ్వుతాడు. కానీ లోలోపల మాత్రం తాను ప్రేమించే అమ్మాయికి చిన్నపాటి కష్టం వస్తే తన వంతు సాయం చేసి తన నవ్వుకి మళ్ళీ కారణం అయినందుకు విజయగర్వంతో మురిసిపోతాడు.

***

అదే రోజు రాత్రి; తేజ ఇల్లు;

ఎప్పటిలానే తన భావాలను పంచుకోవటానికి కుతూహలంగా డైరీని తెరుస్తాడు!

"మొదటిసరి మీరు బావున్నారు అని చెబితే తాను నవ్వినప్పుడు, ఆ నవ్వులో అమాయకత్వం ఉంది. కానీ ఈ రోజు నవ్విన నవ్వులో నిజముంది. తనపై తనకి పెరిగిన నమ్మకంతో పాటు, నాపై కలిగిన నమ్మకం, రెండూ సుస్పష్టంగా కనిపించాయి. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని పంచుకోవటానికి మొదటిసారి తెల్ల కాగితంతో పాటు మరో మనిషి ఇంకెవరైనా ఉంటే బావుణ్ణు అనిపిస్తుంది!"

అని రాసేడో లేదో తన పక్కనే ఉన్న తన మొబైల్ లైట్ వెలుగుతుంది. ఎవరో మెస్సేజ్ చేసారు. ఓపెన్ చేసి చూస్తాడు…

"హాయ్, నేను గీతికని, వాట్సాప్ గ్రూప్ లో మీ నెంబర్ చూసి మెస్సేజ్ చేస్తున్నాను. ఈ రోజు మీరు చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి, మీరిచ్చిన ధైర్యంతోనే అలా మాట్లాడగలిగేను. థ్యాంక్ యూ సో మచ్!" చెబుతుంది ఆ మెసేజ్ లో.

తాను ప్రేమించే అమ్మాయి తనంతట తానే మెస్సేజ్ చేసే సరికి తేజ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది!

***

5. బంధం

తరువాతి రోజు;

అంతకు ముందు రోజులానే యాదృచ్చికంగా గీతిక, తేజ ఇద్దరూ ఉదయం లిఫ్ట్ లో కలుస్తారు. ఎప్పటిలానే తేజ సైలెంట్ గా ఉంటాడు.

"ఏంటండీ, ఏదైనా జరిగితేనే స్పందిస్తారా... లేదా మాట్లాడరా?" అని అంటుంది గీతిక సరదాగా నవ్వుతూ.

"అదేం లేదండి!" అంటాడు చిన్నగా నవ్వుతూ.

"కానీ, చాలా థ్యాంక్స్ అండీ!"

"నిన్న మెస్సేజ్ లో చెప్పేరుగా..."

"నేరుగా చెప్పలేదుగా!"

ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు. ఇంతలో ఆఫీస్ ఫ్లోర్ రావటంతో ఎవరి దారిన వాళ్ళు వెళ్లి వాళ్ళ సీట్లలో కూర్చుంటారు.

అలవాటు ప్రకారం పని చేసుకుంటూ మధ్యలో గీతికను చూస్తూ ఉంటాడు తేజ. అలా ఒకసారి చూసినప్పుడు, గీతిక కూడా తేజని చూస్తుంది. దాంతో “దొరికిపోయానురా బాబు!” అని మనసులో అనుకుని మళ్ళీ తల దించుకుని తన పని తాను చూసుకుంటాడు. ఒక రెండు నిముషాలు ఆగి మళ్ళీ చూస్తాడు. ఈ సారి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అలా తన కళ్ళనే తదేకంగా చూస్తుంటాడు. ఇంతలో ఎవరో పిలవటంతో మళ్ళీ మేలుకొని తన పని చూసుకుంటాడు.

అలా మధ్యాహ్నం అవుతుంది. లాస్య, వినీత, వినయ్, గీతికా, తేజ కలిసి డైనింగ్ రూంలో భోంచేస్తుంటారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే, తేజ మాత్రం గీతిక కళ్ళనే చూస్తూ, తింటూ ఉంటాడు. అలా చూస్తున్నప్పుడు గీతిక తేజ వైపు చూస్తుంది, దాంతో “మళ్ళీ దొరికిపోయానురా బాబు!” అనుకుని చూపు తిప్పుకుని భోంచేస్తాడు.

సాయంత్ర సమయం;

తేజ వర్క్ చేసుకుంటూ ఉండగా మొబైల్ కి మెస్సేజ్ వస్తుంది. "టీ తాగి వద్దామా?" అని గీతిక మెస్సేజ్ చేస్తుంది. అది చూసి తేజ వెంటనే తలెత్తి గీతిక వైపు చూస్తాడు. అప్పటికే బదులు కోసం గీతిక తేజ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు తేజ నవ్వుతూ 'సరే!' అన్నట్టు తలూపుతాడు.

***

ఇద్దరు రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటారు;

ఒక అమ్మాయి పక్కన నడవటం తేజకి అదే మొదటిసారి. అందులోనూ తాను ప్రేమిస్తున్న అమ్మాయితో అలా కలిసి నడవటం తనకెంతో కొత్తగా అనిపించింది. ఆలా నడుచుకుంటూ వెళ్లి టీ తాగుతుంటారు. గీతిక ఏదోటి మాట్లాడుతూ ఉంటే, తేజ మళ్ళీ తదేకంగా తన కళ్ళనే చూస్తుంటాడు.

ఇంతలో గీతిక, "అవును మీ హాబీస్ ఏంటీ?" అని అడుగుతుంది.

అందుకు తేజ "కథలు, కవితలు..." అంటూ పూర్తిచేయబోతే, "చదువుతారా?" అని అడుగుతుంది. దానికి తేజ "రాస్తాను కూడా!" అని బదులిస్తాడు.

"ఓ రియల్లీ! ఏదీ ఓ కవిత చెప్పండి!" అడుగుతుంది కుతూహలలంగా.

"ఇప్పటికిప్పుడు అంటే... ఏం చెప్పాలి!" అని అంటాడు మొహమాటంగా.

"ఈ క్షణం, మీ మనసులో మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి!" అంటుంది చిన్నగా నవ్వుతూ.

తాను అలా అనడంతో తేజ మళ్ళీ తన కళ్ళల్లోకి చూస్తాడు. తనని, ముఖ్యంగా తన కళ్ళని అంత దగ్గరగా చూసిన తన్మయత్వంలో…

"నక్షత్రాల్లాంటి నీ కన్నుల్లో... ప్రపంచాన్నే నిక్షిప్తం చేసావు!

నన్ను కూడా దాచుకోవచ్చు కదా కొంచెం... కడ దాకా కాచుకుంటాను!

నిను తలచినా, నిను చూసినా... నను నేను మరచిపోతున్నా!

ఈ తనువు నాదైనా... నా మనసు నీదని తెలుసునా!

నా తపన చూసైనా, ఆ అడ్డుతెరను దించి, నీ చెలిమి పంచవా ఇకనైనా!"

అని తన మనసులోని మాటలు కవిత రూపంలో బయటకి చెప్పేస్తాడు.

అది విన్న గీతిక సిగ్గుతో ఓ చిరునవ్వు నవ్వి, మౌనంగా గ్లాస్ అక్కడ పెట్టేసి బయలుదేరుతుంది. తేజ కూడా గ్లాస్ అక్కడ పెట్టేసి తన వెనుక నడవటం మొదలుపెడతాడు. ఈ సారి టీ మాస్టర్ కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ, డబ్బులు అడగటం మర్చిపోతాడు. రెండు అడుగులు వేసాకా తనకే ఆ విషయం గుర్తొచ్చి, వెనక్కొచ్చి డబ్బులిచ్చి మళ్ళీ ముందుకి కదులుతాడు తేజ. ఇంతలో గీతిక అల్లంత దూరంలో నిలబడి ఉంటుంది, తేజ తన దరికి చేరాక, అప్పటివరకూ నిశ్చలంగా ఉన్న తన పాదాలు తేజ వేసే అడుగులతో జత కట్టి అడుగేయటం మొదలుపెడతాయి.

అప్పుడు అంతకు ముందు ఆగిన పాట మళ్ళీ మొదలవుతుంది!

(మీకిష్టమైన ట్యూన్ లో ఊహించుకోండి!)

"కళ్ళతో రాసే ఈ ప్రేమకావ్యానికి ఇద్దరి చూపులతో చుట్టేను శ్రీకారం

మనసున ఉదయించే మమకారానికి చెలిమే కదా ఓంకారం!

రెండు మనసులు కలిసి చేసే ఈ ప్రయాణానికి ప్రేమే గమనం,

ప్రేమే గమ్యం, ప్రేమే మొదలు, ప్రేమే తుదలు!

“నిజం నీడలో ఒదిగే ప్రేమ తాకేను అంబరం,

నిజాయితీ వెలుగులో ఎదిగే ప్రేమ చేరేను తారా తీరం,

ఆ రెండు ఉన్న మన ప్రేమ అమరం,

ఇక మనం జరుపుకోవాలి తలంబ్రాల సంబరం!"

||కళ్ళతో రాసే ఈ ప్రేమకావ్యానికి||

ఈ పాట నేపథ్యంలో వస్తున్నప్పుడు, వీళ్ళిద్దరూ కలిసి ఆఫీసుకి వెళ్లడం. పని చేసుకుంటూ మధ్య మధ్యలో ఒకరినొకరు చూసుకోవటం, ఆఫీసు అయిపోయాక ఒకరికొకరు "బై" చెప్పుకుని ఇళ్లకు చేరటం. ఇళ్లల్లో ఒకరినొకరు గుర్తుచేసుకుంటూ ఉండటం, అలా ఊహల లోకంలో విహరిస్తూ నిద్రలోకి జారుకోవటం జరుగుతాయి. (అక్కడితో మళ్ళీ పాట ఆగుతుంది!)

***

ఆ రోజు వీకెండ్;

ఆఫీస్ లేదు. ఏదో తెలియని బెంగ ఇద్దరికీ. ఇంట్లో ఉన్నా, ఏదైనా పని మీద అలా బయటకు వెళ్లినా వదలని నీడలా ఆ బెంగ ఇద్దరినీ వెంటాడుతుంది.

గీతిక లివింగ్ రూమ్ లో కూర్చుంటుంది, అమ్మ నాన్న టీవీలో వచ్చే కామెడీ క్లిప్స్ చూస్తూ నవ్వుతూ ఉంటారు. కానీ తను మాత్రం ఏదో ఆలోచిస్తూ అలా నిశ్చలంగా ఉంటుంది.

తేజ దాహం వేస్తుంది అని కిచెన్ లోకి వెళ్లి ఎక్వాగార్డ్ నుండి ఓ గ్లాస్ వాటర్ పట్టుకుంటాడు. అప్పుడు తనకి ఏదో పెద్ద గంగాళాన్ని మోస్తున్నట్టుగా భారంగా, ఎంతో బరువుగా అనిపిస్తుంది. నీళ్లు తాగుతుంటే ఏదో ఓ జలపాతం చాలా వేగంగా అమాంతం తన నోట్లో పడుతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే ఆ ఒత్తిడి తట్టుకోలేక సగం తాగి ఆ గ్లాస్ అక్కడ పెట్టేసి వరెండాలోకి వెళ్తాడు.

గీతిక కూడా తనింటి వరెండా లోకి వెళ్తుంది. అది మిట్ట మధ్యాహ్నం, ఎర్రటి సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడా అన్నటుంది ఎండ! కానీ, గీతికకు మాత్రం అది చిమ్మ చీకటిలా అనిపిస్తుంది.

ఆలా ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా వాళ్ళిద్దరికీ అంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. దాంతో ఇద్దరూ వారి వారి ఇళ్లల్లో, వారి వారి గదుల్లోకి వెళ్లి కూర్చుంటారు. గీతికకు తేజ గురించి, తేజకి గీతిక గురించే ఆలోచన. రోజూలానే చూడాలని, కలుసుకోవాలని, మాట్లాడాలని ఉంది ఇద్దరికీ. ఇద్దరూ ఫోన్ వైపు చూసారు.

కానీ, మెసేజ్ చేయడానికి సంకోచిస్తున్నారు. మొత్తం మీద మొబైల్ పట్టుకుని వాట్సాప్ ఓపెన్ చేసారు. ముందుగా గీతిక తేజ యొక్క ప్రొఫైల్ పిక్ ని చూస్తుంది. తన పిక్ ని చూసినప్పుడు అంతకు ముందురోజు తేజ చెప్పిన కవిత గుర్తొస్తుంది. ఆ కవిత గుర్తొచ్చి తనలో తాను నవ్వుకుంటుంది. తేజ కూడా గీతిక 'డీపీ' చూస్తుంటాడు. ఆఫీస్ మెట్ల మీద కూర్చొని దిగిన పిక్ అది. అందులో గీతిక ఎంతో అందంగా ఉంది, ఆ అందం అంతకన్నా స్వచ్ఛమైన తన నవ్వు వల్లే వచ్చింది అని తేజ తన మనసులో అనుకుంటూ నవ్వుకుంటాడు.

వెంటనే తనకి మెస్సేజ్ చేద్దాం అని చాట్ ఓపెన్ చేస్తాడు. అప్పటికే 'గీతిక టైపింగ్...' అని చూపిస్తుంది పైన. అది చూసి “హాయ్!” అని మెస్సేజ్ చేస్తాడు. గీతిక కూడా సర్రిగ్గా అదే సమయానికి “హాయ్!” అని మెస్సేజ్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా సాగుతుంది…

గీతిక: "ఏం చేస్తున్నావ్?"

తేజ: "ఏం లేదు, నా రూమ్ లో అలా కూర్చున్న. నువ్వు?"

గీతిక: "సేమ్..."

తేజ: "ఓహ్! ఓకే..."

గీతిక: "హే! నిన్న కవిత చాలా బావుంది!"

తేజ: "థ్యాంక్ యూ, అయినా అది నిన్న చెప్పచ్చు కదా..."

అని తేజ అన్న మాటకి గీతికకు ఏం చెప్పాలో అర్ధం కాదు. ఎందుకంటే తేజ అలా తన వంక చూస్తూ కవిత చెప్పేసరికి, గీతికకు నోటి వెంట మాట రాలేదు ఆ క్షణం. పైగా ఆ కవిత తనని ఉద్దేశించే చెప్పేడు అన్న విషయం తనకి సుస్పష్టంగా అర్ధం అయ్యింది. అందుకే సిగ్గుతో నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

గీతిక: "ఎప్పుడోకప్పుడు చెబుతున్నా కదా!" అని కొంటెగా సమాధానమిస్తుంది.

తేజ: "సరే!"

గీతిక: "ఇంకా..."

తేజ: "ఏముంటాయి మామూలే..."

గీతిక: "ఏంటి! చెప్పడానికి మాటలే లేవా?"

తేజ: "అలా అని కాదు..."

గీతిక: "ఎలా కాదు... సరే! నిన్నటిలాగా, ఇప్పుడు... ఈ క్షణం మనసులో ఏమనిపిస్తుందో కవితలా చెప్పు!"

తేజ: "నాకు కొంచెం టైం పడుతుంది మరి..."

గీతిక: "పర్లేదు నేను వెయిట్ చేస్తాను!"

తేజ: "సరే!" అని చెప్పి ఆలోచించటం మొదలుపెడతాడు.

గీతిక కూడా ఫోన్ ని వదలకుండా అలాగే పట్టుకుని తన మెస్సేజ్ కోసం ఎదురుచూస్తుంటుంది. ఆ క్షణం ఇద్దరి మనస్సుల్లోనూ ఉన్న భావన ఒక్కటే...

'ఒకరినొకరు చూసుకోవాలి అని'. అంతే కాదు, ఇద్దరినీ ఏదో తెలియని బెంగ వెంటాడుతుంది, మనసంతా భారంగా, దిగులుగా ఉంది.

అప్పుడు తేజ ఒక రెండు నిముషాలు ఆలోచించి ఓ వాయిస్ క్లిప్ పంపిస్తాడు రికార్డు చేసి. గీతిక ఆ వాయిస్ క్లిప్ ని ప్లే చేస్తుంది…

"ఏదో తెలియని బెంగ... స్థిరంగా ఉన్న నన్ను స్థిమితంగా ఉండనీయకుండా బలంగా వెంటాడుతోంది! అది ఎలా ఉందంటే…

ఎంతమందిలో ఉన్నా ఎడారిలా,

గుక్కెడు నీళ్లు కూడా పోటెత్తిన సంద్రంలా,

పగటి ఎండ కూడా నడిరాతిరి నిశీధిలా,

సొంత నీడ కూడా మరో వింత జీవిలా,

నిశ్శబ్దం కూడా ఓ క్షతగాత్రున్ని ఆర్తనాదంలా అనిపిస్తుంది!"

అని చెబుతాడు తేజ ఆ క్లిప్ లో.

అది విన్న గీతిక ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తనకి కూడా ఇందాక వరుకూ అలానే అనిపించింది. ఆ క్లిప్ లో తేజ చెప్పిన ప్రతీది తనకు ఎదురైంది. తన మాటలు విన్న తనకి నోటి వెంట మాట రాలేదు.

"అంటే ఇద్దరికీ ఒకే అనుభవం ఎదురైందా!?" అని మనసులో అనుకుంది, ఆ తరువాత తనలో తను నవ్వుకుంది. అందుకు తిరిగి ఏమని బదులివ్వాలో తెలీక "థ్యాంక్ యూ!" అని రిప్లై పెడుతుంది.

తేజ గొంతు విన్న తరువాత గీతిక కు తనని నేరుగా చూడాలని అనిపించింది. కానీ, తనని అలా ఎలా అడగాలో తెలీక "ఓకే తేజ... బై!" అని రిప్లై ఇస్తుంది. అందుకు తేజ కూడా "బై!" అని రిప్లై పెడతాడు.

ఇద్దరూ ఫోన్ పక్కన పెడతారు గాని, వారి ఆలోచనలను మాత్రం పక్కన పెట్టలేకపోతారు. చాట్ చేయక ముందు వరుకు ఉన్న ఆ బెంగ, దిగులు, చాట్ చేసేక ఇంకా ఎక్కువ అయిపోతాయి ఇద్దరికీ. ఒకరినొకరు చూసుకోవాలి, కలుసుకోవాలి అనే కోరిక ఇంకా బలపడుతుంది. దాంతో తేజ ఉండబట్టలేక, ఇంట్లో ఉంటే మరీ గందరగోళంగా ఉందని బయటకు వెళ్తాడు.

***

అలా మొత్తం మీద తన ఆఫీస్ దగ్గర ఉండే 'టీ షాప్' దగ్గరకు చేరుకుంటాడు తేజ.

అంతకు ముందు రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ తన కళ్ళ ముందు మెదులుతుంది అలా… అప్పుడు తేజ టీ మాస్టర్ కి రెండు టీ ఆర్డర్ చెబుతాడు. "రెండు ఎందుకా...?" అని అర్ధం కానట్టు చూసినా, తను అడిగాడు కదా అని రెండు గ్లాసుల్లో టీ పోసి ఇస్తాడు టీ మాస్టర్. తేజ ఒకటి చేత్తో పట్టుకుని, మరొకటి తన ఎదురుగా ఉన్న ఓ స్టూల్ మీద పెడతాడు. తను కూడా దాని ఎదురుకుండా ఉన్న మరో స్టూల్ పై కూర్చుని ఆ రెండో టీ గ్లాస్ ని చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ టీ తాగుతూ ఉంటాడు. అదంతా టీ మాస్టర్ విచిత్రంగా గమనిస్తుంటాడు.

"నిజంగా గీతిక కూడా ఇక్కడికి వస్తే ఎంత బావుంటుంది!" అని తన మనసులో అనుకుంటాడు తేజ. సరిగ్గా అదే సమయానికి అల్లంత దూరం నుండి గీతిక నడుచుకుంటూ వస్తుంటుంది. అది చూసి తేజ ఆశ్చర్యపోతాడు. గీతిక కూడా తేజని చూసి ఆశ్చర్యపోతుంది.

తేజ దగ్గరకు వచ్చి... "నువ్వెంటి ఇక్కడ!" అని అడుగుతుంది కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం ఆనందంగా.

"ఎందుకో ఇక్కడికి రావాలనిపించింది, అందుకే వచ్చాను. మరీ...నువ్వు?" అని అడుగుతాడు కుతూహలంగా.

"నాకు కూడా అలానే అనిపించింది!" చెబుతుంది చిన్నగా నవ్వుతూ.

ఆ క్షణం ఒకరి కళ్ళల్లోకి ఒకరు తన్మయత్వంలో అలా చూసుకుంటారు. అంతటా నిశ్శబ్దం! ఇద్దరి గుండెచప్పుళ్లు ఇరువురికీ స్పష్టంగా వినిపిస్తున్నాయి.

అప్పుడు మళ్ళీ ఇందాక ఆగిన పాట కొనసాగుతుందిలా…

"ఆవిరై దూరమైన నీరు తిరిగి నదిని చేరదా…

వెనకకు పాకే అల తిరిగి తీరాన్ని తాకదా...!

తొలకరి కోసం నది, అలల తాకిడి కోసం తీరం ఒడి,

పరితపించేది ప్రేమకోసమే కదా!

అనురాగంతో నిండిన మన ఎద పలికేను ఈ ప్రేమకథ…

కల్మషం ఎరుగని మన కథ స్వచ్ఛతకు చిహ్నమై నిలుస్తుంది సదా!

నిజం నీడలో ఒదిగే ప్రేమ తాకేను అంబరం,

నిజాయితీ వెలుగులో ఎదిగే ప్రేమ చేరేను తారా తీరం,

ఆ రెండూ ఉన్న మన ప్రేమ అమరం!

ఇక మనం జరుపుకోవాలి తలంబ్రాల సంబరం!

“కళ్ళతో రాసే ఈ ప్రేమకావ్యానికి ఇద్దరి చూపులతో చుట్టేను శ్రీకారం,

మనసున ఉదయించే మమకారానికి చెలిమే కదా ఓంకారం!

రెండు మనసులు కలిసి చేసే ఈ ప్రయాణానికి ప్రేమే గమనం,

ప్రేమే గమ్యం, ప్రేమే మొదలు, ప్రేమే తుదలు!"

(అంటూ అక్కడితో మళ్ళీ ఆగుతుంది!)

ఈ పాట నేపథ్యంలో వస్తున్నప్పుడు, తేజ గీతికకు టీ గ్లాస్ ఇవ్వటం, ఇద్దరూ కలిసి టీ తాగి అక్కడి నుండి బయలుదేరటం, అలా కలిసి కొంత దూరం నడిచి తరువాత అతికష్టం మీద ఒకరికొకరు 'బై' చెప్పుకుని ఇళ్లకు చేరటం. ఆ తరువాత రోజు నుండి రోజూ తేజ ఉదయం గీతిక వచ్చే వరుకూ ఆఫీస్ లిఫ్ట్ వద్ద తచ్చాడుతూ ఉండి, తను వచ్చేక ఇద్దరూ కలిసి లిఫ్ట్ లో వెళ్ళటం, కలిసి భోజనం చేయటం, సాయంత్రాలు ఎవరికి ఆలస్యం అయినా ఇంకొకరు వేచి ఉండి ఇద్దరు కలిసి ఆఫిస్ బయటకు రావటం, తేజ దగ్గరుండి గీతిక ఇంటికి వెళ్లే సిటీ బస్సు ఎక్కించడం వంటివి జరుగుతుంటాయి. అలా వీరిద్దరూ రోజు రోజుకీ దగ్గరవుతుంటారు.

***

ఒకరోజు ఆఫీసులో;

వినయ్, తేజ కారిడార్ లో ఉంటారు.

"రేపు వీకెండ్ కదా! ప్లాన్స్ ఏంటి?" అని అడుగుతాడు తేజ వినయ్ ని.

"ఏముంది... నా గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ కి పోతున్న!" అంటాడు వినయ్.

"ఓహ్! ఓకే!"

"ఔన్రా తేజ నీకుందా గర్ల్ ఫ్రెండ్?" అని వినయ్ అడిగినప్పుడు...

తేజ చిన్నగా నవ్వుతాడు.

"అబ్బా! సిగ్గా! ఎవర్రా అమ్మాయి?"

"ఎవరో ఉన్నారులే...!"

"అచ్చా! టూ సైడా రా?" అడుగుతాడు వినయ్ ఆత్రంగా.

"ఇంకా ఆ అమ్మాయికి చెప్పలేదు!"

"చెప్పేయ్ మరి! ముహూర్తం చూడాలా!"

"అలా అని కాదు, చెబితే ఏమంటుందా అని భయం!"

"ఏముంటది… నచ్చితే లవ్ యూ టూ అంటది, లేదా ‘వుయ్ అర్ జస్ట్ ఫ్రెండ్స్’ అంటది. ఏమంటదో తెలియాలంటే ముందు చెప్పాలి కదరా. భయపడుతూ కూర్చుంటే పనులు అవుతాయారా?" అంటూ ఉచిత సలహా ఇస్తాడు వినయ్.

"సరే! చెబుతాను"

"సరే ఇంతకీ ఆ అమ్మాయి ఎవర్రా?" మళ్ళీ అడుగుతాడు వినయ్.

ఇక వదిలేలా లేడు అనుకుని, "ఎవరికీ చెప్పకూడదు మరి!" అంటాడు తేజ.

"కొంపతీసి మన ఆఫీసా?" అని కొంచెం పెద్దగా అంటాడు.

"గట్టిగా అరవకురా..." బ్రతిమిలాడుతున్నట్టు అంటాడు తేజ.

"హ్మ్... అర్థమయ్యింది! గీతక నా?" అడుగుతాడు తెలిసిపోయినట్టు.

"అంత కరెక్టుగా ఎలా చెప్పావు?!" అంటాడు తేజ కొంచెం ఆశ్చర్యంగా.

"నువ్వు అమ్మాయిల్లో మాట్లాడేది ఇద్దరితో. ఒకరు నందన, ఇంకొకరు గీతిక. నందనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, రేపో మాపో పెళ్లి చేసుకుంటదని అందరికీ తెలుసు, ఇక మిగిలింది గీతికే కదా!" అంటూ వివరణ ఇస్తాడు వినయ్.

వినయ్ మాటలు విన్న తేజ అవును అన్నట్టు చిన్నగా నవ్వుతాడు.

***

మధ్యాహ్న సమయం;

గీతిక & బ్యాచ్ డైనింగ్ రూంలో భోజనం చేస్తూ ఉంటారు;

"గీతిక... నిన్ను ఒకటి అడుగుతాను, కోప్పడవుగా?" అంటుంది లాస్య సందేహంగా.

"నేనెందుకు కోప్పడతాను, అడుగు!" అంటుంది గీతిక నవ్వుతూ.

"ఏమో, మళ్ళీ పెరుగు చూడు, పెరుగు రుచి చూడు అని క్లాస్ పీకుతావేమో అని భయం!" అంటుంది కాస్త వెటకారంగా.

లాస్య అన్న మాటలకు గీతిక గట్టిగా నవ్వి, "అప్పుడంటే మీరన్న మాటల్లో నిజం లేదు. అందుకే కోపం!" అని అంటుంది నవ్వు ఆపుకుంటూ.

"అంటే ఈ ఆత్రం అనే జబ్బుతో చావలేక అడుగుతున్నా... నువ్వూ... తేజా..." అంటూ సాగదీస్తుంది భయంభయంగా.

దానికి గీతిక చిన్నగా నవ్వుతుంది.

"తిట్టకుండా నవ్వేవు అంటే... హా ఆ...! నిజమే అన్నమాట!" అని అంటుంది లాస్య గీతికను కవ్విస్తున్నట్టుగా నవ్వుతూ.

***

ఆ రోజు సాయంత్రం;

ఆఫీసు అయిన తరువాత లిఫ్ట్ లో తేజ, గీతిక ఉంటారు. ముందు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు. తాను ప్రేమిస్తున్న విషయం గీతిక కు ఎలా చెప్పాలా అని తేజ గీతికనే అలా చూస్తూ ఉంటాడు.

అప్పుడు గీతిక తేజని చూసి "ఏంటి నన్నే చూస్తున్నావు?" అని అడుగుతుంది పెదాలపై వచ్చే చిరునవ్వుని ఆపుకుంటూ, చిరుకోపాన్ని నటిస్తూ!

"ఇంకిక్కడ ఎవరూ లేరుగా..." అంటాడు తేజ నవ్వుతూ.

ఆ మాటకు ఇంక నవ్వు ఆపుకోలేక గల గలా నవ్వేస్తుంది తను.

ఆమె నవ్వు చూసి ధైర్యం తెచ్చుకుని... "గీతికా...నీతో... ఒక విషయం చెప్పాలి!" అని అంటాడు తేజ నెమ్మదిగా భయపడుతూ.

"చెప్పు..." అంటుంది చిన్నగా నవ్వుతూ.

"అదీ... ఎలా చెప్పాలా అని..." అంటాడు చెప్పడానికి సంకోచిస్తూ.

"ఎలాగైనా చెప్పు వింటా..." అని అంటుంది.

ఈ లోపు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేస్తుంది. అప్పుడు తేజ లిఫ్ట్ డోర్ తెరవబోతే వెంటనే గీతిక డోర్ మూసేసి ఐదవ ఫ్లోర్ బటన్ నొక్కుతుంది. అప్పుడు మళ్ళీ లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది.

"తేజ... చెప్పు..." అని అంటుంది కొంచెం విసురుగా.

"ఏంటి భయపెడతావ్? చెబుతా ఆగు..." అంటాడు అమాయకంగా.

"మరి చెప్పు...."

"అదీ..." అని అంటూ సాగదీసేలోపు మళ్ళీ ఐదవ ఫ్లోర్ వచ్చేస్తుంది. అప్పుడు తేజ డోర్ కొంచెం తీసి, మళ్ళీ మూసి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కుతాడు. దాంతో లిఫ్ట్ మళ్ళీ కిందకి వెళ్తుంటుంది. ఇదంతా బయటనుండి వినయ్, లాస్య & బ్యాచ్ చూస్తూ “వీళ్లేంటి లిఫ్ట్ తో ఆడుకుంటున్నారు!” అని అనుకుంటారు.

"కవితలైతే బా చెబుతావ్... ఇప్పుడు మాట్లాడటానికేంటి?" అంటుంది గీతిక కొంచెం కోపంగా.

"అబ్బా ముందు బయటకి వెళదాం గీతిక.... అప్పుడు చెబుతాను!" అంటాడు బతిమాలుతున్నట్టుగా.

మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. మళ్ళీ గీతిక లిఫ్ట్ డోర్ తీసి, మూసి ఐదవ ఫ్లోర్ బటన్ నొక్కి, "చెబితేనే బయటకి..." అంటుంది మొండిగా. లిఫ్ట్ పైకి వెళ్తుంటుంది.

అప్పుడింక తప్పేలా లేదనుకుంటూ, "గీతిక నిను చూడాలనిపిస్తుంటుంది... ఇప్పుడు కాదు, ఎప్పుడూ! మాట్లాడాలని అనిపిస్తుంటుంది, ఒక్కరోజు నువ్వు కనపడకపోయినా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది!"

(ఐదవ ఫ్లోర్ వస్తుంది. లిఫ్ట్ డోర్ తీసి, మూసి, గ్రౌండ్ ఫ్లోర్ బటన్ ని నొక్కుతూ చెప్పడాన్ని కొనసాగిస్తాడు…)

"అంతెందుకు నీతో ఇలా లిఫ్ట్ లో గడిపే 30 సెకన్ల సమయం కోసం నేను రోజూ ఎదురు చూస్తాను... సాధారణంగా నాకు అమ్మాయిలతో మాట్లాడటం భయం! కానీ, నీతో ఫ్రీగా ఉండగలను, ఏదైనా నిర్భయంగా చెప్పగలను! కానీ, ఈ రోజెందుకు ఇంత భయపడుతున్నానో నాకు తెలీదు!" అని తాను చెప్పాలనుకున్నది చెబుతాడు.

"నాకు తెలుసు!" అని అంటుంది బుగ్గలను దాటి వస్తున్నా సిగ్గుని కప్పిపుచ్చుకుంటూ.

"ఏం తెలుసు?" అని అడుగుతాడు ఆశగా.

ఇంతలో గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. గీతిక సమాధానం చెప్పకుండా డోర్ తీసి పరుగులాంటి నడకతో వెళ్లిపోతుంటుంది.

"ఓయ్ గీతిక! ఏం తెలుసో చెప్పి వెళ్ళు" అని అడుగుతాడు.

తేజ అన్న మాటకు తను ఆగి వెనక్కి తిరిగి, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని" అని వెంటనే మళ్ళీ వెళ్లిపోతుంటుంది.

"బానే తెలుసుకున్నావ్, మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో కూడా చెప్పేయచ్చుగా..." అని అరుస్తాడు గట్టిగా నిల్చున్న చోటు నుండే.

"అది నువ్వు తెలుసుకో" అని తను కూడా గట్టిగా అరుస్తూ సమాధానమిచ్చి నవ్వుతూ దూరంగా వెళ్లిపోతుంటుంది.

అప్పుడు తేజ "తెలిసింది!" అని మనసులో అనుకుంటాడు నవ్వుతూ.

అప్పుడు వెంటనే మళ్ళీ పాట మొదలవుతుందిలా…

f: "నువ్వెవరనేది అద్దానికి చెప్పాలా...

నీ జత కలసిన గుండెకు నీ ఎదసడి వినపడదా!

భాషంటూ లేని ప్రేమ కంటి బాసలతో మాట్లాడుతుంది.

నీ మనసు చాటున మాటేదైనా నా మనసు దాకా చేరుకుంటుంది!"

ఈ సాహిత్యం నేపథ్యంలో వస్తున్నప్పుడు గీతిక వెనక్కి తిరిగి తేజ ని చూసి నవ్వుతుంది. తేజ తనని అలా చూస్తూ అక్కడ అలా నిలబడిపోతాడు. అప్పుడు ఈ కింది సాహిత్యం మొదలవుతుంది…

m: "ప్రాణం పోసుకొచ్చిన ఓ మైనపు బొమ్మ...

నా ప్రాణం నీ నవ్వేనమ్మా! నను మారిపోనీ నీ నవ్వులా!

నీ కంటిరెప్పలు నీడలో హాయిగా...

సదా నీ ఊహల పల్లకిని మోస్తూ, నీ ప్రతి కలనీ నిజం చేస్తూ,

నీతో కలిసి కడదాకా బ్రతకాలనే నా ఆశను మన్నించి...

నీ ప్రేమను అందించవా ప్రియతమా… నా మనసుకున్న రూపమా!

“కళ్ళతో రాసే ఈ ప్రేమకావ్యానికి ఇద్దరి చూపులతో చుట్టేను శ్రీకారం,

మనసున ఉదయించే మమకారానికి చెలిమే కదా ఓంకారం!

రెండు మనసులు కలిసి చేసే ఈ ప్రయాణానికి ప్రేమే గమనం,

ప్రేమే గమ్యం, ప్రేమే మొదలు, ప్రేమే తుదలు!"

అనే ఈ సాహిత్యం నేపథ్యంలో వస్తున్నప్పుడు గీతిక ఆఫీసులో అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు తేజ తనని, తన కళ్ళని చూస్తూ ఉంటాడు రోజూ.

అలా వీరిద్దరి మధ్య ఉన్న బంధం రోజురోజుకీ బలపడుతూ బలపడుతుంది.

(ఇక్కడితో పాట పూర్తవుతుంది!)

***

6. పరీక్ష - సంకల్పం

గీతిక ఇంట్లో; ఒకానొక రోజు ఉదయం;

హాల్ లో గీతిక, గీతిక వాళ్ళ నాన్న 'నరసింహా' ఒక సోఫాలో కూర్చుని ఉంటారు. వాళ్లెదురుగా ఉన్న మరో సోఫాలో తేజ కూర్చుని ఉంటాడు.

"చదువుకున్నోడివి, తెలివైనవాడివి, గుణవంతుడివి. నీకు మా అమ్మాయిని ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు బాబు. కానీ, నీకు ప్రస్తుతం వచ్చే జీతం నువ్వొక్కడివి బ్రతకడానికి మాత్రం సరిపోతుంది. నా కూతురి కోసం నేను మిగతాది సర్దుబాటు చేస్తాననుకో... కానీ, నా అల్లుడు గర్వాంగా బ్రతకాలి కదా!" అని తన ఉద్దేశాన్ని సున్నితంగా వివరిస్తాడు నరసింహా.

"ముందుగా అల్లుడు అని పిలిచారు, చాలా సంతోషం. కానీ, మీరంతలా చెప్పాలా! కాళ్ళు కడిగారు కదా అని నెత్తినెక్కి కూర్చుంటే ఏం బావుంటుంది మావయ్య గారు... ఎవరి కాలు మీద వాళ్ళు నిలబడాలి! ఎవరి ద్వారానో మా విషయం తెలిస్తే మీకు గౌరవం ఉండదని ఇప్పుడు వచ్చాను. మీ అమ్మాయిని కూడా పోషించే శక్తి వచ్చినప్పుడు, మళ్ళీ వస్తాను. ఉంటాను అండి!" అంటూ ఓ పద్దతిగా సమాధానమిస్తాడు తేజ.

"అంటే... అప్పటివరకూ మా అమ్మాయిని కలవరు కదా అల్లుడు?"

"కలవను మావయ్య!" అంటూ నరసింహా యొక్క అంతర్గతాన్ని అర్థం చేసుకున్నట్టుగా నవ్వుతూ నమస్కరించి అక్కడి నుండి బయలుదేరతాడు.

"తనని పంపించేసి వస్తా నాన్న" అంటూ గీతిక తేజ వెనుక ఇంటి బయటకి వెళ్తుంది.

***

"మనం అనుకున్న మూడు పనుల్లో ఒక పని పూర్తయ్యింది... మీ నాన్నగారితో మాట్లాడటం!" అని అంటాడు తేజ నవ్వుతూ.

"అవును ఇంకా రెండున్నాయి. నీకు ఇంతకన్నా మంచి ఉద్యోగం రావటం, ఆ వెంటనే మనం పెళ్లి చేసుకోవడం!" అని అంటుంది గీతిక కూడా నవ్వుతూ.

"అవి కూడా త్వరలోనే జరుగుతాయి!" అంటాడు తేజ విశ్వాసంగా.

"నువ్వు మంచి ఉద్యోగం కోసం చూస్తూనే వేరే ఏదైనా పార్ట్ టైం జాబ్ చెయ్యి. ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం మొహమాట పడకుండా నన్ను అడుగు సరేనా! కొద్ది రోజులు నాతో కూడా ఎక్కువ సేపు ఆన్లైన్ లో సోది పెట్టకు, ఏదైనా ముఖ్యమైన విషయం అయితే తప్ప!" అంటూ ఎదో ఒక చిన్న పిల్లోడికి జాగ్రత్తలు చెబుతున్నట్టు చెబుతుంది గీతిక.

"సరే!" అంటాడు తేజ గర్వాంగా నవ్వుతూ.

"కానీ, నిన్ను చాలా మిస్ అవుతాను!" అంటుంది గీతిక దిగాలుగా ముఖం పెట్టి.

"నాకు కూడా... నీకు దూరంగా ఉండాలి అంటే కష్టాంగానే ఉంటుంది. కానీ, ఇప్పుడు మనం పడే ఈ కష్టమే రేపటి రోజున ఓ తీపి జ్ఞాపకంలా మారుతుంది. కాబట్టి ఇది బరువైనా మోద్దాం!" అని గీతిక చెంపని ప్రేమగా నిమురుతూ చెబుతాడు తేజ.

అప్పుడు గీతిక ఒకసారి వెనక్కి తిరిగి ఎవరూ లేరని నిర్ధారించుకుని తేజకి ఇంకొంచెం దగ్గరగా వచ్చి నుదిటి మీద ముద్దు పెడుతుంది.

అందుకు తేజ చిన్నగా నవ్వి "వెళ్ళొస్తాను!" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

***

ప్రస్తుతం;

జీప్ లో...

"అలా ఆ క్షణం తన నుండి దూరంగా వెళ్ళిపోయిన నేను ఈ రోజు ఉద్యోగం వచ్చిన వెంటనే ఎంతో సంతోషంగా తన దగ్గరికే బయలుదేరాను. కానీ, ఇలా అయ్యింది!" అని జరిగిందంతా ఇన్స్పెక్టర్ కి చెబుతాడు తేజ.

జరిగిందంతా విన్న ఇన్స్పెక్టర్ "అప్పుడు అంత నమ్మకంగా మాట్లాడిన గీతిక తండ్రి తనకి వేరే పెళ్లి చేయాలనీ ఎందుకు చూసాడు. అసలు నీ మీద ఎందుకు కంప్లైంట్ చేసాడు?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఇన్స్పెక్టర్.

"అదే సర్ నాకూ అర్ధం కావట్లేదు!" అంటాడు తేజ అయోమయంగా.

స్క్రబ్ ఫారెస్ట్స్; మస్త్య గిరి:

జరిగిందంతా విన్న హర్షిత కూడా ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్ననే గీతికను అడుగుతుంది.

"ఆ రోజు మా నాన్న నా ముందు అలా అన్నారు. నిజానికి ఆయన మనసులో మా ఇద్దరికీ పెళ్లి చేయాలనే ఆలోచన లేదు!" అని మళ్ళీ గతంలో జరిగింది చెప్పడం మొదలుపెడుతుంది గీతిక.

***

గీతిక ఇల్లు; ఒక రోజు ఉదయం;

గీతిక హాల్ లో కూర్చొని లాప్ టాప్ మూడు పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి పక్కన కూర్చుంటాడు.

"తేజ మనం అనుకున్నట్టు మంచోడు కాదమ్మా... వాడికి ఉద్యోగం చేసే ఆలోచనే లేదు. ఎవరైనా డబ్బున్న అమ్మాయికి ఎర వేసి సెటిల్ అవుదాం అనుకునే రకం అమ్మ

వాడు! మన దగ్గర అది కుదరకపోయేసరికి ఇంకో డబ్బున్న అమ్మాయిని పట్టాడు చూడు!" అంటూ ఓ ఫోటో గీతిక చేతికి ఇస్తాడు వాళ్ళ నాన్న. అందులో తేజ ఓ రెస్టారెంట్ లో ఇంకో అమ్మాయికి కేక్ తినిపిస్తున్నట్టుగా ఉంటుంది.

గీతిక వ్యాఖ్యానం: "నాన్న కదా నమ్మాను! చాలా బాధ పడ్డాను! ఒకరోజు తేజ ని అదే అమ్మాయితో ఓ గుడిలో చూసాను. దూరం నుండి వాళ్ళని కాసేపు గమనించాను. అప్పుడు అర్థం అయ్యింది వాళ్ళది అన్నా-చెల్లెళ్ళ బంధం అని. తన పేరు ‘సిరి’ అని కూడా అప్పుడే తెలిసింది.

“వెంటనే ఇంటికి వచ్చి ఫేస్ బుక్ ఓపెన్ చేసి తన ప్రొఫైల్ వెతికి పట్టుకుని చూసాను. తన ఫ్యామిలీ ఫోటోలు, పోస్ట్ లు అన్నీ క్లియర్ గా ఫాలో అయితే నాకు విషయాలన్నీ అర్థం అయ్యాయి.

“సిరి వాళ్ళ సొంత అన్నయ్య ఇండియన్ ఆర్మీ సోల్జర్! తను ఓ యుద్ధంలో చనిపోయాడు. తేజ మా పాత కంపెనీలో ఉద్యోగం మానేసాక వేరొక కంపెనీలో పార్ట్ టైం ఎంప్లోయ్ గా చేరాడు. అక్కడే సిరి పరిచయం అయ్యింది! సిరి డల్ గా ఉండటం గమనించిన తేజ విషయం తెలుసుకుని ఓ అన్నలా తనకి దగ్గరయ్యాడు! అలా సిరి మళ్ళీ మామూలు మనిషయ్యింది. ఇవ్వన్నీ సిరి, తేజ కలిసి దిగిన రకరకాల ఫోటోలను పోస్ట్ చేసి తను ఫేస్ బుక్ లో షేర్ చేసిన విషయాలు.

“అలా అవ్వన్నీ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడే మా నాన్న నాకు ఏదైతే ఫోటో చూపించారో ఆ ఫోటో తన టైం లైన్ లో కనిపించింది. అది తేజ తన లైఫ్ లోకి వచ్చిన తరువాత జరుపుకున్న సిరి బర్త్ డే. ఆ పిక్ ని అప్లోడ్ చేసి మా అన్నయ్య మళ్ళీ ఈ రూపంలో తిరిగొచ్చాడని పోస్ట్ చేసింది!

“అది చూసిన వెంటనే ఇలాంటి రిలేషన్ నా నేను తప్పు బట్టాను అని నా మీద నాకు, ఆ ఫోటో ని అడ్డుపెట్టుకుని మమ్మల్ని విడదీయడానికి అలాంటి ఓ అసహ్యమైన కట్టు కథ అల్లి అన్న-చెల్లెళ్ళ సంబంధాన్ని అపహాస్యం చేసిన మా నాన్న మీద అసహ్యం వేసింది! వెంటనే వెళ్లి మా నాన్నకి అది చూపించి నిలదీసాను. దాంతో నాకు మా నాన్న బలవంతంగా వేరే పెళ్లి చేయాలని చూసారు!"

(అలా గీతిక మాటలు నేపథ్యంలో వస్తున్నప్పుడు గీతిక తేజ, సిరి లను గుళ్లో గమనించడం, సిరి ఫేస్ బుక్ చూస్తూ విషయాలను తెలుసుకోవడం, వాళ్ళ నాన్నని నిలదీయటం వంటివి జరుగుతాయి.)

ఒకరోజు నరసింహా గీతికతో: "ఇలా చూడు... నేను మరీ సాడిస్ట్ లా నిన్ను బంధించటం, మొబైల్ లాక్కోవటం లాంటివి నేను చేయను. కానీ తేడా వస్తే నిన్ను ఏం చేయను, వాడిని లోపల వేయిస్తా, కాబట్టి జాగ్రత్తగా ఉండు!" అంటూ హెచ్చరిస్తాడు గీతికని.

***

ప్రస్తుతం: స్క్రబ్ ఫారెస్ట్స్; మస్త్యగిరి;

"అని మా నాన్న నాకు వార్నింగ్ ఇచ్చారు! కానీ, ఏది ఏమైనా తేజ ని కలవాలి, ఈ విషయం చెప్పాలి అని చూస్తున్న సమయంలో నాకు ఇంకో విషయం తెలిసింది!" అంటూ గీతిక జరిగింది చెప్పుకొస్తుంది.

"ఏంటా విషయం?" అని కుతూహలంగా అడుగుతుంది హర్షిత.

అప్పుడు గీతిక ఒకసారి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి, తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ... "నిన్ను కిడ్నప్ చేయించాలని ప్రయత్నిస్తుంది మా నాన్నే!" అని చెబుతుంది.

అది విన్న హర్షిత ఆశ్చర్యపోతుంది!

"మీ నాన్న నన్నెందుకు కిడ్నప్ చేయించాలనుకున్నారు?" అని అడుగుతుంది హర్షిత అనుమానంగా.

"మా నాన్న ఓ బిజినెస్ మ్యాన్! ఆయనకు ముందు నుండి రాజకీయాల్లోకి రావాలని ఉండేది. అందుకే ఎప్పుడూ బిజినెస్ లో సంపాదించిన డబ్బులో కొంచెం బయటకి తీసి ఊర్లో ప్రజలకి ఏదోటి చేస్తూ వచ్చేవారు. అలా ఊరి జనానికి దగ్గరయ్యేవారు. నేనది చూసి మొదట్లో ఆయనకున్న సేవా దృక్పథం అనుకున్నానే గాని, అది ఆయన రాజకీయ దృక్కోణం అని గ్రహించలేకపోయాను! ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మా నాన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.కానీ, అదే నియోజకవర్గంలో ఆల్రెడీ అంతకు ముందే ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచి ప్రజాసేవ చేసి ప్రజలకి ఎంతో దగ్గరయ్యారు మీ నాన్నగారు. అలాంటి మీ నాన్నగారికి పోటీగా నిలబడి గెలవడమంటే చాలా కష్టం. కానీ, మీ నాన్నగారిని ఆపితే కచ్చితంగా మా నాన్న గెలుస్తారనే నిజం ఆయనకి తెలుసు. అందుకే నిన్ను కిడ్నప్ చేయించి, మీ నాన్నని వేరొకరి పేరుతొ బ్లాక్ మెయిల్ చేసి నామినేషన్ వేయకుండా ఆపి, అసలు పోటీ అన్నదే లేకుండా చేసి గెలవాలన్నదే ఆయన పథకం! ఇదంతా ఆయనతో ఉండే కొంతమంది మనుషులతో చర్చిస్తుంటే నేను విన్నాను. మా నాన్నకి నా కన్నా, అన్నింటికన్నా రాజకీయమే ముఖ్యమని, దాని కోసం ఎంతకైనా తెగిస్తారని నాకర్థమయ్యింది! నిన్నెలాగైనా కాపాడాలనుకున్నాను. నీ కోసం పురమాయించిన మనుషుల్ని ఫాలో చేస్తూ నీ దాకా వచ్చాను. అప్పుడే మొదటిసారి నిన్ను చూసాను. ఆ తరువాత ఏం జరిగిందో నీకు తెలుసు!" అని అంతా వివరించి చెబుతుంది గీతిక.

"మరి మీ నాన్న గురించి ఇందాక పోలీసులకి ఎందుకు చెప్పలేదు?" అని కోపంగా అడుగుతుంది హర్షిత.

"నా అంతట నేనే మా నాన్నని ఎలా ఇరికించగలను! ముందు నిన్ను కాపాడాలనుకున్నాను. ఆ తరువాత నేను మా నాన్న నుండి దూరంగా తేజతో ఎటైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ, అనుకోకుండా మా నాన్న తేజపై ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఇప్పుడు తేజాయే నా దగ్గరకి వస్తున్నాడు. తనతో పాటు పోలీసులు కూడా వస్తున్నారు. ఇంక మనకి ఏ భయమూ లేదు! తరువాత పోలీసులు ఈ వెధవల్ని నాలుగు పీకితే వాళ్ళు ఎలాగూ మా నాన్న పేరు చెప్పేస్తారు" అని వివరణ ఇస్తుంది గీతిక.

ఇంతలో... "అచ్చా... నీ కంటికి మరీ మేమంత వెధవల్లా కనిపిస్తున్నామా?!" అని బిగ్గరగా నవ్వుతూ ఓ చెట్టు వెనుక నుండి కిడ్నాపర్లు వస్తారు.

అందులో ఒకడు: "సుపారీ ఇచ్చేటోనికి అవసరమైతే పానం ఇస్తా తప్ప హాత్ ఇవ్వను! చిన్నప్పటి సంది గంతే నేను. అట్నే పెరిగా! సుపారీ ఇచ్చినోడి కూతురివా నువ్వు. అరేయ్! ఈ పోరీని ఈడ వదిలేసి, దాన్ని జీప్ దగ్గరకి తోల్కపాండ్రా" అని అంటాడు.

అప్పుడు మిగతా వాళ్ళు హర్షితని బలవంతంగా లాక్కెళ్తుంటారు.

అప్పుడు గీతిక, "ఆగండి! ఒక్కసారి మా నాన్నకి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను!" అని వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంది.

"ఈగో చూడు గిప్పుడంత టైం లేదు. ఈ లోపట పోలీసులు వస్తే మా గతి ఏందీ! అందుకే ఇప్పుడు మేం గా పోరీని తీస్కపోతాం. పరేషాన్ కాకు, మేం దాన్ని ఏం చేయం! ఆ తరువాత నువ్వు మీ నాన్న చేత ఫోన్ చేయిస్తే వదిలేస్తాం. సమాజ్ అయ్యిందా!" అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా తనని లాక్కెళ్తుంటారు.

గీతిక ఎంత బ్రతిమాలినా వాళ్ళు వినిపించుకోరు. హర్షితను విడిపించడానికి ప్రయత్నించినా వాళ్ళ బలం ముందు తన బలం సరిపోదు. తానేమి చేయలేకపోతోంది. వాళ్ళు హర్షితని జీపులో ఎక్కించి తీసుకెళ్ళిపోతారు. గీతిక ఏం చేయలేక అక్కడే అలా ఉండిపోతుంది. వాళ్ళ నాన్న చేసిన పనికి బాధ పడుతూ ఓ రాయి మీద అలా కూర్చొని ఉంటుంది.

కాసేపటి తరువాత…

ఓ వ్యక్తి వచ్చి తన ముందు నిలబడతారు. ఎవరా అని పైకి చూస్తే అది హర్షిత. తనని చూసిన ఆనందంలో పైకి లేచి నిలబడుతుంది. తాను ఎలా రాగలిగింది అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంది గీతిక.

"వాళ్ళని దారిలో పోలీసులు పట్టుకున్నారు... సో, ఐ ఆమ్ సేఫ్!" అని చెబుతుంది హర్షిత.

"ఓహ్! థ్యాంక్ గాడ్! నౌ ఐ ఆమ్ వెరీ హ్యాపీ!" అని గీతిక తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది నవ్వుతూ.

"నువ్వింకా హ్యాపీగా ఫీల్ అవుతావు... ఓ సారి అటు చూడు!" అంటుంది హర్షిత.

తాను అలా చెప్పడంతో అటు వైపు చూస్తుంది గీతిక. అంతే తన వైపు వస్తున్న తేజని చూసి పట్టరాని సంతోషంతో పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వెళ్లి తేజని కౌగిలించుకోబోయి ఆగుతుంది. ఉన్నట్టుండి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.

అది చూసి తేజ, "గీతిక... ఏమైంది!" అని అడుగుతాడు.

"నాకు మీ ప్రేమను పొందే అర్హత లేదండి!" అంటుంది చిన్నగా ఏడుస్తూ.

"అర్హ.. ఏమంటున్నావ్ గీతిక, అసలు ఏమైంది!" అని అడుగుతాడు అర్థం కాక.

"మా నాన్న మీది-సిరిది ఫోటో చూపించి ఏదో చెబితే నేను నమ్మేసాను పిచ్చిదానిలా! ఒక్కక్షణం కూడా అందులో ఎంత నిజముందని ఆలోచించలేదు! కానీ, మీరు అప్పుడు ఆఫీసులో నా మీద, కళ్యాణ్ మీద రూమర్స్ వచ్చినా ధైర్యం చెప్పారు గానీ నన్ను అనుమానించలేదు! మీకు నేను తగను!" అంటూ ఏడ్చేస్తుంది.

ఆ మాటలు విన్న తేజ ఒక నిమిషం అలా ఉండిపోతాడు. తన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. కానీ, గీతిక అలాగే ఏడుస్తుండటం చూసి, "నేను నీకన్నా ముందు నుండే నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టాను. అది అప్పుడప్పుడే నా మనసుకి తెలుస్తుంది, సరిగ్గా అప్పుడే కళ్యాణ్ నీకు దగ్గరవ్వటం మొదలుపెట్టాడు. మరి అప్పుడు అతని మనసులో ఏముందో నాకు తెలీదు. నాకు ఎవరీ మీద కోపం లేదు గాని, తాను నీతో అలా క్లోజ్ గా ఉంటే చూసి తట్టుకోలేకపోయేవాణ్ణి! నాలో నేను ఆఫిసులో చాలా సార్లు ఎవరి కంట పడకుండా ఏడ్చేసే వాడిని. ఆ క్షణం నాకు ఏమయ్యేదో తెలీదు ఏడుపు వచ్చేసేది అంతే!

“కానీ, ఆ తరువాత అర్థం అయ్యింది, మనం ఒకరినెవరినైనా ప్రేమిస్తే వాళ్ళ విషయంలో చిన్న పిల్లలం అయిపోతాం. ఆ వ్యక్తి పూర్తిగా మనకే సొంతం అనుకుంటాం. ఏదీ... చిన్నప్పుడు ఎవరైనా 'మీ అమ్మని మేము తీసుకెళ్ళిపోతాం' అని సరదాకి అన్నా ఊరుకోము కదా అలా! అది అదోరకమైన స్వార్ధం, ప్రేమకి ఉన్న ఇంకో రూపం అది!

“అప్పుడు నేనెలా బాధ పడ్డానో, నువ్వూ అలా బాధ పడ్డావు! అందులో నీ తప్పేమి లేదు! నిజానికి నువ్వలా స్పందిస్తేనే నేనంటే ఎక్కువ ప్రేమున్నట్టు. ఎంత ప్రేముంటే అంత హక్కుగా ఫీల్ అవుతాం! కాబట్టి దాని గురించి బాధ పడకు! ఆ క్షణం లోతుగా ఆలోచించే శక్తి మన మనసుకి ఉండదు,” అంటూ బుజ్జగిస్తూ వివరణ ఇచ్చి, గొంతు వణుకుతూ ఉంటే ఒక రెండు సెకన్లు ఆగి, వస్తున్న ఏడుపుని ఆపుకుని, తమాయించుకుని, “అందుకే ఒక్కటి చెబుతున్నాను గుర్తుపెట్టుకో... ప్రేమ అనేది ఒక అంతులేని ప్రయాణం. భవిష్యత్తులో మన మధ్య మళ్ళీ మళ్ళీ మనస్పర్థలు రావచ్చు, రాకపోవచ్చు! కానీ వస్తే మాత్రం... అవసరమైతే నాతో గొడవ పడైనా విషయాన్ని తెలుసుకో గానీ, నన్ను వదిలేయకు గీతిక. ఎందుకంటే, నిన్ను వదిలి ఇంకొక్క క్షణం కూడా ఉండలేను!" అని అంటాడు రెండు చేతులతో తన ముఖాన్ని పట్టుకుంటూ.

అదంతా విన్న గీతిక వెంటనే గట్టిగా తేజని కౌగిలించుకుంటుంది.

అది చూసి హర్షిత కూడా కళ్ళు తుడుచుకుంటూ నవ్వుతుంది.

***

గీతిక ఇల్లు;

గీతిక, వాళ్ళ నాన్న నరసింహా, తేజ, హర్షిత బయట గార్డెన్ లో నుంచొని ఉంటారు.

హర్షిత: "మీరు తన మనసుని కష్టపెట్టినా తాను మాత్రం మీ పేరు పోలీసులకి చెప్పలేదు! మీకులా తను కూడా స్వార్ధంగా ఆలోచించలేదు. ఎందుకంటే ఓ కూతురిగా తన కన్న తండ్రిపై తనకున్న ఆ మమకారం అలాంటిది! మీరు మీ రాజకీయ లోభానికి లొంగిపోతే, తాను మీ ప్రేమకు లొంగిపోయింది. ఆ ప్రేమ చూసే నేను కూడా పోలీసులకి మీ పేరు చెప్పలేదు!

“ఇక తేజ విషయానికి వస్తే, ప్రేమించిన అమ్మాయి రిస్క్ లో ఉందని వదిలేయలేదు. తెగించి ముందుకొచ్చాడు. తను దొరికాక తనని తీసుకుపోకుండా మళ్ళీ మీ ముందు నిలబడ్డాడు. ఇంత సంస్కారం ఉన్నవాడు, మీ కూతురిని ఇంతిలా ప్రేమించేవాడు మీకు ఇంకొకరు దొరకుతాడా? ఇప్పటికైనా మించిపోయింది లేదు అంకుల్! వీళ్ళకి పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి, మా నాన్నని ఓడించి రాజకీయాల్లో నిలబడండి, బెదిరించి కాదు. గెలుపు ఓటములకు ఎవరూ అతీతులు కారు.

“ఇంకొక్క విషయం అంకుల్... అడ్డదారులు ఎప్పటికైనా ప్రమాదమే!" అని గంభీరంగా తాను చెప్పదలుచుకుంది ముక్కు సూటిగా స్పష్టంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

***

7. పరిణయం

కొద్ది రోజుల తరువాత...

ఒకానొక కల్యాణ మండపం;

వేదికపై పెళ్లి పీటల మీద పెళ్లి బట్టలతో గీతిక, తేజ ఎదురెదురు కూర్చొని ఉంటారు. వాళ్ళ మధ్యలో అడ్డుతెరని ఉంచుతారు.

"అమ్మా! వధూవరులిద్దరూ ఒకరి తలమీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచండి!" అని పంతులు చెప్పి మంత్రాలను ఆరంభిస్తారు.

వాళ్లిద్దరూ పంతులు గారు చెప్పినట్లు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి అలా ఉంచుతారు.

ఆ సమయంలో... "ఏమండీ! నేను దూరంగా ఉన్నప్పుడు నా మీద ఒక్క కవిత కూడా రాయలేదా?" అని అడుగుతుంది గీతిక చేతిని అలాగే ఉంచి.

"ఎందుకు రాయలేదు... రాసాను!" అని అంటాడు తేజ.

"అవునా! అయితే ఒక కవిత చెప్పండి!" అని అడుగుతుంది గీతిక.

"ఇప్పుడా...?" అని ఆశ్చర్యంగా అడుగుతాడు తేజ.

"హా ఇప్పుడే.... చెప్పండి! లేదా నేను పెళ్లయ్యాక ఓ రెండు రోజులు మీతో మాట్లాడను!" అని తేజ ని ఆటపట్టిస్తూ అంటుంది గీతిక.

"ఆమ్మో! వద్దులే.... చెబుతాలే...

"అక్కడ నేనున్నా లేకున్నా, నువ్వు నా పక్కనే ఉన్నట్టు కల కంటున్నా

నిను తలచిన, నిను చూసినా, నను నేను మరిచిపోతున్న!

ఈ తనువు నాదైనా, నా మనసు నీదని తెలుసునా?

నా తపన చూసైనా, ఆ అడ్డుతెరను దించి, నీ చెలిమి పంచవా ఇకనైనా!" అని అంటూ అప్పటి సందర్భాన్ని, ఆ ఎడబాటుని గుర్తుతెచ్చుకుని మనస్ఫూర్తిగా కవిత చెబుతాడు తేజ.

సరిగ్గా అదే సమయానికి వాళ్ళ మధ్యనున్న అడ్డుతెరని దించుతారు.

"ఆహా! అన్నయ్య ఏం చెప్పావ్ మా వదిన గురించి కవిత! సూపర్!" అని అంటుంది సిరి. అప్పుడు అందరూ నవ్వుతారు. తేజ-గీతిక లు కూడా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటారు!

సరిగ్గా ఆ సమయానికి నరసింహా కి ఫోన్ వస్తే ఆ సందడిలో వినపడట్లేదని పక్కకి వెళ్లి లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు అవతల ఉన్న తన మనిషి ఒకతను, „అయ్యా! ఇప్పుడే కౌంటింగ్ పూర్తయ్యింది. చాలా కొద్దీ తేడాలో మనం ఓడిపోయాం!“ అంటాడు దీనంగా.

అందుకు నరసింహా, „పర్లేదు లేరా అక్కడ ఓడిన ఇక్కడ తండ్రిగా గెలిచాను! నువ్వు కూడా త్వరగా ఇటు వచ్చేయి పెళ్ళైపోతుంది!“ అంటూ ఫోన్ కట్ చేసి మళ్ళీ పెళ్లి వేదిక మీదకి గర్వాంగా నడుచుకుంటూ వెళ్తాడు.

అలా వాళ్లిద్దరీ అసలు సిసలైన ప్రేమకథ ఇప్పటి నుండి మొదలవుతుంది!

***

శుభం!