Kshantavyulu - 10 in Telugu Moral Stories by Bhimeswara Challa books and stories PDF | క్షంతవ్యులు - 10

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

క్షంతవ్యులు - 10

క్షంతవ్యులు – Part 10

చాప్టర్ 25

ఆ మధ్యాహ్నం మేము చేరేటప్పటికి సరళ ఒక్కతె ఉంది ఇంటిలో.

"రా యశో, రామంబాబుని ఆహ్వానిస్తే ఆయన నాకు బోనస్ తీసుగొచ్చేరు," అంది సరళ.

"రాజేంద్ర క్లినిక్ లో వున్నారా?" అన్నాను.

"మీతో వచ్చిన తంటానే ఇది, కాని వాళ్లకు కంచాలు అయిన వాళ్ళకి విస్తర్లు," అంది సరళ నవ్వుతూ.

"ఆయనకైతే పస్తులన్నవిషయం చెప్పటం మర్చిపోయావు సరళా," అంది యశో నవ్వుతూ.

"నాకుకోపం తెపిద్దామనుకుంటే మీది వృధాప్రయాస, రోజులుమారాయి," అన్నాను.

అప్పుడే దిల్ బహాదూర్ మంచినీళ్ళు తెచ్చేడు, మమల్నిగుర్తుపట్టి నమస్కరించేడు.

"దిల్ బహాదూర్, డాక్టర్ గారికి బంధువు లొచ్చేరని చెప్పు," అంది సరళ.

ఆ రాత్రి నేనూ రాజేంద్రా మేడమీద కూర్చుని వున్నాము. సరళా, యశో కింద వున్నారు.

‘‘అయితే రామంబాబూ. మీరిక్కడే వుండిపోకూడదా? అక్కడికీ, ఇక్కడికీ ఎందుకు వెళ్లటం? మాది లంకంత ఇల్లు. ఏం చేసుకుంటాము చెప్పండి. మేమిద్దరమూ, మా మామగారు కూడా ఇక్కడకు రావటం మానేశారు,’’ అన్నాడు రాజేంద్ర.

మేము ఉదయం వాళింట్లో అడుగుపెట్టినప్పట్నుంచి ఇదే ధోరణి. యశోని సరళ, నన్ను రాజేంద్ర ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనే, అనుకున్న ప్రకారం ఇప్పుడు మమ్మల్ని విడదీసినట్టున్నారు.

‘‘మీరలా అంటున్నందుకు చాలా థ్యాంక్స్ రాజేంద్రబాబూ. కానీ అదెలా సాధ్యపడుతుంది చెప్పండి. ఇది ఏమైనా నెలా రెండు నెలల మాటా. చివరకు మేము ఎక్కడో అక్కడ స్థిరపడిపోవాలి కదా. పూర్వపు స్మృతుల‌కు ఎంత దూరంగావుంటే అంత శ్రేయస్కరం కాదా,” అన్నాను.

రాజేంద్ర ఏదో చెప్పబోతూంటే, హఠాత్తుగా సరళ, ‘పోస్టు పోస్టు’ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది.

‘‘రాజేంద్రా, ప్రస్తుతం వీళ్ల ప్రయాణం ఒక వారం రోజులు వాయిదా వేయించాను. మిగతాది తర్వాత చూద్దాము,’’ అంది సోఫాలో కూర్చుంటూ.

సరళ వెనకాల యశో వచ్చింది. నేను యశోకేసి కాస్త కోపంగా చూశాను.

“మీ అనుమతి కూడా కావాలి రామంబాబూ. లేకపోతే అంగీకారం అమలులోకి రాదని చెప్పింది,” అంది సరళ అది కనిపెట్టి.

‘‘అంతగా ఉండమంటుంటే ఉండననడం సమంజసంగా వుండదు,’’ అంది యశో.

‘‘సరే సరళా. యశో అంగీకరిస్తే నేను ఒప్పుకున్నట్టే. ఆ తర్వాత మమ్మల్ని వెళ్లిపోనీయి. అలా వుంటున్న కొద్ది వుండాలనిపిస్తుంది. ఎప్పటికైనా ఒక రోజు వెళ్లిపోవాల్సిందేగా?’’ అన్నాను.

‘‘మీరు అదే మాట అంటారు. ఎందుకు వెళ్లిపోవాలి మీరు? మా ఇంటిలో మీకు ఇష్టంలేక పోతే వద్దు. ఈ ఊరిలోనే ఇంకొక ఇల్లు కొనుక్కునో, అద్దెకు తీసుకునో వుండిపోకూడదా? మాకు తెలిసినవారు చాలామంది వున్నారిక్కడ. చవకగా దొరుకుతాయి. ఎక్కడికో కొత్త ప్రదేశానికి ఎందుకు వెళ్లిపోవాలి చెప్పండి. యశోకి ఈ ఊరంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా? అదేగాక, లఖియాకి దగ్గరగా వుంటారు. అప్పుడప్పుడు వెళ్లి చూడవచ్చు. ఆమె ఎంతో సంతోషిస్తుంది. మీరిలా చేస్తే,’’ అంది.

ఇవన్నీ నిజమే. కాదనలేని సూచనలివి. ఆ విషయం నాకు మొదటి నుంచి తెలుసు. అందుకనే నేను ముస్సోరీ వెళ్లటానికి భయపడ్డాను. నేనేం మాట్లాడకపోవడంతో సరళ అవకాశం జారవిడవటం ఇష్టం లేక ‘‘జవాబు చెప్పు రామంబాబూ. ఈసారి మిమ్మల్ని వదలిపెట్టను,’’ అంది.

నేను యశోకేసి చూశాను, యశో ఆకాశం లోకి చూస్తోంది. అంటే ఇక్కడ నాకే మాట సహాయం లభించదన్నమాట. రాజేంద్ర చిరునవ్వు నవ్వుతూ, ‘‘ఇక లాభం లేదు రామం బాబు, సరళకు మీరు తిరుగులేని సమాధానం చెప్పాలి,’’

“మా భిన్నమయిన జీవితం నూతన ప్రదేశంలోనే ప్రారంభించాలి సరళా,’’ అన్నాను.

అప్పుడు యశో ముఖం సింధూరంలా ఎర్రబడింది. సరళ తబ్బిబైంది. రాజేంద్ర అయోమయం లోకి చూస్తున్నాడు. నేను నాలిక్కరుచు కున్నాను.

మూడు రోజలు గడిచిపోయాయి. ముస్సోరిలో మా పనులన్నీ అయిపోయాయి. ఇంకా వారంరోజు లుండాలి అంగీకారం ప్రకారం. కానీ, ఎంత బలవంతం చేసినా యశో పూర్వంలా హక్ మాన్స్ కీ, పిక్చర్సు కీ, సుతరామూ రానంది.

అందుచేత మేము సాధారణంగా ఇంట్లోనే వుండిపోయేవాళ్లం. రాజేంద్ర మాత్రం క్లినిక్ కి అవసరం కలిగినప్పుడల్లా వెళ్ళేవాడు. అతని కళ్లల్లో ఇప్పటికీ యశోపై పూర్వపు మమతా, అనురాగం కనబడేవి. యశో పూర్వంలా కటువుగా వుండేదికాదు. ఎంతో సున్నితంగా వుండేది. దానితో నా హృద‌యం కాస్త తేలికపడింది. ఇక సరళ మా ఇద్దరినీ వదలి ఒక్క క్షణం కూడా వుండేది కాదు, వీలున్నప్పుడల్లా ఇక్కడ వుండిపొండి అనే మాట మంత్రంలా జపించేది. అప్పుడు కూడా ఆమె నాకొక సమస్యగా వుండిపోయింది. వివాహం ఆమెలో ఏమీ మార్పు తేలేదు. హఠాత్తుగా నవ్వేది. అప్పుడప్పుడు కళ్లలోంచి అనిర్వచనీయమైన విచారమూ, దు.ఖమూ వుట్టిపడేవి.

సరళను నేను ఎప్పుడూ అర్ధంచేసుకోలేక పోయాను. ఆమె అంటే అప్పుడప్పుడు జాలి వేసేది. అప్పుడప్పుడు కోపం వచ్చేది. నా మీద ఆమెకున్న అభిమానం తలచుకుంటే కృత‌జ్ఞత కూడా హృద‌యంలో మెరిసేది. కొన్ని కొన్ని సమయాల్లో ఆమె హద్దు మీరుతుందనుకునే వాడిని. అప్పుడప్పుడు ఆమె తలపుకు వస్తే రోబెర్టు బ్రౌనింగు తన భార్య ఎలిజబెత్ బారెట్ గురించి అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చాయి - సోల్ ఆఫ్ ఫైర్ యెన్‍క్లోజ్డ్ ఇన్ ఎ షెల్ ఆఫ్ పెర్ల్. ఈమె జీవితంలోని అన్వేషణ ఏమిటి? ఇంత అశాంతిగా ఎందుకు వుంటుంది. ఈమె వైవాహిక జీవితం సుఖంగా లేదా అన్న ఆలోచన వచ్చినందుకు అప్పుడప్పుడు నేను బాధపడేవాణ్ణి. రాజేంద్ర ఆమె మాట ఎప్పుడు కాదనగా నేను చూడలేదు. యవ్వనం, అందం, ఆస్తి, ప్రేమించే భర్త ఇవన్నీ వున్నాయి. అయినా ఏమిటి ఆమె జీవితానికి లోటు?

ఆరోజు మధ్యాహ్నం రాజేంద్ర ఏవో కేసులు చూడటానికి డూన్ వెళ్లాడు. క్రింద హాలులో మేము ముగ్గురమూ ఉన్నాము. కొంతసేపు పోయిన తర్వాత యశో కొంచెం తలనెప్పిగా వుందంది. సరళ ఏదో లేపనం తెచ్చి యశో నుదిటిపై రాసింది. కాసేపు యశో అక్కడే కూర్చుని, తరువాత పడుకుంటానని వెళ్లిపోయింది.

ఇక మేమిద్దరమూ మిగిలాము. సన్నగా రేడియో పాడుతూంది. సరళ పూలు అల్లుకుంటూ వుంది. సోఫాలో కూర్చుని నేను ఏదో పుస్తకం చదువుతున్నాను.

‘‘అయితే మీరు ఇక్కడ నుంచి వెళ్లక తప్పదా రామంబాబూ?’’ అంది సరళ తలెత్తకుండానే.

‘‘చెప్పాను కదా సరళా తప్పదని, జీవితంలో మనకు ఒక వ్యక్తి సాహచార్యమే జీవితాంతం వరకూ లభిస్తుంది. అదైనా అదృష్ట‌వంతులకే, మిగతా వారంతా ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోతారు. అఖరుకి ఆనవాలు కూడా వుంచకుండా. వారిని మనము కఠిన హృద‌యులూ, నిర్ణయులూ అని లాభంలేదు. మానవ జీవితమే అంత,’’ అన్నాను.

‘‘అయితే సరే వెళ్లండి, కాని నాకు ఈ మాట ఇవ్వండి. నా మీద కోపం వచ్చికాని, నన్ను చూసి అనుమానపడికాని మీరు వెళ్లిపోవటం లేదని,’’ అంది సరళ తల పైకెత్తకుండానే.

‘‘నీ మీద కోపగించటానికి నేనెవరిని సరళా. అయినా నువ్వు యింత ఆదరంతో ఆతిథ్యం ఇచ్చినందుకు నీమీద కోపగించి క్రోధం చూపించాలా?’’అన్నాను.

ఇంకా తను తలెత్తకుండా పూలు అల్లుకుంటొంది.

‘‘నిన్ను నేను పూర్తిగా ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాను. సరళా,’’ అప్రయత్నంగా, అనాలోచితంగా అన్నాను.

‘‘ఎప్పుడూ అర్థంచేసుకోలేకపోయారా నన్ను?’’ అంది అప్పుడు మెల్లిగా తలపైకెత్తి.

“అవును సరళా? ఆ మాట నేను కాదనలేను,’’ అన్నాను.

“అదే నా బాధ రామంబాబూ. లఖియా, యశో, రాజేంద్ర వీరెవ్వరూ నన్ను అర్థం చేసుకోలేదు. మీరుకూడా ఇంతేనా? జీవితాంతం నన్నర్ధంచేసుకొనే వ్యక్తి కోసం వెతుకుతూ వుండాల్సిందేనా? ఈ అన్వేషణకు అంతం లేదా?” అంది సరళ నిటూర్పుగా.

‘‘రాజేంద్ర నిన్ను ఎందుకు అర్థం చేసుకోలేదు సరళా. నిన్ను సరిగ్గా చూడడా?’’ అన్నాను.

‘‘అది కాదు రామంబాబు. రాజేంద్ర భర్తగా నాకేలాంటి లోటు రానివ్వడు; నేనూ, భార్యగా అతనికి ఏలోటు రానీయను. అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. నాకు కావాల్సింది నాకు లభించలేదు.’’ అంది.

అలా మాట్లాడుతూండగానే ఆమె కళ్లు నీళ్లతో నిండుకున్నాయి. ముఖం క్రిందకు దించేసుకుంది. నేను చకితుడనయ్యాను. సరళ కన్నీరు చూడడం ఇది రెండో సారి . మొదటిసారి తిరిగి కలుసుకున్నప్పుడు చూశాను. యశోలాగ సరళ ప్రతి విషయానికి కన్నీరు కార్చదు. నేను ఏమంటే ఆమెకు ఓదార్పు కలుగుతుంది? ఆమెకు కావాల్సింది నావద్ద లేదు. అది యశోకే లభించలేదు.

‘‘నీకు నేను సహాయం చేయాల్సిందేదైనా వుంటే చెప్పు సరళా, నాకు సాధ్యమైతే చేస్తాను,’’ అన్నాను.

సరళ మళ్లీ తల పైకెత్తింది. కళ్లల్లోంచి ఆశ తొంగి చూస్తూ వుంది.

‘‘ఇక్కడే వుండిపోండి రామంబాబూ. మీరు అవునంటే యశో కాదనదు. మీతో మళ్లీ ఎప్పుడూ ఈ విధంగా వుండను. నా హృదయాన్ని ఎప్పుడు బయట పెట్టను. ఎప్పుడూ మీతో ఒంటరిగా ఉండను. సరే అనండి. మీకు జీవితమంతా కృత‌జ్ఞురాలినై వుంటాను. ఆ వొక్కమాట అనండి, తర్వాత మీరేమి అడిగితే అది చేస్తాను,’’ అంది.

ఏమిటిదంతా? మళ్లీ కధ అడ్డం తిరుగుతూంది. అలా అవటానికి వీల్లేదు. గుండె రాయిచేసుకోవాలి.

‘‘ఈ విషయంలో నీవు పట్టు పట్టకు సరళ. నేను బాగా ఆలోచించి చెప్తున్నాను. మొదట కొన్నాళ్లు కాస్త కష్టంగా వుండొచ్చు. ఆ తర్వాత నా మాటల్లోని వివేకాన్ని నీవే గ్రహిస్తావు. ఇంక ఈ విషయం గురించి ఆలోచించకు. మరి ఏ విషయంలో నైనా, నేను నువ్వు చెప్పిందే చేస్తాను,’’ అన్నాను.

‘‘అయితే ఈ విషయం చెప్పండి. మీరు నన్ను గురించి చెడుగా భావించటం లేదు కదా?’’ అంది.

తుఫాను తగ్గుముఖం పడుతోంది, ఇంక పర్వాలేదు.

‘‘నీ గురించి నేను ఎందుకు చెడుగా భావిస్తాను సరళా. నువ్వు నాకు సరిగా అర్థం కాకపోవచ్చు. కానీ నీలోని మంచితనాన్ని, ఔదార్యాన్ని, విశాల హృద‌యాన్ని నేను గుర్తించాను. నీకొకమాట చెప్పాలని చాలా కాలం పట్టి అనుకుంటున్నాను. చెప్పమంటావా?’’ అన్నాను.

‘‘చెప్పండి,’’ అంది.

‘‘నువ్వు చంచల స్వభావినివే కావొచ్చు. కాని ఆ చంచలత్వాన్ని ప్రేరేపించకు, జీవితంలో మనము ఆశించినవన్నీ జరగవు. మన మనస్సు కోరినవన్నీ తీర్చలేము. చాలా కోరికలు, తీరని వాంఛలగానే వుండిపోతాయి. ప్రతి మానవుడి జీవితంలో ఇలాగే జరుగుతూంటుంది. వాటికి హృద‌యానికి పొందు కూడదు,’’ అన్నాను.

‘‘మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కాని వివాహమైనంత మాత్రాన ఇంక కోరికలూ, అభిమానాలూ, ఆవేశాలూ వుండకూడదంటే నేను ఒప్పుకోను. స్త్రీ జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన సంఘటన మాత్రమే. అది సర్వస్వమూ ఎన్నటికీ కానేరదు. మీరంతా నువ్వు వివాహితవు కనుక నీకు వివాహేతర అంశాలు తగవు అంటారు. నీ గృహమే నీ ప్రపంచం, నీ భర్త సర్వమానవ కోటి అంటారు. అది ఎప్పటికీ నేను ఒప్పుకోను,’’ అంది.

గృహిణిగా మూడు సంవత్సరాలు గడిపినా సరళ లో ఏమీ మార్పు లేదు . అసలు ఆమె వివాహం ఎందుకు చేసుకుంది?

“అది సరే సరళా. నీ అభిప్రాయాలు, ఉద్దేశాలు నాకు తెలుసు, వాటిలో కొన్నింటిని గౌరవిస్తాను కూడా. కోరికలు వుండకూడదని నేను ఎప్పుడూ అనలేదు. వాటిని అదుపులో వుంచుకోవాలంటాను. నువ్వు నాకు ఒక మాట యివ్వాలి. ఈ వారం అయిపోయిన తర్వాత మమ్మల్ని సంతోషంగా సాగనంపు. మేము ఎక్కడున్నా నిన్నుతలుచుకుంటూనే వుంటాము. భవిష్యత్తులో మళ్లీ కలుసుకోమని ఎందుకనుకోవాలి. బుల్లి పాపాయి నీ యింట పాకుతూంటే చూడటానికి వస్తాము,’’ అన్నాను.

సరళ ఇంతసేపటికి నవ్వింది.

‘‘పిల్లలు పుట్టటానికి ఎంత అవకాశంవుందో, పుట్టకపోవటానికి అంతే అవకాశం వుంది. అయినా పుట్టటమే తటస్థిస్తే మొట్టమొదటి కొడుకుపేరు ‘బాదల్ బాబు’ అని పెట్టుకుంటాము,’’ అంది.

ఆమె నవ్వుమాటలు తీరుపట్టి పిల్లలు పుట్టాలనే కాంక్ష ఆమెలో వుందనిపించింది.

‘‘అలాగే చెయ్యి సరళా, మీ వాడికి నేను గాడ్ ఫాదర్ ని అవుతాను,’’ అన్నాను.

గోడమీద గడియారం గర్వంగా మూడుగంటలు కొట్టింది.

‘‘అరే, మూడయింది. దిల్ బహదూర్ కి కాఫీ పెట్టమని చెప్తాను . మీరు యశోని లేపండి’’ అని లోపలికి వెళ్లిపోయింది.

నేను నెమ్మదిగా మేడమీదికి దారితీశాను. గదిలోకి వెళ్లి చూస్తే అసలు పగలు పడుకోవడమనే అలవాటు లేని యశో గాఢనిద్రలో వుంది. ముఖం కూడా కాస్త ఎర్రబడింది. నేను ఆందోళనతో తన పక్కమీద కూర్చుని, నెమ్మదిగా తన నుదిటిమీద చెయ్యిపెట్టేను. అరే, ఒళ్ళు సలసలా కాగిపోతూ యశో బాధపడుతూంటే నేను సరళతో కబుర్లు చెప్పుతున్నానా!! నాకు చాలా బాధ కలిగింది. నా ఉనికికి యశో కళ్లు విప్పి చూసింది. కళ్లు ఎర్రగా వున్నాయి.

‘‘జ్వరంగా ఉందా యశో?’’అని అడిగాను.

అవునంటూ తల వూపింది.

‘‘తల నొప్పి కూడా వుందా?’’ అన్నాను.

“అబ్బా,” అని కళ్లు మూసుకుంది.

అప్పుడే సరళ వచ్చి, యశో పరిస్థితిని గ్రహించి, వెంటనే కిందకెళ్లి దిల్ బహదూర్తో క్లినిక్ లోనే ఉన్న రాజేంద్రకి కబురు పంపింది.

వెంటవెంటనే తిరిగి వచ్చి తను యశో నుదిటిమీద మెత్తగా ముద్దుపెట్టుకుంది అప్పుడు యశో కళ్లు విప్పిచూసింది. మొదట నేననుకుంది కామోసు... ఆశ్చర్యంగా, ‘‘నువ్వా సరళా’’ అంది.

‘‘అవును నేనే యశో, ఇంత జ్వరంగా వుంటే ఎందుకు చెప్పలేదు,” అప్యాయంగా అంది సరళ.

‘"వీ రెలాగూ తెలుసుకుంటారని," యశో నా చెయ్యి పట్టుగుని నవ్వుతూ అంది.

"అమ్మీ, నీ నమ్మకం ఎప్పుడూ వమ్ముచేయను," అన్నాను పొంగుపొరలుతున్న ఆత్మేయతతో.

చాప్టర్ 26

హుటహుటిగా రాజేంద్ర వచ్చాడు. తనతో ఇంకొక డాక్టరుని కూడా తీసుకొచ్చాడు. అయన ఏదో స్పెషలిస్ట్, అప్పుడే వేరే పేషెంట్ని చూడడానికి రాజేంద్ర క్లినిక్కి వచ్చాడు. ఇద్దరూ యశోని పరీక్షించారు. జ్వరము మామూలుదే త్వరలోనే తగ్గిపోతుంది అన్నారు.

‘‘త్వరలో అంటే ఎంతకాలమని," అడిగాను ఆతృతతో.

ఇద్దరూ ఏదో సంప్రదించుకున్నాక, నాలుగైదు రోజులన్నారు.

రాజేంద్ర ఆ కన్సల్టింగ్ డాక్టరుకి వీడ్కోలుచెప్పి, తన ఇంజక్షన్ సామగ్రి తీసుగుని వచ్చాడు.

‘‘మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను రాజేంద్రబాబూ. రాక రాక జ్వరం మీఇంట్లోనే రావాలా చెప్పండి,’’ అంది యశో నెమ్మదిగా, రాజేంద్ర తనకు ఎదో ఇంజక్షన్ ఇస్తుంటే.

‘‘అలా అనకు యశో, నీకు సేవ చేసే అవకాశం మాకు ఇచ్చాననుకో. అయినా జ్వరం చాలా త్వరలో తగ్గిపోతుంది. ఏమీ కంగారు పడక్కర్లేదు,’’ అన్నాడు.

యశో ఇంకేమీ మాట్లాడలేదు. కళ్లు మూసుకుంది.

సరళ లోపలికెళ్లి కాఫీ తీసుకొచ్చింది. నెమ్మదిగా యశో కూడా త్రాగింది.

ఆ తరువాత, సరళా, రాజేంద్రా వెళ్లిపోయారు.

అప్పుడు యశో యెడల కలిగిన అనురాగంతో నా హృద‌యం కదిలింది.. దీనిని వెల్లడించటం ఎలా?

“అమ్మీ,” అన్నాను యశో పక్కకు చేరి.

‘‘మీరు అనవసరంగా కంగారు పడకండి. మీరు నాదగ్గర ఉంటే చాలు, నాకు కొండంతధైర్యం,” అంది యశో కళ్లు విప్పి నాకేసి చూస్తూ.

‘‘అది నువ్వు నాకు చెప్పాలా అమ్మీ,’’అన్నాను బలవంతాన కన్నీళ్లు ఆపుకుంటూ.

అప్పుడే రాజేంద్ర కొన్ని మందులు తీసుకుని వచ్చాడు. మూడు గంటల కొక మోతాదు వెయ్యమన్నాడు.

రాత్రి పది గంటలైంది. మందుల ప్రభావమేమో, అప్పటికే యశో చాలాసేపుగా నిద్ర పొతొంది. నేను తన పక్క దగ్గర కుర్చీలో కూర్చున్నాను. ఎప్పటిలాగే నా మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి.

అప్పుడు సుశీ మళ్లీ ఇప్పుడు యశో... సుశీకి జబ్బుగా వున్నప్పుడు ఆమె పక్కవద్ద ఇలాగే కూర్చునేవాడిని, అయినా ఆమెని రక్షించుకోలేక పోయాను. ఆమె నా చేతుల్లోంచి జారిపోయింది. ఆమె బదులు నాకు ఈ రత్నం లభించింది. ఈమెను నేను ఎన్నడూ పారవేసుకోను. ఆకాశం భూమైనా, మూడు ఆరైనా, ఆరు నూరైనా ఈమెను నేను రక్షించుకుంటాను. యశోకి నేను ఎప్పుడూ ఇసుమంతైనా సేవచేసి ఎరుగను. నా గురించి ఈమె ఎన్నో కష్టాలు పడింది. ఎంతో త్యాగం చేసింది. ఈసారి ఈ అవకాశాన్ని జారవిడువను.

అంతలో యశో మూలుగు వినబడింది.

“అమ్మీ” అని పలకరించేను, ఆమె దరి చేరి.

"అరే, మీరింకా పడుకోలేదా?’’ అని నెమ్మదిగా అంది యశో కళ్లు తెరవకుండానే

‘‘అవును అమ్మీ, నిన్ను చూ స్తూ కూర్చున్నాను,’’ అన్నాను.

యశో ఒక నవ్వు నవ్వి తిరిగి నిద్రాదేవత వడిలో చేరింది.

‘‘మీరింక వెళ్లి పడుకోండి రామంబాబు, నేను కూర్చుంటాను యశో దగ్గర,’’ సరళ వస్తూనే అంది.

‘‘అదేమిటి సరళా నువ్వెందుకు? నేనుంటాను, యశోకి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు, ఈసారైనా ఈ మాత్రం చేయనీ, ’’ అన్నాను.

‘‘మరి వేరే అవకాశాలు భవిష్యత్తులో మీకు చాలా కలుగుతాయి లెండి. ప్రస్తతం యశో మా అతిథి, స్నేహితురాలు, సోదరి. నాకిలాంటి అవకాశం మళ్లీ తిరిగి రాదు,’’ అంది.

మా మాటలతో యశోకి మెలకువ వచ్చింది.

‘‘సరళా నువ్వు వెళ్లి పడుకో, వీరున్నారుగా నన్ను కనిపెట్టుగుని,’’ అంది యశోమెల్లగా నవ్వూతూ.

యశో మాటలు నాకు ఎంత సంత్రుప్తినిచ్చాయో సరళను అంత నిరుత్సాహపరిచాయి.

సరళ ఏదో అనబోతూంటే, యశో ఆమెను తనమీదికిలాక్కుని, బుగ్గమీద ముద్దు పెట్టుకుని అంది. “ఇంకేమీ అనకు సరళా.”

“సరే”, అని సరళ వెళ్లిపోతూంటే, యశో అంది, ‘‘టైమయినట్టుంది, కాస్త మందిచ్చి వెళ్లు సరళా.’’

సరళ ముఖం కాస్త వికసించింది. ఎంతో అప్యాయంగా మందిచ్చి "గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్" అని, తలుపు జారేసి వెళ్లిపోయింది.

‘‘సరళా, రాజేంద్రలనను ఇబ్బంది పెడుతున్నానని నాకు బాధగా వుంది. మీరు కష్టపడుతున్నారని నాకు చింతగాలేదు, కృత‌జ్ఞ‌త‌ చూపించాలనే ఆలోచనా లేదు? ఇది మీ కర్తవ్యంలా అనిపిస్తూంది,’’ అంది యశో

‘‘అవును అమ్మీ. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. జీవితమంతా కూడా నేను నా విధిని పాటిం చేటట్టు చెయ్యి. భారమంతా నువ్వే మోస్తే నాకు బాధగా వుంటుంది,’’ అన్నాను.

మరికొద్ది సేపటి రాజేంద్ర వచ్చాడు.యశోని పరీక్షించి “రెస్పాన్స్ బాగుంది, ఇంప్రూవెమెంట్ ఉంది,” అన్నాడు, ఆ రూమ్ లో వేరే బెడ్ ఉన్నా నేను రాత్రల్లా కుర్చీమీదే కూర్చున్నాను. అప్పుడప్పుడు కునికిపాట్లు పడ్డాను. యశోని రెండుసార్లు లేపి మందిచ్చాను.

తెల్లవారకమునుపే యశో నిద్ర లేచేటప్పటికి నేను కుర్చీమీద జోగుతున్నాను.

“ఎలావుంది అమ్మీ నీకు,” అన్నాను మెళుకవ వచ్చి.

“నాకు బాగానే వుంది కానీ మీ వరసే ఏమీ బాగా లేదు, రాత్రంతా ఇలాగే ఉన్నారా?’’ అంది కోపమూ, మార్దవమూ మిళితమైన దృక్కులు ప్రసరిస్తూ.

“అబ్బేలేదు అమ్మీ, ఇప్పుడే కూర్చున్నాను ఇక్కడ,’’ అన్నాను.

‘‘ఎందుకలా పరగడుపునే అబద్దాలాడుతారు. ఆ పక్క చూస్తే తెలియదా, పడుకున్నదీ లేనిదీ? మీరిలా చేశారంటే అసలు మిమ్మల్ని ఈ గదిలోకి రానీయను, సరళను రమ్మంటాను,’’ అంది.

యశో ఎంత వద్దన్నా ఆ రాత్రి కూడా నేను తన గదిలోనే బెడ్ లైట్ వేసి వేరే పక్క మీద పడుకు న్నాను కానీ యశోకి ఏదైనా కావాల్సి వస్తుందేమో; నిద్రపట్టితే మెలకువ రాదేమోనన్న భయంతో చాలాసేపు నిద్ర పట్టలేదు. అయితే చివరికి ఎప్పటికో మగత నిద్ర పట్ట బోయింది, కానీ అంతలోనే తలుపు చప్పుడు విని గుమ్మం కేసి చూశాను. రాజేంద్ర తలుపు తోసి గదిలోకి తొంగి చూస్తూ కనబడ్డాడు. మొదట నాకు ఆశ్చర్యం వేసింది, తరువాత నాలో కుతూహలం చోటు చేసుకుంది, దాంతో నేను నిద్ర నటిస్తూ, ఆ మసక వెలుతురులో నా అరమోడ్పు కన్నులతో అతని ఆగడాలను వీక్షింపదలచేను. అతగాడు అక్కడినించే నా పక్క కేసి చూసి, దొంగలా గదిలోకి దూరి, నేరుగా యశో పక్కకు చేరేడు. అక్కడే చాలాసేపు మంత్ర ముగ్ధుడిలా ఆమె కేసి చూస్తూ నిలబడి పోయాడు. ఆఖరికి, నెమ్మదిగా యశో నుదిటిపై ఒక చెయ్యి వుంచి, రెండవ చేత్తో దుప్పటి సరిచేస్తుంటే ఆమెకు మెలుకువ వచ్చింది. కళ్లు తెరవ కుండానే, “ఎవరు? బాదల్ బాబు,” అంది. అప్పుడు, చడీ చప్పుడూ కాకుండా అతడు గబ గబా వెళ్లడం చూసి, నేను యశో మంచం దగ్గరకు వెళ్లి అన్నాను, ‘‘అవును అమ్మీ, నేనే.”

యశో నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని మళ్ళీ నిద్రలో ఒదిగిపోయింది.

ఆ అద్భుత దృశ్యం నాకిప్పటికీ కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. మనసులోని మమతా, మమకారం మాసిపోవట మనేది ఎంత కష్టమో గ్రహించాను అప్పుడు. ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమించటం తటస్థిస్తే దాని నుండి విముక్తవడం ఎంత అసంభవం, అవకాశం దొరికినప్పుడల్లా అది తల ఎత్తుతుంది. శరీరం ఎవరికి చెందినా ప్రేమ మనస్సులో నివసిస్తూనే వుంటుంది. అది రావణకాష్టంలాంటిది, ఆ అగ్ని ఎన్నటికీ ఆగిపోదు. ఆ మంట ఎన్నటికీ చల్లారలేదు.

మరుసటి రెండు రోజులు, పగలల్లా నేనూ సరళా యశో దగ్గర వుండే వాళ్లం, రాజేంద్ర గుమ్మం కూడా కదిలేవాడు కాదు. గంట రెండు గంటల కోసారి వచ్చి యశోని చూసేవాడు. ఎందుకైనా మంచిదని మరొకమారు ఆ డాక్టరుని పిలిపించాడు. అప్పుడతడు తన జీవితంలో వచ్చిన ఆ అవకాశాన్ని చేజారకుండా చూసుకోవా లన్నట్టు ప్రవర్తించేవాడు.

అయిదవ రోజుకు యశోకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది కానీ బాగా బలహీన పడింది. మరి అలాంటి స్థితిలో అమెని తీసుకుని తీర్థయాత్రలకు ఎలా వెళ్లగలను నేను. అయినా ఫర్వాలేదు పోదామంది. ఈసారి నేను అడ్డుపెట్టవలసి వచ్చింది. సరళ సంతోషానికి మేరలేదు. ఒకసారి ఎగిరి గంతువేసి యశో మెడను పట్టుకుని రెండు బుగ్గల మీదా ముద్దులు పెట్టుకుంది.

‘‘మీరు ఎంతకాలం వుంటే అంత సంతోషం మాకు రామంబాబూ. యశో చాలా నీరసంగా వుంది. నా శక్తి వంచన లేకుండా ఆమెకు నేను వైద్యం చేస్తాను. ఆమె మామూలుగా ఆరోగ్యవంతురాలయ్యేవరకూ మీరిక్కడే వుండిపోండి. ఇది చాలా ఆరోగ్యవంతమైన ప్రదేశం. ఆరోగ్యం కోసం అనేకమంది ఇక్కడకు వస్తూవుంటారు, మరి యశో ఏమిటో ఇక్కడనించి వెళ్లిపోతా నంటుంది!’’ అన్నాడు రాజేంద్ర.

జవాబు యశో నోటివెంట వచ్చింది.

‘‘మేమంటే మీకింత దయా, కరుణా ఎందుకు చెప్పిండి. బదులు తీర్చలేని దయ కూడా భరించటం కష్టంగా వుంటుంది రాజేంద్రబాబూ. మీ ఫీజు ఏమి ఇవ్వమంటారు?’’ అంది.

రాజేంద్ర నేత్రాల్లోంచి అవ్యక్తమైన బాధ క్షణమాత్రం గోచరించింది.

‘‘దీనిని దయా, కరుణా అని మమ్మల్ని కించపరచకు యశో, మీరు దగ్గరవుంటే మాకెంతో సంతోషంగా వుంటుంది. కేవలం స్వీయలాభం కోసం చేస్తున్నపని. మీరు ఇంకా కొన్నాళ్లు ఇక్కడ వుండటమే నాఫీజు,’’ అన్నాడు.

రాజేంద్ర ఎంత గంభీరుడో సుశిక్షితుడో నాకు తెలుసు. అవసరం వస్తేనే పెదవులు విప్పుతాడు. లేకపోతే తాళం వేస్తాడు. అటువంటి వ్యక్తి ఎంత బాధపడుతూ ఆ మాటలన్నాడో నేను గ్రహించాను. తనను యశో పరాయివానిగా చూస్తుందనీ, తన పూర్వ ప్రేమకు విలువ యేమీ ఇవ్వడం లేదని గ్రహించి బాధపడివుండాడు. కాని ఈ సమస్యకు పరిష్కారం ఏముంది? సుశీ మరణించక పోతే, యశోని నేను కలవక పోతే బహుశా, యశో రాజేంద్రను వివాహ మాడేది. కాని విధి ఇంకొక విధంగా తలచింది.

మరి ఇంకొక నాలుగు రోజలు గడచిపోయాయి. రాజేంద్ర ఏవేవో విటమిన్స్, టానిక్స్ తెచ్చి ఇచ్చేవాడు యశోకి బలం చేకూర్చడానికి . యశో భారమంతా సరళ వహించింది. యశో ముఖంలో పూర్వపు తళుకూ, బెళుకూ వచ్చాయి.

ఒకనాటి మధ్యాహ్నం నేను మా గదిలోకి వచ్చేటప్పటికి సరళ వీణ శ్రుతి సవరిస్తోంది. సరళ కంఠస్వరం బాగానే వుంటుంది కానీ తనకు వీణా సాంగత్యం కూడా వుందని నాకు తెలియదు.

‘‘రండి. మీ కోసమే యశో ఇదంతా బయటకు తీయించింది’’ అంది సరళ నన్ను చూసి

“ కర్మకాలి మీరు నన్ను పాడమనరు కదా?” అన్నాను నవ్వుతూ.

‘‘మీరేం దిగులుపడకండి, సరళ ఈ మధ్య వీణ వాయించటం నేర్చుకుందిట. అందుకే ఈ గాన కచేరి,’’ అంది యశో.

‘‘సరే, సరళ పాట కంటే ఇం కేం కావాలి,’’ అన్నాను

‘‘మీకు తెలియదా రామం బాబు, యశో చక్కగా పాడుతుంది,” అంది సరళ.

‘‘వారు నన్ను ఎప్పుడూ పాడమని అడగలేదు,’’ అంది యశో చిన్నబుచ్చకుంటునట్లు.

‘‘యశో అది తెలియక చేసిన పాపం. నువ్వు పాడగలవని తెలిస్తే చెవులు కోసుకు వినుండేవాడినని ఊహించలేవా,’’ అన్నాను నా రెండు చెవులు సాగదీసుగుని.

‘‘అయితే ఒక చెవితో వీణాస్వరం మరో చెవితో యశోగాత్రం వినండి,” అంది సరళ నవ్వూతూ.

‘‘మరీ మాటకారవుతున్నారే,” యశో నవ్వుతూ అని నా చెవులను నా చేతుల్నించి విడిపించింది.

"సహవాసం దోషం అనవు కదా యశో," అంది సరళ నవ్వుతూ.

"లేదు, యశోలాభం అనుకుంటాను," అంది యశో నాకేసి ఎంతో ఆప్యాయంగా చూస్తూ.

“ఏంటి సరళా, ఎప్పుడూలేనిది ఈ వేళ వీణ తీశావు,’’ అన్నాడు అప్పుడే వచ్చిన రాజేంద్ర.

‘‘నాకోసంకాదు రాజేంద్రా. యశో పాడతానంది’’

“ఆలస్యం ఎందుకు శుభస్య శీఘ్రం, ప్రారంభించు యశో,’’ అన్నాడు రాజేంద్ర.

రాజేంద్ర ముందు పాడటానికి యశో కాస్త సంశయించింది. ఆలస్యం చేస్తూంటే, సరళ తన చెవిలో ఏదో చెప్పింది. దాంతో యశో ముఖం లజ్జాపూరితమైంది.

సరళ వీణ వాయించటం ప్రారంభించింది. యశో పాట అందుకుంది. పాట సరిగ్గా జ్ఞ‌ప్తికి లేదు. ఏదో ‘ముద్దుల నవ్వుల మోహన కృష్ణా….’ అంటూ పాడినట్టు జ్ఞాపకం. యశో తలవంచుకుని పాడుతుంటే సరళ నాకేసి చూసి నవ్వుతూనే వుంది .

యశో కూనిరాగాల బట్టి తనంతచక్కగా పాడగలదని నేనెన్నడూ ఊహించలేదు. ఎంత విచిత్రంగా వుంది. అపార సౌందర్యము, సుగుణ సంపద, ప్రేమాభిమానాల తోటి మనస్సుని రంజింపచేసే ఈ శ్రవణానందకరమైన సంగీతశక్తి కూడా ఆమెకుందని తెలిసి నాకెంతో ఆనందం కలిగింది. బహుశా అది నాకు తనంతట తాను తెలియపరచటం ఇష్టం లేక మానివేసినట్టుంది. అయినా ఎప్పుడు నాగోలే కానీ నే నెప్పుడయినా తనగురించి పట్టించుకుంటే గదా తన్నుతప్పు పట్టడానికి. కొత్తగా నేర్చు కుంటున్నా సరళ కూడా వీణ బాగా వాయించింది. వీణ వాయించే ఆ భంగిమలో కూర్చుని తీగెలను మీటుతూంటే ఆమె ఎంతో మనోహరంగా వుంది.

పాటంతా అయిపోయిన వెంటనే రాజేంద్ర లేచి నుంచుని చప్పట్లు కొట్టగ నేనూ చేయూతనిచ్చాను

‘‘కంగ్రాచ్యులేషన్స్. చాలా బాగుంది యశో. నాకు కాస్త అర్జంటుపని వుంది. బయటికి వెళ్లాలి,’’ అని వెళ్లిపోయాడు.

ఆ మాటల్లో కాస్త ఆవేశం వుంది. ఆ పరిస్థితుల్లో తనను తను నమ్ముకోలేక వెళ్లిపోయాడని నాకర్ధమయింది. అతనికి పాట నచ్చటంలో ఆశ్చర్యమేముంది. ఎవరి పాటైనా బాగుంటే ఎవరైనా మరొక పాట పాడమంటారు. కాని అతను ఇంకొకటి పాడుతుందేమో నన్న భయంతో వెళ్లిపోయాడు. మానవుడు ఆవేశాలకి బానిస, వుత్సాహం అణచుకోవచ్చు కాని ఉద్రేకం అణచుకో లేము. యశో అదేమీ గుర్తించినట్టులేదు.

‘‘ఎలావుంది మీకు?’’ అంది.

‘‘యశో ఇన్నాళ్లు నీ గానామృతం రుచి నాకెందుకు చూపించలేదు,’’ అన్నాను.

‘‘నా వాయిద్యం మాటేమిటి రామంబాబూ,’’అంది సరళ ఆతృతగా

‘‘ఒక వెంపు నీ శృతి, యశో స్వరంతో మిళితమవుతుంటే, వేరో వెంపు నీ భంగిమే నీ లయతో పోటీ పడినట్లనిపించింది,” అన్నాను.

“యశోకి అభ్యంతరం లేకపోతే ఈ మీ అన్వయాన్ని జీవితాంతం పొందు పరచు కుంటాను,” అంది సరళ ఎనలేని ఆనందంతో.

“వారివల్ల నువ్వు పొందిన దానిపై నాకెందుకు అభ్యంతరం సరళా,” అంది యశో.

సరళ, యశోని తన హృదయానికి హద్దుకుని కళ్ళ వెంట నీళ్లు కార్చగా, నాకు అవి తుడవాలనిపపించిది కాని, నేను ఒక అడుగు కూడా ముందుకువెయ్యలేక పోయాను.

‘‘నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు యశో, నీది ఇంద మధురకంఠమని,’’ ఆ రాత్రి యశోని అడిగాను.

‘‘మీరు నన్ను అడుగలేదు, అనేక సార్లు చెప్పుదామనుకున్నాను కాని, సిగ్గూ, పౌరుషమూ అడ్డువచ్చేవి. అయినా, మీరు అప్పుడు చెవుల్లో సీసం పొసుగున్నారు కదా,’’ అంది తను సాలోచనగా.

"అంత నిష్టూరంగా మాట్లాడి నన్ను బాధపెట్టకు అమ్మీ," అన్నాను.

"మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నాబాధ చెప్పుకోవాలనిపించింది, అయినా గతం నాస్తి," అంది యశో నాచెయ్యి తీసుగుని.

‘‘అయితే సంగీతం ఎప్పుడు నేర్చుకున్నావు?’’ అన్నాను.

‘‘మీరు ముస్సోరి ఒక సంవత్సరంలో వస్తారనగా మానేశాను. సంగీతపు మాస్టరు ఈ వూరువదిలి వెళ్లిపోయాడు’’ అంది.

‘‘గతం నాస్తి, ఇప్పుడొక జోలపాట పాడు,’’ అన్నాను.

‘‘నాకు జోలపాటలు రావు. కృష్ణుడిమీద పాటలే వచ్చు’’ అంది యశో నవ్వుతూ.

రాజేంద్ర వైద్యం వల్ల సరళ శ్రద్ధవల్లా యశో పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. అపుడే అక్కడికి వచ్చి పక్షం రోజులైపోయాయి. ఇక ఎన్నాళ్లుంటాము. యశోకి చికిత్స చేయడంలో రాజేంద్ర మమత పునర్జీవించిందని గ్రహించాను. అలాంటి స్థితిలో ఇంకాఎక్కువ కాలం వుండటం ఎవరికీ మంచిదికాదు. నన్ను ఆశ్చర్యపరచిందేమంటే సరళ ఇది గ్రహించినా యశో దీనిని గుర్తించినట్లే కనబడలేదు. ఆమె ప్రేమించని పురుషుని ప్రేమను ఎంత నిర్దయగా తిరస్కరిస్తుంది. స్త్రీ? కనీసం సానుభూతి కనికరం అయినా చూపించదు.

ఆమాటకొస్తే, సరళ విషయంలో నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను. ఆమె నాపై చూపుతున్న ఎడతెగని మక్కువను రాజేంద్ర గ్రహించ కుండా ఉంటాడా? చెప్పాలంటే రాజేంద్ర కిది డబల్ జెపార్డీ. మరి నా మాటకొస్తే, ఇద్దరు అందమైన యువతులు నన్ను కోరుకుంటున్నా, నేనెవరికీ కాకుండాపోతున్నాను కదా. మాలాంటి వ్యర్ధ ఫోర్సమ్ ప్రపంచంలో ఎక్క డైన్ వుంటారా?

ఎంత వెళ్లిపోతామని మొత్తుకున్నా సరళ, ‘‘ఇంకొక రోజు .. యింకొకరోజు,’’ అనేది.

రాజేంద్ర కూడా యశో ఇంకా మామూలు స్థితికి రాలేదు అనేవాడు. డాక్టర్ గా రాజేంద్ర మాటలకు ఎదురుచెప్పలేక ఇంకొక వారం గడిపేశాము. చివరికి ఒక రోజున చెప్పాము మరుసటి దినం మా ప్రయాణమని. ఇక కాదనలేక ఒప్పుకోలేక ఒప్పుకున్నారు ఆ దంపతులిద్దరూ.

యశోని తీసుకుని అక్కడికి ఇక్కడికి ఆ స్థితిలో తిరగటం ఇష్టం లేకపోయింది నాకు.. అందుకే ముందర కాశీ వెళ్లి అక్కడ కొంత కాలం వుందామని నిశ్చయించుకొన్నాము. రాజేంద్ర కూడా డాక్టరుగా అదే సబబన్నాడు అన్నాడు

అపోద్దున్న సరళ ముఖంలో, రాత్రి నిద్రపోయిన చిహ్నాలు ఎక్కడా కనబడ లేదు. అనుకున్నట్టుగానే రాజేంద్ర కార్ లో నలుగురం డెహ్రడూన్ రైల్వేస్టేషన్ కి బయలుదేరాం. దారిపొడుగునా యశో, సరళా ఏదో మాట్లాడుకుంటున్నారు. స్టేషన్ లోకి వెళ్లి మా సామాను ఒక స్లీపర్ కోచ్ లో సద్ది ఫ్లాటుఫాం మీద నించునివున్నాము. ఇం కా రైలు బయలుదేరటానికి పదినిమిషాలుంది.

“డాక్టరుగా మీ ఫీజు చెల్లించ కుండానే వెళిపోతున్నాము, రాజేంద్రబాబూ,” అంది యశో .

‘‘నువ్వు త్వరలో వచ్చి ఇవ్వచ్చులే యశో,’’ అన్నాడు రాజేంద్ర.

‘‘లఖియాకి నా నమస్కారాలు చెప్పు సరళా’’ అంది యశో రైలెక్కుతూ.

గార్డు పచ్చజెండా పడుతున్నాడు. రైలు కూసింది.

నేను కదులుతున్న రైలెక్కుతుంటే సరళ నా దగ్గరకు హఠాత్తుగా వచ్చి,

‘‘నాకు మనస్సులో అన్యాయం చేయకండి రామంబాబూ,’’ అంది ఆవేదనతో.

నేను జవాబిచ్చేలోగా రైలు కదిలింది. చెయ్యి మాత్రం ఊపాను.