Aprasyulu - 9 in Telugu Moral Stories by Bhimeswara Challa books and stories PDF | అప్రాశ్యులు - 9

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

అప్రాశ్యులు - 9

అప్రాశ్యులు

భీమేశ్వర చల్లా (సి.బి.రావు)

9

విశాల రాత్రింబగళ్ళు అక్కడ పిల్లలతోనే గడపసాగింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంవరకు వారికి ఆటపాటలు విద్యాబుద్దులు నేర్పేది. ఆ తర్వాత వారి భోజనాలయిన పిదప దగ్గర కూర్చుని వారికి కథలు చెప్పుతూ నిద్ర పుచ్చేది. మనశ్శాంతికి ఆప్యాయంగా కౌగలించుకొని గడపిన దినం వృధాగా లేదనే గర్వంలో ఆమె నిద్రించేది జీవితంలో ఎన్నడని ఆమె అంత సుఖం అనుభవించలేదు. దీనికి ఇంకొక కారణం కూడా వుంది. ఇద్దరి ఆశయాలకు వొక్కటే , గమ్యస్థానం ...సునల్ తో స్నేహం దినదినం వర్థమానమైంది, తీరిక ఉన్నప్పుడల్లా విశాలవద్దకు వచ్చి ఆమెతో కాలంగడుపుతూ ఉండేవాడు. అతని సహృదయత, సరళ స్వభావము, స్వార్ధరహితం ఆమెలో ఒక విధమైన గౌరవ భావాన్నికలుగజేసాయి క్రమక్రమంగా ఈ స్నేహమే అనురాగపు బీజాలని వారి హృదయాలలో నాటింది. వారికి తెలియకుండానే హృదయాలు సన్నిహిత మయ్యాయి

సంధ్యాసమయాల్లోనూ, వెన్నెల రాత్రులలోను ఒకరి వద్దకు ఇంకొకరు బయలుదేరేవారు, దారి మధ్యలో కలుసుకొని దారితప్పి దగ్గరలోనే వున్న తోటలోనికి వెళ్ళి కూర్చుని, అనేక విషయాలను గురించి చర్చించేవారు. కాని ఎన్నడు స్వంత విషయాలను గురించి మాట్లాడుకోలేదు.

ఒకనాడు వారిరువురు మాట్లాడతూ మాట్లాడుతూ చాలాదూరం నడిచి వెళ్ళిపోయారు. మానవజీవితంలోని ఆశయాలు, ఆచరించవలసిన కర్తవ్యాలు, అదుపులో ఉంచవలసిన ఉద్రేకాలు, వీటిగురించి వారు చర్చించసాగారు.

“ఆశయాలను ఆచరణలో పెట్టడం కష్టమని నేను ఒప్పుకుంటాను సునల్ బాబూ! ఆశయాలుండి ఆచరణలో పెట్టలేకపోవడం ఆశయాలు లేకండా వుండటంకన్న యెంతో మేలు. ఎవరైనా నువ్వెందుకు జీవిస్తున్నావని అడిగితే తడుముకోకుండా అతడు సమాధానం చెప్పటానికి వీలవుతుంది” అంది. విశాల.

“కొంతవరకు నేను ఒప్పుకుంటాను, కాని ఆశయాలను మనస్సులో వుంచుకొని వాటికి విరుద్ధంగా సంచరించడం ఆత్మవంచన విశాలా! ఆశయాలను సాధించలేక పోవచ్చు. కాని వాటికోసం శక్తి వంచన లేకుండా కృషి చెయ్యడము ఆ వ్యక్తి కనీస ధర్మం. దానికి ఫలితంతో నిమిత్తం లేదు” అన్నాడు.

“అది నేను వొప్పుకుంటాను. కానీ నేనన్నదది కాదు, మానసిక బలహీనత వల్ల ఆచరణ పెట్టడంలో సాధ్యం కాదనుకోండి. అంతమాత్రాన ఆశయాలను వదలుకోవలసినదేనా? వాటిని మనస్సులో ఉంచుకోవడంలో దోషం ఏమిటి?”అంది.

“సహృదయత, బలహీనత సమకూడినప్పుడే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే మనస్సులో ఆశయాలు ఉన్నాయని ముగిసిపోయి వారిని వారేవంచించుకుంటారు. వాటిల్లో విశ్వాసం లేనివారి ప్రగల్భాలకి కూడా ఇది దోహదమవుతుం” దన్నాడు.

“నా విషయం తీసుకోండి. జీవితంలో నేను ఆశించేవి చాలావున్నాయి. హృదయంలో ఆశయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ రెండింటికి సఖ్యత లేదు” అంది.

“సఖ్యత లేకపోవచ్చును విశాలా! కాని నువ్వు నాకు చేస్తున్న సహాయాన్ని నేను ఎన్నడు మరువను, నువ్విక్కడికి రాక మునుపు నేను ఈ అమాయకపు పిల్లలను పంపెయ్యటమా,ఎలా పెంచి పెద్దవారిని చెయ్యటమా అని రాత్రింబగళ్ళు మధనపడేవాడిని. రోగుల గురించి నేను అట్టే అతురత పడేవాడినికాదు. వారికి వెయ్యగలిగినదంతా నేను చేస్తున్నాను, కాని పసితనంలో వారి మనస్తత్వాలని తీర్చిదిద్దే వ్యక్తి కావాలని. అ తరువాత నవ్వు లభించావు. వీరు పెరిగి పెద్దవారయిన తరువాత నువ్వు వారి యెడ ప్రదర్శిస్తున్న అనుపమానమయిన ప్రేమానురాగాలకి నిన్ను దేవతగా కొలుచుకుంటారు.నీ పరిచయం కలిగిన తరువాత నాలో ఒక నూతన శక్తి ఆవిర్భవించింది. దీనికి నేను ఏవిధంగా కృతజ్ఞత చూపగలనా యని సర్వదా ఆలోచించుచున్నాను” అన్నాడు.

ఆ మాటలు విని విశాల చాల ఆశ్చర్యపడింది. ఇంతకు ముందెప్పుడు ఆవిధంగా మాట్లాడలేదు. మితభాషి, గంభీరుడూ, ఉద్రేకము అతని స్వభావానికే విరుద్దము.

విశాల తలవంచుకొని “ఆ చివరివాక్యాలు నానోటి నుంచి వెలువడవలసినవి ...”

హఠాత్తుగా దగ్గర్లో పిడుగుపడింది.విశాల సనల్ బాబు వడిలోకి త్రుళ్ళిపడింది. అతను క్షణకాలం ఆమెను హృదయానికి హత్తుకొని వదలివేసాడు, ఆమె సిగ్గుతో “చాలా దగ్గరలో పిడుగు పడివుంటుంది. త్రుళ్ళిపడ్డాను” అంది.

దగ్గరలోవున్న ఒక చెట్టుమీద పిడుగుపడి దానిమీద విశ్రమిస్తున్న రెండు పక్షులు నేలకూలి చెట్టు భస్మమైంది. మాటలలో పడి వారు వాతావరణాన్నే మరచిపోయేరు. ఉరుములు, మెరుపులు విజృంభించాయిఆకాశమంతా నల్లటి మేఘాలచ్చాయతో మరుగుపడి వుంది. నల్లటి ఆ మేఘాలకి బీటలు వేస్తూ మెరుపులు మెరుస్తూన్నాయి. పెనుగాలికి చెట్లు వుర్రుతలూగుతున్నాయి.

“మాటలలోపడి అంతా మరిచిపోయాం. పెద్ద వాన వచ్చేటట్టు వుంది. త్వరగా పరిగెట్టాలి. పద విశాలా” అన్నాడు సునీల్.

ఇద్దరు పరుగెత్తడం ప్రారంభించేరు. కాని కొంత దూరం వెళ్ళేసరికి విశాల ఆయాసంతో ఆగిపోయింది, సనాల్ వెనుకకు వచ్చి నా చెయ్యి పట్టుకో త్వరగా నీవు, విశాల అన్నాడు ఆ చెయ్యి పట్టుకుని నడుస్తూవుంటేవిశాలకు ఎక్కడా లేని శక్తి వచ్చింది. కాని కొంత దూరం వెళ్ళేసరికి భోరున పెద్ద వాన ప్రారంభమయింది. ఇద్దరు పూర్తిగా తడసిపోయారు. ఎక్కడా తల దాచుకోటానికి చోటు లేదు. దగ్గరలో వున్న పెద్ద మర్రి చెట్టు దగ్గరకు చేరేరు. విశాల శరీరమంతా పూర్తిగా తడిసిపోయింది. చలికి వణుకుతూంది. ఆ దృశ్యం చూచి సునల్ హృదయం వ్యధతో నిండిపోయింది! కాని చేసేది ఏముంది?తన బట్టలన్నీ పూర్తిగా తడసిపోయేయి.

దగ్గరకు వెళ్ళి “విశాల” అని పిలిచేడు. ఆ పిలుపులో కరుణ, మార్థవం, తిన్నగా ఆమె హృదయాన్ని అంటుకున్నది. భయంకరమైన వాతావరణం ఆమెలో భరించలేని ఒక విధమైన భయాన్ని లేవదీసింది. ఆ సమయంలో సనల్ శోక కాలాతీతమైన ఆధారము, ఆశ్రయం లాగా కనబడ్డయి, హాఠాత్తుగా ఆమె ఆతని హృదయం మీద వాలిపోయింది, సునాల్ క్షణకాలం నిర్గాంతపోయేడు. కాని మరుక్షణంలోనే ఆమెను హత్తుకొని అలాగే మారుమాట్లాడకుండా నిలబడిపోయాడు. కొన్ని నిముషాలు గడిచిపోయిన తరువాత “చలి వేస్తుందా విశాల!” అన్నాడు.

విశాల తల పైకెత్తకుండానే జవాబు ఇచ్చింది “లేదు ఇప్పుడంతా పోయింది. మనస్సంతా ఎంతో తేలిక గావుంది. ఈ విధంగా జీవితమంత నేను నడపగలను” అంది మెల్లగా.

సనల్ మందహసము చేస్తూ “ఈ మాటలు నానోట నుంచి వెలువడలసినవి విశాల” అన్నాడు

విశాల “చిరునవ్వు నవ్వింది. నిర్దాక్షిణ్యంగా వాన కురుస్తూనే వుంది. వర్షపు బిందువులోకరి శరీరాన్నుంచి ఇంకొకరి శరీరానికి విస్తరిస్తున్నాయి. ఆకు పచ్చటి చీర ఆమె వంటికి అంటుకునిపోయివుంది. అపాద మస్తకము ఆమె అవయవ సౌష్టమును కన్నుల కింపుగా కనపడుతూంది. నెమ్మదిగా సనల్ విశాలని విడదీసి, “వర్షము వెలిసే సూచనలు ఏమి లేవు, విశాల, ఇంకా ఇంకొంచెం సేపు అలాగే వున్నామంటే నిమోనియ తప్పకుండా వస్తుంది” అన్నాడు.

విశాల “వస్తే రానీయండి. మీకు వస్తే నేను, నాకు వస్తే మీరు ఉపచర్యలు చేయవచ్చు” అంది.

“ఇద్దరికి ఒకసారే వస్తే ఏం చేస్తావు విశాలా”అన్నాడు.

‘‘మా రజని వుంది. రోగులకు సేవ చేయడంలో ఆమె చాకచక్యం శ్రద్ధాసక్తులు ఆసమానమయినవి” అంది.

“రజని అనే స్త్రీ యే అసమానమయింది. విశాలా వినోద్ ని నిజంగా ఆమె ప్రేమిస్తుందా?” అన్నాడు

“దానికి సరియైన సమాధానం ఒక రజని తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. రజని చెప్పదు. ఏది ఏమైనా ఆమె వినోద్ ఒక నూతన జీవితాన్ని ఇస్తూంది” అంది.

"అది నిజమే విశాల. కాని అతని పరిస్థితి శారీరకంగా ఇంకా చాలా ప్రమాదంగా వుంది. అతి బలహీనంగా వున్నాడు. ఏవిధయమైన వ్యాధి సోకినా ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. రజని అతనిలో ఆత్మవిశ్వాసాన్ని, జీవితం మీద తీపి నెలకొల్పింది.కాని ఆమె మృత్యువుతో పోరాడలేదు" అన్నాడు.

వర్షం కొంచెం వెలిసింది. విశాల చెయ్యి పట్టుకొని సనల్ పరిగెత్తుకొని ఆసుపత్రి దగ్గరకు వచ్చేడు. అదే సమయానికి రజని లోపలనుంచి బయటకు వస్తూంది. సన్నగా వర్షం కురుస్తున్నా నెమ్మదిగా ఎంతో తీరుబడిగా.ఆమెను చూచి ఇద్దరు హటాత్తుగా ఆగిపోయారు.

"అన్నింటితోపాటు విశాలకు వర్షపు విలువను నేర్పుతున్నారా, డాక్టర్? కాని ఇంకొకటి మిగిలిపోయింది. వెన్నెల, దాని విలువ కూడా నేర్పండి" నవ్వుతూ అందిరజని.

డాక్టర్‌కి ఏమనాలో క్షణకాలం తోచలేదు. యింకా ఇద్దరి చేతులు కలిసే వున్నాయి. రజని ఎదుట ఇద్దరిలో ఎవరికి విడిచే ధైర్యం లేదు.

సనల్ ప్రయత్నపూర్వకంగా చిరునవ్వు నవ్వి "విశాలకు నేను నేర్పగలిగినది ఏమీ లేదు రజని. నేర్చుకొనవలసినవి నీ వద్దనే నేర్చుకుంది" అన్నాడు.

ఏదో మాట్లాడవలెననే ఆతృతేఅతని ఈ మాటలు. అందులో అర్ధం వెతుకుతే శూన్యం.

"కాని నేను స్త్రీని డాక్టర్. జీవితంలో ఒక స్త్రీ ఇంకొక స్తీకి నేర్పగలిగింది వొక భాగం మాత్రమే. మిగిలినది నేర్చుకోడానికి విశాలవంటి అదృష్టవంతులకు మీలాంటిగురుతుల్యులు దొరుకుతారు. నా బోటి వారికి లభించేది నాస్తి" అంది.

అదే సమయానికి గట్టిగా వురుము వినబడింది. ఆకాశం మీద వర్షం వచ్చే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి.

"ఇప్పుడీ వానలో ఎలా ఇంటికెళ్తావు రజని? రాత్రికి ఇక్కడే నా వద్ద వుండిపోకూడదా?" అంది విశాల.

"నాకూ, ఈ వర్షానికి ఏదో అవినాభావ సంబంధముంది విశాలా. వర్షం కురుస్తుంటే నాలో ఎక్కడలేని వుత్సాహం వస్తుంది. చల్లటి ఆ చినుకులు, తెల్లటి ఈ శరీరం మీద నాట్యమాడుతూ వుంటే నన్ను నేనే మరచి ప్రవర్తిస్తాను" అంది రజని.

సనల్ నవ్వుతూ"అయితే రోగాలు నీ జోలికి రావా? ఆ విధంగా ఏమైనా అంగీకారముందా రజని" అన్నాడు.

రజని కూడా నవ్వి "అది లేదు డాక్టర్. అదే వుంటే మీలాంటి వారి పరిచయ భాగ్యమే లభించదు. స్వతహాగా నాకు డాక్టరు అంటే ఎంతో ప్రీతి" అని క్షణకాలం ఆగి "నేనీనాడు మీకొక రహస్యాన్ని వెల్లడి చేస్తాను డాక్టర్. ఎవ్వరికి వెల్లడి చెయకండి. ఆఖరికి విశాలకు కూడా చెప్పకండి." అని నవ్వసాగింది.

సనల్, విశాల కూడా నవ్వి “నేను ఇంత అదృష్టవంతుడనని నాకు తెలియదు” అన్నాడు.

“ఇదేముంది డాక్టర్. ఆసలైనది విలువైనది ఇంతకు ముందే లభించింది. విశాల చెయ్యిపట్టుకొని వర్షంలో విహరించడం అంటే సామాన్యమా” అంది రజని.

“రజనితో మాటలలో ఎవరూ నెగ్గలేరు. సనల్ బాబు అని “రజనితో తీరికగా పరహాసమాడుదుగాని, రాత్రి ఇక్కడే వుండిపో, వర్షం ఎక్కువవుతుంది” అంది విశాల.

“వద్దు విశాల నేను వెళ్ళిపోవాలి. రాత్రుళ్ళు పిల్లలకి ప్రయివేటు చెప్పుతున్నాను ఇప్పటికే ఆలస్యమైంది” అంది రజని.

మాటలు విని విశాల కొంచెం ఆతృతకనబరచింది.పగలల్లాపని చేస్తావ్, సాయంకాలం ఇక్కడకు వస్తావు. రాత్రిళ్ళు ప్రయివేటు, నీకు విశ్రాంతి ఎక్కడ ఇక్కడ లభిస్తుంది” అంది విశాల.

“ఇలా చేయ్యకుండా వుత్తినేకూర్చోవడమే కాదు. విశాల నేను ఇక్కడికి విశ్రాంతి వినోదాలకోసం వస్తాను” అంది.

“ఇలాగుమాట్లాడుతూంటేతెల్లవారిపోతుంది విశాల నేను వెళ్తాను అని సనల్ తో నవ్వుతూ “అద్దం దొరికినంత మాత్రన సంబరం పడితే లాభం లేదు. డాక్టర్ దానిని భద్రంగా కాపాడుకోవాలి మానవుల నుంచి దైవంనుంచి” అంది.

కాలం గడిచేకొలది వినోద్ ప్రేమ దాదాపు పిచ్చిగా మారింది. రాత్రింబగళ్లు రజనిని, తన వద్దే వుంచమనే వాడు, వేరే ఇతర పనులే చేయవద్దనేవాడు.ఆమెని మానసికంగా ఎంతో బాధ పెట్టేవాడు. కాని ఆమె ఎంతో సహనంగా, ఓరిమితో సంచరించేది. శారీరకంగా అతని పరిస్థితి దినదినం క్షీణించిపోయింది. కీళ్ళనొప్పులతో మంచంమించి లేవలేని పరిస్థితికి వచ్చాడు. దానికితోడు నిమోనియా జ్వరంకూడా వచ్చింది. దానితో పరిస్థితి చాలా విషమించి, ఒళ్ళంతా కాలిపోయే జ్వరం, వళ్ళు తెలియని ప్రేలాపన. ఈమె రాత్రింబగళ్ళు అతని ప్రక్కనే కాలంగడుపుతూండేది. ఒంటిమీద స్పృహవచ్చినప్పుడల్లా రజనీ అని గట్టిగా అరచి లేచేవాడు. సంధిలో కూడా రజనీ, రజనీ, అని పలవరించేశాడు. అనేక సార్లు నన్ను పెళ్ళి చేసుకుంటావా? రజనీ, చేసుకుంటానంటే నాకు ఏమీ అక్కరలేదు అనేవాడు. అప్పుడప్పుడు నేను కుష్టు వాడిని, నన్ను అందరు అసహ్యించుకుంటారు. నువెందుకు అసహ్యించుకోవు అనేవాడు.అడపాదడపా నేను చావను రజనీ, నాకు చావాలని లేదు. నీకోసం నేనుబ్రతుకుతాను. మెలకువ వచ్చినప్పుడల్లా ఆమెతో “నీవు నన్ను విడిచి వెళ్ళకు రజనీ, మృత్యువు నుంచినన్ను మృదువుగా రక్షించుకోలేవా?” అనేవాడు.

“నేను సావిత్రిని గాను వినోద్. మనస్సులో పతివ్రతను కాను. సంఘం దృష్టిలో పతితనుఅనుకొని బయటకు మృత్యువుని మీరూహించుకుంటున్నారు. వినోద్ బాబూ అంతకంటే ఇంకేమి లేదు” అంది.

రజని నిశ్చలమైన మనోధ్యేంతో అన్ని భరించింది జ్వరంలో అతని పలవరింతలు వినినప్పుడే కళ్ళల్లో లోతుగా కన్నీరు తిరిగేది. కాని ఎప్పుడు బయటకు ఏమాత్రం కనబరిచేది కాదు, విశాలకి మాత్రం దుఃఖం ఆగేది కాదు. సాథ్యమయినంతవరకు ఆమె అక్కడనుంచి దూరంగావుండేది. రజని కూడా ఆమెను ప్రాధేయపడింది.

ఆమె నవ్వి “నాకు ఇది చిన్నతనంనుంచి అలవాటేగా విశాలా! రోగులకు సేవ చేయడమనేది నాకేమి కొత్త కాదు కదా? మామయ్యకి, ప్రసాద్ కిసేవ చెయ్యడంలో లేని దోషం ఇందులో ఏముంది? వారు నాకెంతో స్నేహపాత్రులు ఇతను కూడా ఇప్పుడంతే” అంది.

“అది కాదు రజనీ! రోగివద్ద రాత్రింబగళ్ళు అలా ఉండడము నీ ఆరోగ్యానికి మంచిది కాదు. డాక్టర్ సనల్ కూడా అదే అంటున్నారు” అంది.

“అది డాక్టర్ సనల్ చెప్పనవసరం లేదు విశాలా! కాని ఆ అపాయానికి దడిసి నా ఆత్మ ప్రబోధాన్ని పెడచెవిని పెట్టను” అంది.

విశాల దీర్ఘంగా నిట్టూర్చి “అత్యున్నతమైన నీ ఆదర్శాలకు అడ్డు రావడంకూడా అవివేకమే రజనీ! నాపొరపాటు” అందీ.

ఒకనాడు వినోద్ తన తల్లిదండ్రుల ఆచూకీ చెప్పి వారిని పిలవండన్నాడు, కలకత్తాలో ఆయన ఒక పెద్ద లాయరు. వెంటనే టెలిగ్రాం ఇచ్చారు. రెండురోజుల తరు వాత అతని ముసలితల్లిదండ్రులు వచ్చారు. పుత్రుని విషాద పరిస్థితి చూచి హృదయంబ్రద్దలయేటట్లు కన్నీరు కార్చేరు.స్పృహవచ్చిన తర్వాత అతడు కరడుకట్టిన కన్నీరంతా కార్చి వేసాడు.

“అమ్మా! మీకు నేను నా ముఖం ఇక చూపించకూడదనుకున్నాను. నాకు ఇలాంటి అసహ్యపు వ్యాధి వచ్చిందని తెలియకుండా వుంచుదామని ప్రయత్నించాను, కాని రజని బోధ నా మనస్సును మార్చి వేసింది. నాలో ఆత్మవిశ్వాసాన్ని, మానవత్వాన్ని తిరిగి ఆమె నెలకొలిపింది. కాని అప్పటికే సమయం మించిపోయింది” అన్నాడు.

అతని తల్లి భోరున ఏడుస్తూ రజని మీద వాలిపోయింది. రజని రెండు మూడు నిమిషాలు ఆమెనలాగే కన్నీరు కార్చనిచ్చింది. ఆతర్వాత నెమ్మదిగా “అలాగే అధైర్యపడకండి. ఇంకా మనం ఇతన్ని రక్షించుకొనే అవకాశం పూర్తిగా పోలేదు” అంది.

ఆ మాటతో ఆమెలో ఎక్కడ లేని సంతోషం ఉబికి వచ్చింది. గబగబ కన్నీరు తుడుచుకొని “ఆవును, వినోద్ కి ఏ ప్రమాదం జరుగదు. తప్పకుండా మనమంతా రక్షించగలం. ఇక యిప్పటినుంచి రాత్రింబగళ్ళు నేను దైవాన్ని ప్రార్ధిస్తాను. తిరిగి అతనికి స్వస్థత చేరేవరకు” అంది.

అప్పటినుంచి ఆమె రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని దైవాన్ని ప్రార్థించసాగింది. ఎవరెంత చెప్పినా ఆమె వినలేదు. చివరకు ఆమె రోగివద్దకు కూడ వచ్చేది కాదు. శరీరంలోని శక్తులన్నీ కూడదీసి తన ఇష్ట దైవం శ్రీ రామచంద్రుడిని తన పుత్రుని యముని బారి నుండి రక్షించమని వేడుకొంది.

సనల్ శక్తి వంచన లేకుండా కృషి చేసారు. చివరకు పెదిమ విరిచాడు. నాకు చేతనయినదంతా చేసాను. రజనీ కాని ఫలితం లభించలేదు. శరీరపరిస్థితి అతి బలహీనంగా వుంది, ప్రతిఘటనా శక్తి బొత్తిగా లోపించిపోయింది. లోపలికి ఏమిచ్చినా వంటబట్టటం లేదు లోపల వ్యాధి స్వేచ్ఛావిహారం సలుపుతుది. ఇక దీనిని అడ్డగించేశక్తి ఏవంకా లేదు అన్నాడు.

రజని హృదయం లోలోన పూర్తిగా కృంగిపోయింది. దేనికోసమయితే ఆమె తన సర్వస్వము ధారపోసి కృషి చేసినదో అది నేలకూలిపోయింది. ప్రపంచమంతా ఎడారి మయమనుకొని మరణాన్ని కాంక్షించే వినోద్ కి కనుచూపు మేర వున్న ఉద్యావనాన్ని చూపించి జీవించాలనే కాంక్ష కలుగచేసింది. కాని వాటిని జేరక మునుపే కాలగర్భంలో లీనమై పోతున్నాడనే ఆమె బాధ పడింది. చివరకు అవి ఎండమావులని భ్రాంతి పడి “రజనీ! అందరిలాగే నువ్వు కూడా నన్ను మోసగిస్తున్నావా!” అని ప్రశ్నిస్తే ఆమె ఏలా సలహా ఇస్తుంది? అవి ఎండమావులు కాదని, ఎదురుచూసే పూల వనమని ఆమె ఎలా రుజువు చెయ్యగలదు?

ఉబికివచ్చే కన్నీరుని లోలోనే దిగమింగి “అతన్ని మృత్యువు కబళించి వేస్తోందని నేను విచారించడంలేదు సనల్ బాబూ!జీవితంలోని వెలుగును చూడలేదే అనిమాత్రంబాధపడుతున్నాను. ఆ పట్టుదలతోనే నేను ఇంత కాలం ప్రయత్నించాను” అన్నది.

విశాల దగ్గరే వుంది “ప్రయత్నం మాత్రంలోనే ఫలితం లభించదు. కర్తవ్యానికి ఫలితంతో ప్రమేయం లేదు, అని నీవే నాకొకసారి బోధన జేసావు. అది మరచి అబలలా విలపిస్తున్నావా రజినీ?” అంది.

“నేను విచారిస్తున్నది ఫలితం లభించలేదని కాదు విశాలా! | ప్రయత్నం పూర్తి కాలేదేననిమాత్రమే” అంది రజని.

వినోద్ తల్లి యింకా దైవ ప్రార్ధనలోనే నిమగ్నురాలయివుంది. డాక్టర్ సనల్ ఇంకో రోజుకన్న బ్రతకటం అసంభవమని చెప్పాడు. రోగికి శరీరంమీద స్పృహ అప్పుడే వస్తోంది. వచ్చినప్పుడల్లా తల్లి రూపం కనపడక పోయేసరికి నిరుత్సాహపడేవాడు.

రజని అతని తల్లి వద్దకు వెళ్ళి “అమ్మా!” అని పిలిచింది. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరచింది.

“అస్పష్టమైన ఆ దైవాన్ని మీరు ఆరాధిస్తూ మీ మనస్సుని మోసగించుకొంటున్నారు. జీవించినంత కాలమైనా మీరు వినోద్ దగ్గర వుండాలి. అది మీకు సంతృప్తి కలిగిస్తుంది. వారికి సంతృప్తి కలిగిస్తుంది. విలువైన ఈ కాలాన్ని ఇలా వృధా చేసి పిదప మీరు బాధపడతారు” అంది రజని.

“లేదు-నా బాబుని స్వామి రక్షిస్తాడు” అంది ఆమె.

ఆ మాటలు విని రజని అంత దుఃఖసమయంలో కూడా కొంచెం వ్యంగ్యంగా నవ్వి “ఆలాంటి రక్షించేవ్యక్తివుంటే ఇంతవరకు రానేరాదు, మీ ప్రార్ధన అవసరమేవుండదు. జరుగవలసినది జరుగుతుంది. మీరు వినోద్ ని కనిపెట్టి వుండాలి. అది మీపని. నాది కాదు” అంది.

అయిష్టంతోనే ఆమె వినోద్ వద్దకు వచ్చింది. జ్వరం చాలా తీవ్రంగావుంది, సంధిలో ఏదేదో మాట్లాడుతున్నాడు రజనీ? రాత్రింబవళ్ళు నిన్నారాధించినా నీఋణం తీరదు రజనీ? “అమ్మా ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావమ్మా! నాన్నా, నా కోసం ఎంత తీసుకు వచ్చావు?“అని ఏవేవో మాట్లాడుతున్నాడువినోద్.తండ్రి, డాక్టరు సనల్, విశాల రామం అక్కడే వున్నారు. ఆ దృశ్యం చూచి వినోద్ తల్లి గుండెలవిసి వెక్కి వెక్కి ఏడువసాగింది. అది చూచి అందరు కంటతడి పెట్టారు. ఆశ్చర్యకరమయినదేమంటే రజని కళ్ళలో కన్నీటి చాయలే లేవు. నేత్రద్వయం జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి. ఆమెను రెండు చేతులతో ఆప్యాయంగా చేరదీసి “మనస్సుని చక్కబెట్టుకోవాలమ్మా, కన్నీరు కార్చవలసిన సమయం ఇంకా రాలేదమ్మా, మీ కుమారుడు నాకు వారు భర్త సమామలు” అంది.

ఆ చివరి మాటలిని అందరు నిశ్చేష్టులయ్యేరు. రామం ముఖంలో కత్తి వేసినా నెత్తురు చుక్క లేదు.

“వారు నన్నొకసారి అడిగేరు. మనస్సులో నువ్వు నన్ను భర్తగా స్వీకరించే సహాయం నీలో వుండాలని, స్వీకరించి ఏమి చేసేవంటే నేమి చెప్పలేదు. వారి మనశ్శాంతి కోసం స్వీకరిస్తానని చెప్పేను. అంది రజని.

వినోద్ తల్లి ఏడుస్తూ నువ్వు మాపాలిటి దేవతవమ్మా నీ ప్రార్థన కూడానా శ్రీరామ చంద్రుడు, ఆలకించలేదా? అంది.

“నేను ఎప్పుడు ఎవరిని ప్రార్థించలేదమ్మా? నాకు చేతనయినదంతా నేను చేసాను” అంది.

రజని మాటల అర్ధం ఎవరు పూర్తిగా ఇంకా గ్రహించలేదు. రామం బయటకు వెళ్ళిపోయాడు. అది గమనించి విశాల కూడా అతనిని అనుకరించింది. రామం చర చర నడచి వెళ్ళిపోతున్నాడు.

విశాల వెనుక నుంచి రామం బాబు, అని పిలిచింది. పిలుపు విని రామం ఆగి, వెనుదిరిగి చూచాడు. విశాల దగ్గరకు వచ్చి “ఎక్కడకు వెళ్ళిపోతున్నారురామం బాబు” అంది.

రామం ముఖంలో నిరుత్సాహం, నిస్పృహ, ధైర్యం తాండవిస్తున్నాయి. “ఇక ఎక్కడికయితే నేమిటి విశాల” అన్నాడు.

“తొందరపడకండి రాంబాబు” అంది విశాల

"తొందరపడి చేసినా, తొందరపడకుండా చేసినా ఫలితం ఇప్పుడు వొక్కటే విశాలా. త్వరలో డిల్లీ వదలి వెళ్ళిపోతాను" అన్నాడు రామం.

"మీరు ఏమి చెయ్యాలొ నేనేమీ చెప్పలేను. కాని కొద్దిరోజుల వరకు మీరు తొందరపడకండి. వినోద్ పరిస్థితి ఇలా వున్నప్పుడు మీరు ఏం చేసినా అసంగతంగా వుంటుంది" అంది విశాల.

హృదయాన్ని రగిల్చివేసే యీ బడబాగ్నిని త్రుంచి, నేనిక్కడ వొక్కక్షణం కూడా వుండలేను విశాలా?"అన్నాడు

"సరే ఇప్పుడు వెళ్ళండి. కాని అప్పుడప్పుడు వస్తూండండి. లేకపోతే రజని చాలా బాధపడుతుంది"అండి.

రామం సరేనని వెళ్ళిపోయాడు. విశాల తిరిగి లోపలికి వచ్చింది. అప్పటికి వినోద్‌కి తిరిగి స్పృహ వచ్చింది. ప్రక్క మీద వినొద్ తల్లిదండ్రులు కూర్చుని వున్నారు. రజని దగ్గర వున్న కుర్చీలో కూర్చుని వుంది.

వినోద్ రజనిని ఉద్దేశించి అంటున్నాడు. “మరణించిన తరువాత నాకేదైనా శక్తి సంక్రమిస్తే ఆ సర్వస్వం నీకోసం వినియోగిస్తాడు. నాకు చేతనయితే ప్రపంచానికంతకు నిన్ను రాణిని చేసి, అందరు నీ పాదాలు తాకేటట్లు చేస్తాను" అన్నాడు.

ఎంతో ప్రయత్నపూర్వకంగా శరీరంలొ మిగిలిన బలమంతావినియోగించి అనిన మాటలివి. అయినా ఆ ప్రయత్నానికే శరీరం తట్టుకోలేకపోయింది. శరీరం మీద స్పృహ మళ్లీ పోయింది. డాక్టర్ సనల్ నాడి పరీక్షించి, అతి బలహీనంగా వుంది. అంతా బయటకు వెళ్ళిపోవాలి. రోగి మాట్లాడకూడదు.

అందరు బయటికి వచ్చేసారు. డాక్టర్ ఎంత ప్రయత్నించినా తిరిగి స్పృహ రాలేదు. సుమారు తెల్లవారు జామున మూడు గంటలకు వినోద్ తోటిమానవులను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయాడు.

వినోద్ మరణం రజనికి గొడ్డలిపెట్టులా హృదయంలో తగిలింది. పట్టుదలతో తన సర్వస్వాన్ని ధారపోసి ఏ పని సాధించాలని ప్రయత్నించిందో అది విఫలమయింది. హృదయంలో తీరని వెలితి ఏర్పడింది. మనస్సులో అశాంతి చెలరేగింది. వినోద్‌ని నిజంగా ఆమె ప్రేమించిందో లేదో చివరకు ఆమెకు కూడా తెలియదు. వినోదంటే అపరిమితమైన సానుభూతి, అంతులేని జాలి అనుగుణము ఆమె హృదయంలొ ఆమె గుర్తించగలిగింది. వినోద్‌ని రక్షించటంతన కర్తవ్యమని ఆమె భావించింది. ఆ నిశ్చయంతోనే ఆమె ముందడుగు వేసింది. సాధకబాధకాలు, అష్టకష్టాలు, పరిస్థితుల పరిణామాలు, ఆప్తులు ఆత్మీయులు ఇవన్నీ ఆమె ప్రక్కకు త్రొసివేసి, ఆమె మృత్యువుతో పోరాడింది. జీవితంలోమొదటిసారిగా ఆమె ఓటమిని అంగీకరించక తపట్లేదు. ఆనాడు రామం అకస్మాత్తుగ అలా బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఆమె గ్రహించింది. తరువాత విశాలకూడ చెప్పింది. రామం అన్న మాటలువిని రజని బాధపడింది. వినోద్ తల్లిదండ్రులను ఓదార్చే భారం ఆమెమీద పడింది. తన దుఃఖాన్ని దిగమింగి ఆమె వారిని ఓదార్చడానికి ప్రయత్నించింది. కాని అంతులేని పుత్రశోకం వారిది. ఒక్కగానొక పుత్రుడు అనేక సంవత్సరాలు పోయిన తరువాత మరణశయ్యమీద తిరిగి లభించాడు. వారి ప్రార్థనలను పెడచెవిని పెట్టి దైవం వారికి ద్రోహదం చేసాడు.

రజని వారికి కొద్దికాలంలోనే గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. పండు యవ్వనంలో వున్న అపురూప సౌందర్యవతి ఆ అభాగ్యుడయిన వారి పుత్రుని యెడ కనబరచిన ఆదరాభిమానాలు, శద్ధాశక్తులు, వారి హృదయాలని కదలించి వేశాయి. మనస్సులో పలుమార్లు ఆ వృద్ధ దంపతులు ఈమె నా కోడలయితే ఎంత బావుండును అని అనుకునేవారు. చివరకు ఆ మాటలు ఆమె నోటి వెంట వినడం తటస్థించేసరికి వారికి దుఃఖము, సంతోషము రెండూ కలిగాయి. వారిద్దరు రజనిని వారితోకలకత్తా వచ్చి వారితో కలిసి జీవించమని ప్రాధేయపడ్డారు. వంటరిగా నువ్వెందుకు ఇక్కడవుండాలి తల్లీ? మాకు కావలసినంత సంపద వుంది అనుభవించే వారు లేరు. ఇక అదంతా నీదే. ముసలివారం. మమ్మల్ని కని పెట్టి వుండేవారు లేరు. భారమంతా నీవే వహించి పుత్రశోకంతో బాధపడుతున్న మమ్మల్ని కరుణించు తల్లీ?”అంది వినోదు తల్లీ.ముసలాయన కూడా “అవునమ్మా రజనీ, ఇక మాకు నీకన్న ఆప్తులెవరు లేరమ్మా ! ఇంత జరిగిన తరువాత ఇంకా ఎన్నాళ్ళు బతుకుతామమ్మా, మా తరువాత ఏలాగయినా మా సర్వస్వము నీకే వస్తుంది. అంతవరకు కనిపెట్టి వుండే భారం కూడా నీదేనమ్మా! అన్నాడు.

సహృదయంతో, సదుద్దేశ్యంతో పలికిన మాటలవి. కాని వాటిలో అంతరార్ధం ఆమె గ్రహించకపోలేదు. రజని క్షణకాలం ఆలోచించింది. నిజంగా వారిపట్ల సానుభూతి ఆమెకు కలిగింది.

వృద్దులు పుత్రశోకంలో వున్నారు. ఎంతో ఆదరంతో ఆమెని ఆదరించారు. కాని వారి ఆహ్వానాన్ని అంగీకరిస్తే కలిగే పరిణామాలు ఆమె వూహించగలిగింది. మనస్సులో రామం మెదిలాడు. తక్షణం ఆమె నిశ్చయానికి వచ్చింది.

“మీ ఆదరానికి కృతజ్ఞురాలిని అమ్మా! కాని అది వీలు లేదు. నేనిక్కడ వుద్యోగం చేస్తున్నాను. అది వదలి రావటానికి వీలు లేదు” అంది.

“నీకు వుద్యోగం చేయ్యవలసిన అవసరమేముందమ్మా మావద్ద కావలసిన సిరిసంపదావున్నాయి. అదంతా ఇకనుంచీ నీదే” అన్నారు,

“అదంతా నేనేం చేసుకుంటాను చెప్పండి! మీ వినోద్ జ్ఞాపకార్థం ఏదైనా ధర్మసంస్థకి యివ్వండి-నా రెక్కలతో నేను జీవిస్తాను” అంది.

“నీ చేతికి వచ్చిన తర్వాత నీ యిష్టంవచ్చినట్లు చేసుకో అమ్మా! నువ్వు మాతో వచ్చి యీ కష్టపమయంలో ఓదార్పు కలిగించవమ్మా” అన్నారు.

“ఇప్పుడు కాదండీ! తర్వాత వీలయితే వస్తాను” అంది రజని.

“కాదమ్మా! ఇప్పుడే నీఅవసరం మాకు చాలావుంది. నీవే మావద్ద లేకపోతే మేమిక జీవించలేము” అన్నారు.

రజని క్షణకాలం మౌనంవహించి, “సరేనమ్మా! ఆలాగే వస్తాను” అంది.

ఆ మరునాటి సాయంకాలం రజని రామంలాడ్జికి బయలుదేరింది. ఆమెను చూచి రామం ముఖంచిట్లించుకున్నాడు.

రజని నవ్వుతూ “కళావిహీనమైన మీ సుందరవదనం నాకు కలవర పాటు కలిగిస్తోంది రామంబాబు” అంది.

రామం కోపంతో “పర స్త్రీలు పరిహాసమాడితే నాకు పరమ అసహ్యం” అన్నాడు.

క్రూరత్వమయిన ఆ మాటలు ములుకుల్లా ఆమె హృదయంలో గుచ్చుకున్నాయి. వినోద్ పరిచయమయిన దగ్గర్నుంచీ ఆమె భరించిన భారం, అనుభవించిన బాధ, చేసిన త్యాగం అతను ఏమాత్రము గుర్తించలేకపోయాడు. అన్నాళ్ళనుంచి అణచివుంచిన అలసట వుబికి వచ్చింది. దగ్గరిలో వున్న కుర్చీలో కూలబడి నీరసంగా నవ్వి “పురుషులు పర స్త్రీలని పిలిచే వారంతా అందని ద్రాక్ష పళ్లు” అంది.

“జీవితంలో అందాన్ని మించిన అంతస్థులు కూడా వుంటాయి రజనీ! అది మరచి ప్రవర్తిస్తున్నావు, అందరు నీ సౌందర్యానికి దాసోహమవుతారనుకుంటున్నావు” అన్నాడు కోపంతో.

“ఇతరులగురించి నేనేమనుకున్నా మీ గురించి నేనలాగే అనుకుంటున్నాను రామంబాబు, అలసివచ్చాను. కాసిని మంచినీళ్లు యివ్వండి” అంది.

రామం అయిష్టంగానే లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాడు. తిరిగి వచ్చేసరికి రజని గాఢనిద్రలో వుంది. సుందరమయిన ఆమె వదనం కాస్త వాడివుంది. మూసివున్న ఆ నేత్రాలలోంచి అలసట, అశాంతి తొంగిచూస్తున్నాయి. కాని రామాన్ని భయపెట్టి వళ్ళు జలదరింపజేసినది ఇంకొక విషయం. ఆమె ముఖానికి బొట్టు లేదు. అంతకుముందు కోపముతో ఆమెకేసి సరిగా చూడలేదు. ఎప్పుడు నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఆమెకు అలవాటు, రామానికి దుర్నివార్యంగా కన్నీరు వుప్పొంగివచ్చింది. వెంటనే లోపలికి వెళ్ళిఇల్లంతా గాలించాడు. కుంకుమ ఎక్కడా దొరకలేదు. చివరకు వీధిగుమ్మానవున్న కుంకుమ తీసి రామం కన్నీరు కారుస్తూ రజని ముఖాన బొట్టు పెట్టాడు. తాకిడికి రజనిని ఉలికిపడి లేచింది. చేత్తో ముఖం తడిమి చూచుకొని కుంకుమ చూచి నవ్వుతూ “పర స్త్రీ నిద్రిస్తున్నప్పుడు బొట్టు పెట్టడము పురుష లక్షణమా?” అంది.

రామం ఇంకా కన్నీరు కారుస్తూనే వున్నాడు. “అయితే యీ రోజు కుంకుమ ఎందుకు పెట్టుకోలేదు రజనీ!” అన్నాడు.

“కొన్నాళ్ళు వైధవ్యం పాటించాలని కోరిక కలిగింది వైధవ్యపు కఠోర నియమాలు ఆచరించి వాటి విలువ తెలుసుకోవాలనిపించింది. మన సమాజం స్త్రీలకు చేసే ద్రోహం అనుభవించి, ఆకళింపు జేసుకుందామనుకున్నాను. వచ్చిన యీఅవకాశాన్ని ఎందుకు జారవిడుచుకోవాలి? ఇదొక్కటేకాదు మిగతా నియమాలను కూడా ఆచరిస్తున్నాను” అంది.

రామం రజనికి ముఖం చూపించకుండా ప్రక్కకు తిరిగి కళ్లు తుడుచుకొంటూ “రజనీ! ప్రపంచంలో నువ్వెంతోమందికి నిస్వార్థంగా సహాయం చేస్తూవుంటావు నా యెడ నువ్వింత కఠినంగా, నిర్దాక్షిణ్యంగా ఎందుకు ప్రవర్తిస్తుంటావు రజని?” అన్నాడు.

రజని నవ్వుతూ “పర స్త్రీలమీద అధికారం చెలాయించేవారిని చూస్తే నాకు పరమ విసుగు” అంది.

రామం గద్గదస్వరంతో “నన్ను జీవచ్ఛవాన్ని చేసి, ఇంకా పరిహాసమెందుకాడతావు రజనీ?” అన్నాడు.

రామం ముఖం రజనికి కనబడడం లేదు. వెనుకకు తిరిగి నిలబడివున్నాడు. రజని కుర్చీలోంచి లేచి రామానికి ఎదురుగా నిలబడి “నేను అందుకు ఇక్కడకు రాలేదు రామంబాబూ! వీడ్కోలు చెప్పటానికి వచ్చాను'' అంది.

దగ్గరలో పిడుగుపడినట్లు వులికిపడ్డాడు రామం. “వీడ్కోలా! ఏమిటి వీడ్కోలు? ఎక్కడికి వెళుతున్నావు రజనీ!” అన్నాడు.

“నానుంచి దూరంగా వుండాలనే కోరికతో మీరు ఢిల్లి వదలి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నారని విన్నాను. నా మూలంగా మీరిలా చెయ్యడం నాకిష్టం లేదు. అందుకనే నే వెళ్ళిపోతున్నాను. వినోద్ తల్లిదండ్రులతో కలసి కలకత్తా రేపే బయలుదేరి వెళుతున్నాను” అంది.

రామం హృదయం దుఖంతో నిండిపోయింది కలవరపాటు “కోపంతో నేనన్న మాటలని ఆధారం చేసుకొనినాకిలా అన్యాయం చేస్తావా రజనీ? ఇదివరకోసారి నిన్ను కాపాడుకొన్నాను. మళ్ళా యీసారి నన్నిలా ఎందు కేడిపిస్తావురజనీ” అన్నాడు.

“కష్టసమయంలో వారిని ఆదుకోవటం నా ధర్మం కాదా రామంబాబూ. ఏకైక పుత్రుడు మరణించాడు. కొన్నాళ్లు వారివద్ద వుంటే వారికి కొంత వూరటకలుగుతుంది కదా?” అంది.

“వారికి కలుగుతుంది రజనీ! కానీ ఎంత సేపూ ఇతరుల ధ్యానమే కానీ నా కష్టాలనిగురించి నువ్వెప్పుడూ ఆలోచించవు. నువ్వెంత నిర్లక్ష్యం చేసినా నీ వెంట గ్రహంలా తిరుగుతుంటానని నీకు తెలుసు” అన్నాడు.

రజని రామం కళ్ళల్లోకి మార్దవంతో చూస్తూ “కట్టుబాట్లు,క్రమబద్ధాలూ నాకు గిట్టవని మీకు తెలుసు రామంబాబు.అది తెలిసి కూడామీరు నాకు హృదయంలో చోటెందుకిచ్చారు?” అంది.

సూటి అయిన ప్రశ్న.. పొంగిపొర్లే దుఃఖాన్ని బలవంతాన అణచుకొంటూ “రాత్రింబవళ్ళు నేను పోరాడేను రజనీకి? కాని చివరకు నేను ఓడిపోయారు. ఇదంతా మొదటినుంచీ నీకు తెలుసు. అయినా నన్ను ఇలా ఎందుకడుగడుగునా అడుగుతుంటావు రజనీ?” అన్నాడు.

“మీకు కష్టం కలిగించినా ఒక మాట చెప్పక తప్పదు రామంబాబూ! కేవలం కష్టనష్టాలు, సుఖదుఃఖాలు నా జీవితానికి గీటురాయి కాదు. వాటికి వెరచి నేనేమి జీవితంలో సాధించలేను” అంది.

“అస్పష్టమైన నీ ఆశయాలకి నన్ను బలి చేస్తావారజనీ?” అన్నాడు.

“అలాంటి దుర్దినం రాకూడదనే నాఆశ రామం బాబూ! సమయానికి అందుబాటులోనే వుంటాను. కలకత్తా ఏమి పరదేశంకాదు, అవసరానికి నేను వెనుదీయనని మీకు మాట ఇస్తున్నాను. ఇక నన్ను సంతోషంతో సాగనంపండి” అంది.

“సరే రజనీ! వెళ్ళు. కాని వైధవ్యం పాటించనని నాకు మాటియ్యి. నేను ఇది సహించలేను” అన్నాడు.

“మాటిచ్చి తప్పాననే అభాండం కూడా నా మీద వెయ్య ప్రయత్నిస్తున్నారా! నాకేమి యిందులో నమ్మకం వుండి చెయ్యటం లేదు. అనుభవంకోసం,ఆత్మనిగ్రహం కోసమూ చేస్తున్నాను ఎప్పుడువిసిగితే అప్పుడే వదిలేస్తాను” అంది నవ్వుతూ.

“విచిత్రవ్యక్తిని అప్పుడప్పుడు తలచుకొంటూంటే భయంవేస్తోంటూంది రజని “మానసీకంగా నీ అంతస్థుకి అందే వ్యక్తులు ఎవరు లేరు” అన్నాడు.

“విచిత్రవ్యక్తిని కాదు రామంబాబూ వెర్రిదానిని” అంది రజని నవ్వుతూ.

******