ఇదంతా బయట నిలబడి చూస్తున్న అయాన్, ఆ దృశ్యాలను తన మెమరీలో సేవ్ చేసుకున్నాడు. మనుషుల మధ్య ఉండే ఈ విడదీయరాని బంధాన్ని, ఒకరు లేనప్పుడు మరొకరు పడే ఆ వేదనను చూసి.. ఒక యంత్రమైనా సరే, అయాన్ లోపల ఏదో తెలియని అనుభూతి కలిగింది.రాజు గారు వెళ్తూ.. "అయాన్! నేను ఇంట్లో ఉండను కదా, నువ్వే అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి" అని బాధ్యత అప్పగించారు. "అలాగే సార్!" అని అయాన్ ఆయన సూట్‌కేస్ కారులో పెట్టి, సాగనంపి తిరిగి అపార్ట్‌మెంట్‌లోకి వచ్చాడు.అయాన్ లిఫ్ట్ దగ్గరకు రాగానే, అక్కడ ఉన్న కొందరు అమ్మాయిలు అతడిని చూసి ఆశ్చర్యపోయారు. "ఎవరీ హ్యాండ్‌సమ్ బాయ్?" అనుకుంటూ అతని చుట్టూ చేరారు. లిఫ్ట్ ఎక్కనివ్వకుండా అతడిని ప్రశ్నలతో ముంచెత్తారు. "ఎవరు నువ్వు? ఏ ఫ్లాట్ మీది?" అని అడుగుతుంటే అయాన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడ్డాడు.అంతలో కొందరు ఆకతాయి అబ్బాయిలు కూడా అక్కడికి వచ్చారు.