ఆ వయసు కుర్రాళ్ళలా అతని కలలు అందమైన అమ్మాయిల చుట్టూ తిరగవు! ఆశలు అసామాన్యమైన ఆనందాలను అందుకోవాలని ఆరాటపడవు!! అతను కలలు కనేది వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం! ఆశపడేది కొత్త కొత్త పథకాలతో వ్యాపారాభివృద్ధి చేసి ఆనందించడం కోసం!! వెరసి అతని ఆశయాలు చేపట్టిన వ్యాపార రంగాల్లో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చెయ్యాలనే సంకల్పాలతో నిండి ఉంటాయి. కానీ అందమైన ఆడపిల్లల కలల రాకుమారుడు అతను. లేలేత పరువాల ఆందాల మల్లెతీగలెన్నో అతనిని అల్లుకోవాలనుకుంటాయి. అవేవీ అతని మనసుని తాకవు. అమ్మాయిలతో స్నేహం అతనికి కొత్త కాదు. కానీ ఏ అమ్మాయీ అతని గుండె గదివరకూ రాలేదిప్పటివరకు. ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వడు కౌశల్. అపురూపమైన ఏ అపరంజి బొమ్మ అయినా అతనికి తారసపడినప్పుడు, అతని హృదయం క్షణకాలమైనా చలిస్తుందా, లేదా అని చాలా మందికి సందేహంగా ఉంటుంది అతనిని చూస్తే.